నకిలీ మెడిసిన్స్ తయారు చేస్తున్న.. ఆస్ట్రిక్ హెల్త్ కేర్ లో సోదాలు

నకిలీ మెడిసిన్స్ తయారు చేస్తున్న.. ఆస్ట్రిక్ హెల్త్ కేర్ లో సోదాలు

పంజాగుట్ట, వెలుగు: క్యాన్సర్ నివారణకు వినియోగించే నకిలీ మందులు తయారు చేస్తున్న సంస్థపై మంగళవారం స్టేట్ డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్లు దాడులు చేశారు. రూ.4.35 కోట్లు విలువైన 36 రకాల నకిలీ మెడిసిన్స్​ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ వీబీ కమల్ హాసన్ రెడ్డి ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లా మచ్చబొల్లారంలో ఆస్ట్రిక్ హెల్త్​కేర్ కంపెనీ ఉందని తెలిపారు.

క్యాన్సర్ నివారణకు ఉపయోగించే నకిలీ మందులు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నదన్నారు. ఈ నెల 2వ తేదీన నకిలీ మెడిసిన్స్​పై సమాచారం అందిందని చెప్పారు. డ్రగ్ కంట్రోల్ డిపార్ట్​మెంట్ కు చెందిన విజిలెన్స్ స్పెషల్ టీమ్స్ నగరంలో పలు ప్రాంతాల్లో దాడులు చేసి నకిలీ మందులు స్వాధీనం చేసుకున్నదన్నారు. దీనికి సంబంధించిన ఇన్వాయిస్ ద్వారా కంపెనీ అడ్రస్ ఉన్న అల్వాల్​లో వెతకగా.. అది ఫేక్ అడ్రస్​గా నిర్ధారణ అయ్యిందని వివరించారు. తర్వాత ఐడీఏ చర్లపల్లి, నాచారం, మేడ్చల్​లోని వివిధ కొరియర్ కార్యాలయాలను తనిఖీ చేశామన్నారు. చివరికి కల్తీ మందులు ఆస్ట్రిక్ హెల్త్ కేర్ నుంచి సప్లై అవుతున్నట్లు గుర్తించామని తెలిపారు.

జులై 2021లో వీరి లైసెన్స్ రద్దు అయిందని, అయినా.. తయారు చేసిన మందులపై మాత్రం మార్చి, 2023 లేబుల్స్ గుర్తించామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఆస్ట్రిక్ హెల్త్ కేర్ డైరెక్టర్ సతీశ్ రెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు. డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ పి.రాము నేతృత్వంలో ఇన్​స్పెక్టర్లు శ్రీకాంత్, అన్వేశ్, చంద్రశేఖర్, అజయ్, వినయ్​సుష్మీ, తదితరులు పాల్గొన్నారు.​​