గ్రేటర్​లో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాలు

గ్రేటర్​లో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాలు

హైదరాబాద్‌‌, వెలుగు: సిటీలో అంతర్రాష్ట్ర ముఠాలు చొరబడ్డాయి. వరుస చోరీలతో జనాలను  భయందోళనలకు గురిచేస్తున్నాయి. శివారు ప్రాంతాల్లోని ఇండ్లను టార్గెట్ చేసి దోచేస్తున్నాయి. సోమవారం ఒక్కరోజే కూకట్‌‌పల్లిలో 8 చోరీలు జరిగాయి. మంగళవారం మేడ్చల్‌‌ జిల్లా శామీర్‌‌‌‌పేట్‌‌ పరిధి ఉద్దెమర్రిలో వైన్స్ షాప్ సిబ్బందిపై దాడి చేసి డబ్బులు తీసుకెళ్లడమే కాకుండా ఎదురుతిరిగిన వారిని బెదిరించేందుకు గన్​తో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. తాజాగా మంగళవారం అర్ధరాత్రి ఎల్​బీనగర్ పరిధి చంద్రపురి కాలనీలో 2 ఇండ్లు, 1 ఆఫీసులో చోరీకి పాల్పడి బంగారం, వెండి ఎత్తుకెళ్లారు. అదే కాలనీలోని 5 ఆఫీసుల్లో దొంగతనానికి యత్నించారు. ఈ ఘటనల్లో దొంగలు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారు.  

బిహార్, యూపీ గ్యాంగ్స్..

అంతర్రాష్ట్ర ముఠాలు ఈ దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులకు ఆధారాలు దొరికాయి. కూకట్‌‌పల్లిలో జరిగిన చోరీలు, ఉద్దెమర్రిలో వైన్స వద్ద కాల్పులు, దోపిడీకి పాల్పడినది బిహార్​కు చెందిన ‌‌గ్యాంగ్‌‌గా పోలీసులు గుర్తించారు. బిహార్‌‌‌‌, యూపీ, రాజస్థాన్‌‌, ముంబయికి చెందిన ముఠాలు సొంతూళ్లను వదిలి మెట్రో సిటీస్‌‌లో షెల్టర్‌‌ ‌‌తీసుకుంటున్నట్లు సమాచారం. ఫోకస్ ​తక్కువగా ఉండే రైల్వే స్టేషన్ల సమీపంలోని లాడ్జీలు, ప్లాట్‌‌ఫామ్‌‌లపై ఉంటూ తమపై పోలీసులు నిఘా తగ్గిన తర్వాత మళ్లీ చోరీలు మొదలుపెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రతి ఏటా జనవరి, జూన్‌‌, నవంబర్‌‌ ‌‌నెలల్లోనే ఈ ముఠాలు ఎక్కువగా దోపిడీలకు పాల్పడుతుంటాయి. ప్రస్తుతం మూడ్రోజుల వ్యవధిలో జరిగిన వరుస దొంగతనాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. చోరీలు జరిగిన విధానం, ఫింగర్‌‌‌‌ ప్రింట్స్‌‌, ఓల్డ్‌‌ అఫెండర్స్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

వంటమనిషులు, డ్రైవర్లుగా చేరి..

బిహార్‌‌‌‌లోని మధుబని జిల్లాకు చెందిన ముఖియా గ్యాంగ్‌‌ సభ్యులు సిటీకి వచ్చి ఇండ్లలో పని మనుషులు, డ్రైవర్, వంట వాళ్లుగా చేరుతున్నారు. నమ్మకంగా ఉంటూ ఆపై యజమానుల ఇండ్లలోనే చోరీలకు పాల్పడుతున్నారు.  ఇలా దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద సిటీల్లో దోపిడీలు చేస్తున్నారు. చోరీ సమయంలో ఎవరైనా అడ్డుకుంటే వారిపై దాడి చేసి హతమార్చేందుకు కూడా ముఖియా గ్యాంగ్ వెనుకాడటం లేదు. గతేడాది డిసెంబర్​లో బంజారాహిల్స్​లో  రూ. కోటి 50 లక్షల విలువైన  వజ్రాలు, బంగారం దోపిడీ కేసులో ఈ గ్యాంగ్‌‌ లోని కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2005 నుంచి వరుస చోరీలు చేస్తూ ఢిల్లీ, పాట్నా, చెన్నై , చండీగఢ్​లో ఈ గ్యాంగ్‌‌ మోస్ట్ వాంటెడ్ గా పోలీస్ రికార్డుల్లో ఉంది. యూపీకి చెందిన కక్రల్ ​గ్యాంగ్ ​రెండేండ్ల క్రితం పటాన్‌‌ చెరు, జగద్గిరిగుట్టలోని జువెల్లరీ షాప్​లో దోపిడీ చేసింది. ఈ ముఠాను సైబరాబాద్‌‌ పోలీసులు అరెస్ట్ చేశారు. వీటితో పాటు మరికొన్ని గ్యాంగ్స్ ​కూడా సిటీలో చోరీలకు పాల్పడుతున్నాయి.

రైళ్లు, విమానాల్లో ఎస్కేప్​..

వరుస చోరీలకు పాల్పడుతున్న దోపిడీ గ్యాంగ్స్ తప్పించుకుంటూ పోలీసులకు సవాళ్లు విసురుతున్నాయి. సెల్​ఫోన్లు వాడకుండా చాకచాక్యం  వహిస్తున్నాయి. చోరీ తర్వాత వీరంతా గుంపుగా ఒకచోటికి చేరడం గానీ, ఎవరికి వాళ్లు విడిపోయి సిటీకి దూరంగా వెళ్లి అక్కడ కలుసుకుంటున్నారు. ఆ తర్వాత రైళ్లు, విమానాల్లో ఎస్కేప్​ అవుతున్నారు. మళ్లీ అదును చూసుకొని సిటీకి వచ్చి దోపిడీలకు ప్లాన్​ చేస్తున్నారు. దీంతో వీరిని పట్టుకోవడం పోలీసులకు సవాల్​గా మారింది.

చంద్రపురి కాలనీలో దొంగల బీభత్సం

  • 2 ఇండ్లు, ఒక ఆఫీసులో చోరీ ..
  • 20 తులాల బంగారం మాయం
  • 5 ఆఫీసుల్లో దొంగతనానికి యత్నం

ఎల్​బీనగర్: ఎల్ బీనగర్ పరిధి చంద్రపురి కాలనీలో అర్ధరాత్రి దొంగలు వరుస చోరీలు చేశారు. ​పోలీసుల వివరాల ప్రకారం..  ఇద్దరు దొంగలు మంగళవారం అర్ధ
రాత్రి చంద్రపురి కాలనీలోని 2 ఇండ్లల్లోకి చొరబడి 20 తులాల బంగారం, 25 కిలోల వెండి, ఒక ఆఫీసులో 50 వేల క్యాష్, ఓ డాక్టర్ ఇంట్లో ల్యాప్ టాప్​ దొంగిలించారు. ఆ తర్వాత అదే కాలనీలోని 5 ఆఫీసుల్లో చోరీకి యత్నించారు. బుధవారం ఉదయం ఎల్​బీనగర్ డీసీపీ సంప్రీత్ సింగ్, ఏసీపీ శ్రీధర్ రెడ్డి, ఇన్​స్పెక్టర్ అంజిరెడ్డి చంద్రపురి కాలనీని పరిశీలించారు.  చోరీ జరిగిన ఓ ఇంట్లోని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఇద్దరు దొంగలు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. అందులో ఒకరు ఏపీకి చెందిన వ్యక్తిగా, మరొకరు కర్ణాటకకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు.