నేరేడుచర్ల వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏ వన్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసిఆర్‌కు రైతులను దూరం చేయాలనే కాంగ్రెస్ పార్టీ అమలు చేయడానికి సాధ్యపడని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక నేడు అవస్థలు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని ఎద్దేవా చేశారు.
పోలీసులను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ఇలాంటి వాటికి భయపడేది లేదని, అక్రమంగా ఒక్కరిని పోలీస్ స్టేషన్ పిలిచినా అందరూ కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లాలని అవసరమైతే తాను కూడా స్టేషన్ కు రావటానికి సిద్ధంగా ఉన్నానని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో పది సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తే జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో విజయం ఖాయమని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
కార్యక్రమంలో హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఒంటెద్దు నరసింహారెడ్డి, సూర్యాపేట జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దొండపాటి అప్పిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అరిబండి సురేష్ బాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ చింతమల్ల జయబాబు, హుజూర్ నగర్ నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
