మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంపై.. విచారణ చేయిస్తం : ఉత్తమ్

మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంపై.. విచారణ చేయిస్తం : ఉత్తమ్
  •     ఒకే టెక్నాలజీతో మూడింటిని నిర్మించిన్రు  
  •     రిజర్వాయర్​కు, బ్యారేజీకి తేడా తెల్వదా?
  •     హెలికాప్టర్ నుంచి కేసీఆర్ ప్లేస్ చూపిస్తే అధికారులు కట్టేసిన్రని మంత్రి ఫైర్

హైదరాబాద్, వెలుగు : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పటిష్టతపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)తో విచారణ చేయిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం అసెంబ్లీ లాబీలోని తన చాంబర్​లో ఆయన మీడియాతో చిట్​చాట్ చేశారు. మూడు బ్యారేజీలను ఒకే టెక్నాలజీతో నిర్మించారని, వాటి భద్రతపై విచారణ చేయాలని ఎన్డీఎస్ఏకు లేఖ రాశామని తెలిపారు. రిజర్వాయర్​కు, బ్యారేజీకి తేడా లేకుండా నిర్మించారని అన్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగానే మేడిగడ్డపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు.

 ‘‘కేసీఆర్ సలహాలు చాలనే.. ప్రజలు ఆయన్ను ఇంట్లో కూర్చోబెట్టారు. రాచరిక కేసీఆర్ పాలనలో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేశారు. కాళేశ్వరం, సీతారామ, సమ్మక్క, దేవాదుల ఆయకట్టు ఓవర్ ల్యాప్ అవుతున్నదని సీడబ్ల్యూసీ వాళ్లే చెప్తున్నరు. విజిలెన్స్ నివేదిక పోలీసులకు అందజేసి విచారణ చేయాలని కోరుతాం. వేల కోట్ల నష్టానికి బాధ్యులెవరో తేలుస్తాం’’అని ఆయన అన్నారు. 

నల్గొండ సభలో కేసీఆర్ బాధ్యతా రాహిత్యంగా మాట్లాడారని, ఆయన మేధావిలా కట్టిన బ్యారేజీ డ్యామేజ్ అయిందని విమర్శించారు. అదే బ్యారేజీలో నీళ్లు నింపాలని కోరడం అంటే ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడమేనని మండిపడ్డారు. తుమ్మిడిహెట్టి చాలా మంచి ప్రాజెక్ట్ అని, తక్కువ ఖర్చుతో 16.5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టును రీ డిజైన్ చేశారని విమర్శించారు. అవినీతికి పాల్పడాలనే దురుద్దేశంతోనే ఇదంతా చేశారని ఆరోపించారు. ప్రాణహిత, కాళేశ్వరం ఆయకట్టులో పెద్దగా తేడా లేదని, కానీ.. ఖర్చు మాత్రం భారీగా పెరిగిందన్నారు.

 కేసీఆర్ హెలీకాప్టర్​లో వెళ్లి పై నుంచే మూడు బ్యారేజీలు కట్టే స్థలాలు చూపించారని విమర్శించారు. అందుకే ఈ పరిస్థితి తలెత్తిందని మండిపడ్డారు. ఇరిగేషన్​లో ఏటా రూ.18 వేల కోట్లు అప్పులు, వడ్డీలకు చెల్లించాలని తెలిపారు. రూ.14,500 కోట్ల బిల్లులు పెండింగ్​లో ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో సబ్ కాంట్రాక్టుల వ్యవస్థపైనా విచారణ చేయిస్తున్నామని తెలిపారు. మంత్రిగా కాదు దేశ పౌరుడిగా ఇది తన బాధ్యత అన్నారు.