
హైదరాబాద్ లోని యువత కొత్త మత్తుతో చిత్తవుతోంది. మత్తుకు బానిసై ప్రాణాంతక రసాయనాలతో తమ జీవితాలను ఛిద్రం చేసుకుంటోంది. ఇందులో హెరాయిన్, కొకైన్ లాంటి డ్రగ్స్ తో పాటు పేపర్ పై అక్షరాలను చెరిపే వైట్నర్ తో మత్తులోకి జారుతోంది. బుక్ స్టేషనరీలు, కిరాణా షాపుల్లో అతి తక్కువ ధరకే లభించే వైట్నర్ తో పాటు నెయిల్ పాలిష్ రిమూవర్ తో కొత్త మత్తులో జోగుతోంది. వైట్నర్ కొనడానికి, అమ్మడానికి ఎలాంటి అవరోధాలు లేకపోవడంతో వైట్నర్ మత్తులో అమాయక యువకులు ప్రాణాలు తీసుకుంటున్నారు. వైట్నర్ తో పాటు నెయిల్ పాలిష్ ను తమకు మత్తు మందుగా వాడుతున్నారు. దీనికి పాతబస్తీ యువతే ఎక్కువగా బాధితులు అవుతున్నారు. వీరిలోను చదువుకోని యువతీ, యువకులు రోడ్లపై చెత్త సేకరించే వారితో పాటు అడ్డా కూలీలు వైట్నర్ కు బానిసలవుతున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్, పబ్లిక్ గార్డెన్స్, కోఠి సహా ఫుట్ పాత్ పై జీవనం సాగించే వారే ఈ వైట్నర్ కు బానిసలవుతున్నారని పోలీసులు గుర్తించారు.
వైట్నర్తో మత్తు….
వైట్నర్మత్తుకు అలవాటుపడిన వారు దాడులకు కూడా వెనుకాడడం లేదు. ఇలాంటి వారి మెదడు మొద్దుబారి ప్రవర్తనలో మార్పులు వస్తాయి. తెలియని మైకంలోకి వెళ్లి విచక్షణ కోల్పోతారు. ఇందులో రైలు పట్టాలు, బస్టాండ్లు, ఫుట్ పాత్ లపై జీవనం సాగించే వారే వైట్నర్ కు బానిసలౌతున్నారు. ఈ మత్తులో హత్యలు, అత్యాచారాలకు పాల్పడిన ఘటనలు పోలీసుల దృష్టికి వచ్చాయి. ఇలా సిటీలో వెయ్యి మందికి పైగా వైట్నర్ బానిసలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు జరిపిన దాడుల్లో పాతబస్తీలోనే వందల మందిని అదుపులోకి తీసుకున్నారు. మత్తు పదార్థాలకు బానిసలైన వారి వివరాలు సేకరించి ప్రత్యేక నిఘా పెట్టారు. వైట్నర్ బాధితులు ఎక్కువగా ఉన్న పాతబస్తీ, నాంపల్లి, సికింద్రాబాద్, అఫ్జల్ గంజ్ మూసి పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు.
ఫలక్ నుమాలోనే రెండు ఘటనలు...
ఈ నెల 5న ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వైట్నర్ దాడులే ఇందుకు అద్దం పడుతున్నాయి. ఈ కేసులో పోలీస్ స్టేషన్ లో ఇద్దరు మహిళలు వీరంగం సృష్టించారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని పోలీసులపైకి చెప్పులు విసిరారు. మదన్ ఖాన్ మల్గీకి చెందిన షబానా(32), జబీన్(31), అయేషా(30), పర్వీన్(30), ఫాతిమా నగర్ కు చెందిన గోరిబీ(50) ఇంట్లో ఆమె కూతురుతో గొడవపడ్డారు. ఆ తరువాత గోరిబీ మైనర్ కూతురును తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీంతో గోరిబీ ఫలక్ నుమా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా గోరిబీ కూతురు పోలీసులు కాపాడారు. బాలికను తీసుకెళ్ళిన నలుగురు మహిళలను విచారించి గొడవకు కారణం వైట్నర్ మత్తుగా తేల్చారు.
గతేడాది ఇలాంటిదే…
ఇలాంటిదే గతేడాది అక్టోబర్ 24న కొంతమంది హంగామా సృష్టించారు. ఇది కూడా ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోనే కావడంతో అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఆ రోజు వైట్నర్‌మత్తులో మునిగిన ముగ్గురు మహిళలతో పాటు మరో నలుగురు పురుషులు ఒకరిపై ఒకరు కత్తులు, బ్లేడ్లతో దాడి చేసుకున్నారు. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఓ మహిళ బ్లేడ్‌తో తన చేతి నరాలు కోసుకోవటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అందరినీ అరెస్ట్ చేశారు. గాయపడ్డవారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు జరిపారు. వైట్నర్ మత్తు కారణంగానే వాళ్ళంతా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నట్లు గుర్తించారు.
వరుస ఘటనలతో ….
వరుస ఘటనల నేపధ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. పాతబస్తీలో నమోదైన వైట్నర్ కేసులతో యువత వైట్నర్ కు బానిసవుతోందని గుర్తించారు. మత్తుకు బానిసైన యువత, విద్యార్థులు, అడ్డా కూలీలు వైట్నర్ ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని సీపీ అంజనీకుమార్తెలిపారు. దీంతో రోడ్లపై న్యూసెన్స్ పెరుగుతోందన్నారు. ఇలాంటి వారిని నియంత్రించేందుకు స్పెషల్ బ్రాంచ్ లో ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. వైట్నర్ విక్రయించే స్టేషనరీలు, షాపుల యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా కానీ వైట్నర్ ను సేవిస్తున్నారని అనుమానం వస్తే డయల్100కు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సీపీ చెప్పారు.