కష్టాలన్నీ దాటేసి..ఆకాశమంత ఎత్తుకు ఆకాశ్ దీప్

కష్టాలన్నీ దాటేసి..ఆకాశమంత ఎత్తుకు ఆకాశ్ దీప్

అరంగేట్రం టెస్టులోనే సెన్సేషనల్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌తో అదరగొట్టిన బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్‌‌‌‌‌‌‌‌ జీవితం సినిమా స్టోరీని మించేలా సాగింది. కష్టాలతో సావాసం చేస్తూ.. అనేక అడ్డంకులను దాటుకుంటూ తను ఈ స్థాయికి చేరుకున్న తీరు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. బీహార్‌‌‌‌‌‌‌‌లోని ససారమ్‌‌‌‌‌‌‌‌లో పుట్టిన ఆకాష్ దీప్‌‌‌‌‌‌‌‌కు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే పిచ్చి. కానీ, తండ్రి రామ్‌‌‌‌‌‌‌‌జీ సింగ్ మాత్రం ‘క్రికెట్ తిండి పెడుతుందా? బుద్ధిగా చదువుకో’ అని వారించేవాడు.

రహస్యంగా క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఆడుతున్నాడని తెలిసి ఆకాశ్‌‌‌‌‌‌‌‌ను కొట్టేవాడు. పక్కింటి తల్లిదండ్రులు సైతం క్రికెట్‌‌‌‌‌‌‌‌ మాయలో పడి జీవితం నాశనం చేసుకుంటున్న ఆకాశ్‌‌‌‌‌‌‌‌ను కలవొద్దని తమ పిల్లలకు చెప్పేవారు. దాంతో,  ఉద్యోగం చేస్తాననే సాకుతో ఆకాశ్‌‌‌‌‌‌‌‌ దుర్గాపూర్‌‌‌‌‌‌‌‌కు వెళ్లాడు. అక్కడ తన మామయ్య సపోర్ట్‌‌‌‌‌‌‌‌తో లోకల్ అకాడమీలో చేరాడు. తన పేస్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ను ఇంప్రూవ్‌‌‌‌‌‌‌‌ చేసుకునే ప్రయత్నం చేశాడు.

కానీ, 2015లో  ఆకాశ్ తండ్రి పక్షవాతానికి గురై మరణించాడు. రెండు నెలల్లోనే అన్న కూడా మృతి చెందాడు. దాంతో ఆకాశ్ జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. కుటుంబ భారం తనపై పడటంతో మూడేండ్ల పాటు ఆటకు దూరమయ్యాడు. కరోనా టైమ్‌‌‌‌‌‌‌‌లో తల్లికి ఆరోగ్య సమస్యలు రావడంతో ఆమె వైద్య  ఖర్చులు సంపాదించేందుకు ఆకాశ్‌‌‌‌‌‌‌‌కు క్రికెట్టే దిక్కయింది. ఇందుకోసం బెంగాల్‌‌‌‌‌‌‌‌ వెళ్లడం అతని కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్చింది. బెంగాల్‌‌‌‌‌‌‌‌లో క్లబ్ క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఆడుతూ వచ్చిన డబ్బుతో తల్లికి ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ చేయించాడు. ఈ క్రమంలో విజన్ 2020 ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌లో  బెంగాల్ పేసర్ రణదేవ్‌‌‌‌‌‌‌‌ బోస్‌‌‌‌‌‌‌‌తో కలిసి చేసిన ఆకాశ్‌‌‌‌‌‌‌‌ను ఎట్టకేలకు అదృష్టం తలుపుతట్టింది.

ఈ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ ద్వారా అతను బెంగాల్ అండర్– 23 జట్టుకు ఎంపికయ్యాడు. అంతకుముందు వరకు టెన్నిస్ బాల్‌‌‌‌‌‌‌‌తో మాత్రమే ఆడిన ఆకాశ్‌కు ఏజ్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఆడిన అనుభవం లేదు. అయినా బెంగాల్‌‌‌‌‌‌‌‌ అండర్‌‌‌‌‌‌‌‌–‌‌‌‌‌‌‌‌23 జట్టు తరఫున సత్తా చాటాడు. ఆపై రంజీ ట్రోఫీ అరంగేట్రం,  ఆ తర్వాత ఆర్సీబీ నుంచి చాన్స్‌‌‌‌‌‌‌‌ రావడంతో అతని కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మారిపోయింది. ఇప్పుడు తల్లి ముందు ఇండియా తరఫున టెస్టు అరంగేట్రం చేశాడు.  అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌16, అండర్19 క్రికెట్ ఆడకపోయినా అద్భుత ప్రతిభతో 27 ఏండ్లకు టీమిండియాలోకి వచ్చేందుకు ప్రతీ అడ్డంకినీ  అధిగమించాడు.. క్రికెట్ ఆడొద్దన్న తండ్రి జీవితంలో ఏదో ఒకటి సాధించాలని తనకు చెప్పేవాడని ఆకాశ్ గుర్తు చేసుకున్నాడు.  తొలి రోజు మూడు వికెట్ల పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ను తండ్రికి అంకితం ఇచ్చాడు.