
- పార్టీలో ప్రాధాన్యమివ్వడం లేదని ఆవేదన
- కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం
కరీంనగర్, వెలుగు : లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి జిల్లాలో ఊహించని షాక్ తగిలింది. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి గురువారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లెటర్‌ను అనుచరుల ద్వారా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పంపించారు. హుజూరాబాద్ బై ఎలక్షన్ టైంలో బీఆర్ఎస్ లో చేరిన ఆయన కొన్నాళ్లుగా పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల కరీంనగర్ లో జరిగిన కదనభేరి సభలోనూ తనకు ప్రాధాన్యమివ్వకపోవడంతో నొచ్చుకున్నారు.
‘హుజూరాబాద్ ఉప ఎన్నికలో పార్టీ తరఫున పోటీ చేయాలని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి కావాలని మీరు ఆహ్వానిస్తే చేరాను. తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో మీరు నిర్ణయించిన పార్టీ అభ్యర్థి కోసం పని చేశాను. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్, హుజూరాబాద్ నియోజకవర్గాల ఇన్ చార్జీగా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశాను. అయినా నాకు సముచిత గౌరవం లభించలేదు.
నా మనోభావాలు, ఆత్మగౌరవం దెబ్బ తినేవిధంగా ఉన్న పార్టీ అధిష్ఠాన వ్యవహార శైలి నచ్చక పార్టీ ప్రాథమిక సభ్వత్వానికి రాజీనామా చేస్తున్నాను. నా ఆత్మీయులు, శ్రేయోభిలాషులతో చర్చించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం ప్రకటిస్తాను’ అని పెద్దిరెడ్డి తన రాజీనామా లెటర్లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ను వీడిన పెద్దిరెడ్డి త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలిసింది.