విద్యుత్ ఒప్పందాలపై విచారణ చేయించాలె

విద్యుత్ ఒప్పందాలపై విచారణ చేయించాలె
  •      బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: విద్యుత్ కొనుగోలు విషయంలో గత బీఆర్ఎస్ సర్కారు పాల్పడిన అక్రమాలపై ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు విచారణ జరిపించకుండా మీనమేషాలు లెక్కిస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. చవకగా వచ్చే విద్యుత్​ను కాదని కమీషన్ల కోసం, గత కేసీఆర్​సర్కారు ఇతర సంస్థల నుంచి ఎక్కువ ధరతో విద్యుత్ కొనుగోలుకు ఒప్పందాలు చేసుకున్నదని ఆరోపించారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో లక్ష్మణ్​ మీడియాతో మాట్లాడారు.  పాలనలో బీఆర్ఎస్ అడుగు జాడల్లోనే కాంగ్రెస్ సర్కారు నడుస్తోందన్నారు. 

సీఎం రేవంత్ రెడ్డి పాలనను పక్కనబెట్టి చేరికలపై దృష్టి పెట్టారని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణను అంధకారంగా మార్చొద్దన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టు ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్​ను ఉత్పత్తి చేయాలని కేంద్రం నిర్ణయించిందని పేర్కొన్నారు.