హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్‌లో స్టూడెంట్ల పాస్ పర్సంటేజీ పెంచేందుకు ఇంటర్ బోర్డు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే సిలబస్ తగ్గించి, క్వశ్చన్లలో చాయిస్ పెంచిన బోర్డు.. తాజాగా సెకండియర్ స్టూడెంట్లకు టీవీల్లో ప్రాక్టికల్స్ పాఠాలతో పాటు ఇంపార్టెంట్ క్వశ్చన్లనూ చెప్పాలని నిర్ణయించింది. ప్రాక్టికల్స్‌కు ఈనెల 20 నుంచి మార్చి 20 దాకా క్లాసులను చెప్పనున్నట్టు అధికారులు షెడ్యూల్ రిలీజ్చేశారు. ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల దాకా ప్రాక్టికల్స్‌ను టీవీ పాఠాల ద్వారా చెప్పనున్నారు. ఒక్కోరోజు ఐదు ప్రాక్టికల్ పీరియడ్లు నిర్వహించనున్నారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు, ఏప్రిల్ 20 నుంచి థియరీ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్టు బోర్డు ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఇక, 21 నుంచి ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్ల గురించి క్లాసులు చెప్పనున్నారు. అరగంట చొప్పున రోజూ నాలుగు సబ్జెక్టుల్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్లను వివరించనున్నారు. సెకండియర్ చదువుతున్న స్టూడెంట్లకు ఫస్టియర్ పరీక్షలు నిర్వహించగా, సగం మంది కూడా పాస్ కాలేదు. ఈ నేపథ్యంలోనే ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
