ఏడేళ్లలో 3 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు: కేటీఆర్

ఏడేళ్లలో 3 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు:  కేటీఆర్

లైఫ్‌సైన్సెస్‌ రంగానికి ప్రపంచ హబ్‌గా హైదరాబాద్‌  నగరం అవతరించిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆరోగ్య పరిరక్షణలో భవిష్యత్తు తరానికి మార్గదర్శనం’అనే నినాదంతో బయో ఏషియా సదస్సు2023 నిర్వహిస్తున్నామన్న మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ ఫార్మాసిటీ వరల్డ్ లార్జెస్ట్ ఫార్మా హబ్ నిర్మాణం జరుగుతోందన్నారు. గత 7 సంవత్సరాల కాలంలో 3 బిలియన్‌ డాలర్లకుపైగా (25 వేల కోట్లు) పెట్టుబడులు వచ్చాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే లైఫ్‌సైన్సెస్‌, ఫార్మా రంగ పర్యావరణ వ్యవస్థకు నిలయంగా ఉందని కేటీఆర్ తెలిపారు. ఇక్కడ 800కుపైగా ఫార్మా, బయోటెక్‌ కంపెనీలు ఉన్నాయని, వీటి విలువ 50 బిలియన్‌ డాలర్లుగా ఉందని చెప్పారు. ప్రపంచంలోనే మూడింట ఒకవంతు వ్యాక్సిన్ల ఉత్పత్తి మన రాష్ట్రం నుంచే జరుగుతుండగా, దేశీయ ఔషధ ఎగుమతుల్లో 30 శాతం, ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియెంట్‌  ఉత్పత్తిలో 40 శాతం, ఏపీఐ ఎగుమతుల్లో 50 శాతం తెలంగాణ నుంచే జరుగుతోందని గొప్పగా చెప్పారు. టాప్‌-10 ప్రపంచ ఫార్మా కంపెనీల్లో నాలుగు కంపెనీలు మన రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయని తెలిపారు.

హైదరాబాద్‌లో 20కిపైగా లైఫ్‌సైన్సెస్‌, మెడ్‌టెక్‌ ఇంక్యుబేటర్లు ఉన్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో లైఫ్‌ సైన్సెస్‌ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. అందులో బయో ఏషియా సదస్సు కూడా ఒకటన్న ఆయన... ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు ప్రతిష్ఠలున్న శాస్త్రవేత్తలు, మేధావులు ఏకమై రాబోయే తరానికి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషిచేయాలని ఆయన కోరారు. లైఫ్‌ సైనెస్స్‌ రంగంలో అద్భుత సేవలు అందించిన వ్యక్తులకు ప్రదానం చేసే ‘జీనోమ్‌ వ్యాలీ ఎక్సలెన్స్‌ అవార్డు’ ఈ ఏడాది ప్రొఫెసర్‌ రాబర్ట్‌ లాంగర్‌కు అందజేయనున్నామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు నిర్వహించిన 19 బయో ఏషియా సదస్సుల ద్వారా ప్రపంచంలోని 100 కుపైగా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, మేధావులు, నోబెల్‌ బహుమతి గ్రహీతలు, లాస్కర్‌ అవార్డ్‌ గ్రహీతలు, నిపుణులను ఒకే వేదికపైకి తెచ్చామని చెప్పారు.