
- అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్, రూ.16 లక్షల సామగ్రి స్వాధీనం
కామారెడ్డి, వెలుగు: పగలు ఐస్‌క్రీమ్‌లు అమ్ముతూ, రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలోని ఐదుగురు యూపీనుంచి వలస వచ్చి హైదరాబాద్, కామారెడ్డిలో మకాం వేశారు. కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. యూపీలోని హర్డోయ్ జిల్లాకు చెందిన తానే అలీ, బిర్దేశ్అలీ, సల్మాన్, మహమ్మద్ సమీర్, చాంద్‌బాబు కొన్నాళ్ల కింద హైదరాబాద్‌కు వచ్చారు. కామారెడ్డిలోని పలు కాలనీల్లో నివాసం ఉంటున్నారు.
పగలంతా ఐస్‌క్రీమ్ లు అమ్ముతూ ఆయా ప్రాంతాలను పరిశీలించి రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడేవారు. భిక్కనూరు, మాచారెడ్డి పోలీస్స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడ్డారు. ఫార్మా కంపెనీలో మిషనరీ, బైక్, సెల్ఫోన్లు, సెంట్రింగ్ సామాను దొంగిలించి హైదరాబాద్ ముషీరాబాద్‌లోని స్ర్కాప్ షాపులో అమ్మేశారు. చోరీలు చేసేందుకు స్క్రాప్ షాప్ ఓనర్ హసన్ వెహికల్ సమకూర్చేవాడు. ముఠా సభ్యులతో పాటు స్క్రాప్ షాప్ ఓనర్ ను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.16 లక్షలు విలువ చేసే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ చైతన్య రెడ్డి, సీఐలు సంపత్‌కుమార్, ఎన్ శ్రీనివాస్, రామన్, ఎస్సైలు అంజనేయులు, ఉస్మాన్, అనిల్, ఏఎస్సై వెంకట్రావును ఎస్పీ అభినందించారు.