స్టాక్ మార్కెట్లలో వరుసగా ఆరో రోజూ అమ్మకాల ఒత్తిడితో చిత్తయ్యాయి. సోమవారం ట్రేడింగ్‌లో భారత ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు తమ పతనాన్ని మరింత పొడిగించాయి. గత ఐదు సెషన్లలో సెన్సెక్స్ దాదాపు 2,185 పాయింట్లు, నిఫ్టీ 645 పాయింట్ల మేర పతనమై ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేశాయి. ఉదయం 10.44 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్409 పాయింట్ల నష్టంతో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 120 పాయింట్ల మేర నష్టంలో ఉంది. ఇక నిఫ్టీ బ్యాంక్ సూచీ 170 ప్లస్ పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 450 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడవుతున్నాయి.ఈ భారీ నష్టాలకు దారితీసిన ప్రధాన కారణాలను పరిశీలిస్తే...
అమెరికా టారిఫ్ భయాలు:
భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై అమెరికా కొత్తగా భారీ టారిఫ్‌లు.. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై 500% వరకు విధించే అవకాశం ఉందన్న వార్తలు మార్కెట్‌ను కలవరపెడుతున్నాయి. దీనివల్ల భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై అనిశ్చితి నెలకొంది.
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు:
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు వరుసగా 5వ రోజు కూడా తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఒక్క శుక్రవారమే రూ.3వేల 769.31 కోట్ల విలువైన షేర్లను విక్రయించడం గమనార్హం.
పెరిగిన ఇండియా VIX:
మార్కెట్‌లో భయాన్ని సూచించే ఇండియా VIX సూచీ దాదాపు 8 శాతం పెరిగి 11.80 కి చేరుకుంది. ఇది ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనను సూచిస్తోంది.
భౌగోళిక ఉద్రిక్తతలు:
ఇరాన్‌లో నిరసనలు, వెనిజులాలో రాజకీయ సంక్షోభం, గ్రీన్‌ల్యాండ్‌ను కొనేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక ఉద్రిక్తతలను పెంచాయి. ఇవి క్రూడాయిల్ ధరల పెరుగుదలకు కూడా కారణమయ్యాయి.
ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఇవాళ నిఫ్టీలో మ్యాక్స్ హెల్త్‌కేర్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫిైనాన్స్ వంటి షేర్లు 2 శాతం వరకు నష్టపోగా.. కోల్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ లాభాల్లో నిలిచాయి. మార్కెట్ బ్రెడ్త్ ప్రతికూలంగా ఉండటంతో కేవలం 1014 షేర్లు లాభపడగా, 2545 షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
మార్కెట్లో ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఐటీ దిగ్గజాలు టీసీఎస్, హెచ్‌సిఎల్ టెక్ క్యూ3 ఫలితాల కోసం వేచి చూస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రతపై వస్తున్న వార్తలు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల రాబోయే రోజుల్లో మార్కెట్‌ను మరింత ఒడిదుడుకులకు గురి చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి అనుగుణంగా ఇన్వెస్టర్లు స్పందిస్తున్న వేళ 2026లో స్టాక్ మార్కెట్లు సుదీర్ఘ నష్టాల ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
