ఇండ్లు కొల్లగొడుతున్నరు..వరంగల్ నగరంలోకి ఎంటరైన ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్

ఇండ్లు కొల్లగొడుతున్నరు..వరంగల్ నగరంలోకి ఎంటరైన ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్
  • సిటీ శివారు ప్రాంతాలను టార్గెట్ చేసి దొంగతనాలు
  • నాలుగు రోజుల్లోనే 10కి పైగా చోరీలు
  • వరుస ఘటనలతో జనాల్లో కలవరం
  • అలెర్ట్ గా ఉండాలంటున్న పోలీసులు

హనుమకొండ, వెలుగు: దసరా, దీపావళి పండుగల సీజన్ వచ్చేసింది. చాలామంది ఇండ్లకు తాళాలు వేసి, పుట్టింటికో, బంధువుల ఇండ్లకో వెళ్తున్నారు. ఇంకొందరు సెలవులు వచ్చాయని టూర్లకు పోతున్నారు. ఇదే అదనుగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు చోరీలకు తెగబడుతున్నారు. నగర శివారు ప్రాంతాలను టార్గెట్ చేసి అందినకాడికి దోచేస్తున్నారు. 

గడిచిన నాలుగు రోజుల్లోనే ట్రై సిటీ శివారు ప్రాంతాల్లో పదికిపైగా చోరీలు జరగగా, అందులో చాలావరకు పేద, మధ్య తరగతి కుటుంబాలే ఉండటం గమనార్హం. ఇదిలాఉంటే నగరంలోకి ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ ఎంటరయ్యాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

సిటీలో అంతర్రాష్ట్ర ముఠాలు..

వరంగల్ నగరానికి బస్సు, రైలు మార్గాలతో మెరుగైన కనెక్టివిటీ ఉండటంతో అంతర్రాష్ట్ర ముఠాలు ట్రై సిటీలోకి ఎంటర్ అవుతున్నాయి. యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి రైలు మార్గంలో రావడం,  రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద బండ్లు కొట్టేసి వాటిపై సిటీలో తిరుగుతూ చోరీలకు పాల్పడటం వారికి అలవాటైపోయింది. 

గతంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోగా, పోలీసులు కొంతమందిని పట్టుకుని కటకటాల వెనక్కి పంపించారు. కానీ, పండుగల సందడి మొదలవడంతో ఇప్పుడు మళ్లీ దొంగల అలజడి ఎక్కువైంది. తాజాగా జరుగుతున్న దొంగతనాల నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు అలర్ట్ అయ్యారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించేపనిలో పడ్డారు. సోషల్ మీడియా వేదికగా ప్రజలను అప్రమత్తం చేసేలా చర్యలు చేపడుతున్నారు. 

శివారు ప్రాంతాలే టార్గెట్..

సిటీ ఔట్ స్కర్ట్స్ నుంచి ఈజీగా పారిపోయే అవకాశం ఉండటంతో దుండగులు ఔట్ స్కర్ట్స్ తోపాటు తండాలను కొల్లగొడుతున్నట్లు స్పష్టమవుతోంది. గడిచిన నాలుగైదు రోజుల్లో 10కిపైగా దొంగతనాలు జరగగా, అవన్నీ నగర శివారు ప్రాంతాల్లోనే జరిగాయి. ఈ నెల 20న రాత్రి గీసుగొండ దస్రు తండాకు చెందిన బాదావత్ ఈర్య, అంగోతు స్వామి ఇంట్లో దొంగలు పడ్డారు.

 అడ్డుకోబోయిన స్వామిపై దుండగులు దాడి చేసి పరారయ్యారు. అదే రోజు రాత్రి గీసుగొండ మండలం విశ్వనాథపురంలో ఒకేసారి మూడు ఇండ్లలో చోరీ జరిగింది. కాంట్రాక్టర్ వాంకుడోతు రవీందర్, ఆకినెపల్లి ప్రదీప్, భూక్య భిక్షపతి ఇండ్లలో దొంగలు పడి అందినకాడికి దోచుకెళ్లారు. నగర శివారు మిల్స్ కాలనీ పీఎస్ పరిధి బీఆర్ నగర్ లో రెండు రోజుల వ్యవధిలో ఐదు దొంగతనాలు జరిగాయి. 

బీఆర్ నగర్ లో గుగులోతు మంజుల, శంకర్ ఇంటి వద్ద నిద్రిస్తుండగా, దుండగులు దాదాపు నాలుగు తులాల పుస్తెలతాడు, కమ్మలు దోచుకెళ్లారు. అశోక్ అనే వ్యక్తికి చెందిన ఫోన్ ఎత్తుకెళ్లారు. 21న రాత్రి బానోతు రమేశ్ ఇంట్లో ఇద్దరు వ్యక్తులు చొరబడి 25 గ్రాముల గోల్డ్, 15 వేల నగదును ఎత్తుకెళ్లారు. అలజడికి లేచిన రమేశ్ భార్య గిరిజ పై దాడి చేసి పరారయ్యారు.

 ఆ పక్కనే ఉండే పాలకుర్తి దాసుకు చెందిన ఫోన్, అక్కడుండే టీఎస్ 04 యూసీ 6919 లారీని కూడా ఎత్తుకెళ్లారు. ఈ నెల 17న కేయూ పీఎస్ పరిధి మధుతండాలో ఓ భారీ చోరీ జరిగింది. పోరిక అనిత కుటుంబ సభ్యులు తన భర్త అస్తికలు గంగలో కలిపేందుకు ఇంటికి తాళం వేసి కాళేశ్వరం వెళ్లగా, తిరిగివచ్చేసరికి 18.5 తులాల గోల్డ్, 20 తులాల వెండి, రూ.5 లక్షల నగదును దొంగలెత్తుకెళ్లడం గమనార్హం. ఈ నెల 12న ఇదే మధుతండాలోని భక్తాంజనేయస్వామి, దుర్గామాత ఆలయాల్లో దాదాపు రూ.40 వేల విలువైన నగల చోరీ జరిగింది. 

అప్రమత్తంగా ఉండాలి

పండుగల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా స్థానిక పీఎస్ లో సమాచారం ఇవ్వాలి. లేదంటే గ్రామ పోలీస్ అధికారులకైనా చెప్పాలి. స్వీయ రక్షణ కోసం ఇండ్లలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 87126 85257 కు సమాచారం ఇవ్వండి. - సన్ ప్రీత్ సింగ్, వరంగల్ సీపీ