ఎస్సీ రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి : మంత్రి వివేక్‌‌

ఎస్సీ రిజర్వేషన్లు  18 శాతానికి పెంచాలి : మంత్రి వివేక్‌‌
  • బడ్జెట్‌‌లో కూడా 18 శాతం నిధులు కేటాయించాలి: మంత్రి వివేక్‌‌
  •     కాంగ్రెస్​ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటది 
  •     దళిత పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ రిలీజ్‌‌లో ఆలస్యం వద్దు
  •     కర్నాటక చట్టాలు తెలంగాణలో కూడా అవసరం
  •     రోస్టర్​ విధానంతో మాలలకు అన్యాయం జరుగుతున్నదని వెల్లడి

నిజామాబాద్, వెలుగు:  కర్నాటకలో ఎస్సీ వర్గీకరణకు ముందే  రిజర్వేషన్​ శాతాన్ని  పెంచినట్లు తెలంగాణలో కూడా చేయాలని మంత్రి వివేక్​ వెంకటస్వామి అన్నారు. చేవేళ్ల డిక్లరేషన్​ ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు  18 శాతానికి పెంచాలని,  బడ్జెట్‌‌లో ఎస్సీలకు 18 శాతం నిధులివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పార్టీ ప్రకటించినట్టు రిజర్వేషన్​ పెంపు హామీ నిలబెట్టుకోవాలని దళితులంతా కోరుతున్నారని, కాంగ్రెస్​ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని తెలిపారు. 

ఆదివారం నిజామాబాద్​ జిల్లాలో గెలిచిన మాల సామాజిక వర్గం సర్పంచ్, ఉపసర్పంచ్‌‌ల సన్మాన సభ మాలమహానాడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్​మాట్లాడుతూ.. ఎస్సీలు  స్థాపించిన ఇండస్ట్రీలకు సబ్సిడీ రిలీజ్​ చేయడంలో ఆలస్యం  చేయొద్దని అన్నారు.  

సకాలంలో సబ్సిడీ రాకపోతే దళిత పారిశ్రామికవేత్తలు నిలదొక్కుకోవడం కష్టమని,  సిక్​ ఇండ్రస్టీలుగా మారితే కోలుకోలేరని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీలు స్థాపించిన పరిశ్రమల నుంచి కర్నాటక సర్కారు 4 శాతం ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నదని, దీన్ని​ తెలంగాణలో కూడా అమలు  చేయాలని కోరారు. వర్గీకరణకు ముందే ఈ రెండు అంశాల్లో తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎస్సీలకు  రూ.3 కోట్ల విలువ వరకు కాంట్రాక్టులు  ఇవ్వాలని కోరారు. వారు ఆర్థికంగా ఎదిగితేనే కుల వివక్ష పోతుందని చెప్పారు.   

పెద్దపల్లి జిల్లాకు కాకా పేరు పెట్టాలి: షబ్బీర్​ అలీ

దేశానికి, ఉమ్మడి రాష్ట్రానికి.. ముఖ్యంగా తెలంగాణకు కాకా వెంకటస్వామి ఎంతో సేవ చేశారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ అన్నారు.  హైదరాబాద్‌‌లో కాకా వేయించిన గుడిసె స్థలాల విలువ ఇప్పుడు కోట్లకు చేరిందని చెప్పారు. పేదలు, కార్మికుల కోసం నిబద్ధతతో పనిచేసిన కాకా వెంకటస్వామి పేరును పెద్దపల్లి జిల్లాకు పెట్టాలని  కోరారు. నిజామాబాద్​ నగరంలో కాకా విగ్రహం ఏర్పాటు చేయాలని మంత్రి వివేక్‌‌కు విన్నవించారు. 

ఎక్కడ విగ్రహం పెట్టినా ఆ చౌరస్తాను తాము డెవలప్​ చేసి ఇస్తామన్నారు. బాధ్యతాయుతంగా పనిచేయడం వల్లే వివేక్​ ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగారని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌‌రెడ్డి అన్నారు. వివేక్,  తాను నమ్మిన సిద్ధాంతాలతో రాజకీయాల్లో కొనసాగుతున్నట్టు చెప్పారు. అర్బన్​ ఎమ్మెల్యే ధన్‌‌పాల్​ సూర్యనారాయణ, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్​ ప్రొఫెసర్​ లింబాద్రి, ఎస్సీ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రెసిడెంట్​ ఆలుక కిషన్​, మాజీ మున్సిపల్​ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య, దండు కిరణ్​ తదితరులు పాల్గొన్నారు.  

రోస్టర్‌‌‌‌తో మాలలకు నష్టం 

తన తండ్రి కాకా వెంకటస్వామి స్ఫూర్తితో ప్రజలకు సేవ, న్యాయం, మేలు చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని మంత్రి వివేక్‌‌ అన్నారు. జాతి ప్రయోజనాల కోసం కొట్లాడం మానుకో బోనని స్పష్టం చేశారు. రోస్టర్​ విధానంతో మాలలకు సర్కారు​ కొలువుల్లో జరుగుతున్న  అన్యాయాన్ని  అసెంబ్లీలో మాట్లాడుదాం అనుకున్నానని, కానీ కేబినెట్‌‌లోనే చర్చించామని చెప్పారు. సీఎం రేవంత్‌‌రెడ్డి స్పందించి ఈ విషయంలో సమగ్ర రిపోర్టు అడిగారని తెలిపారు. రోస్టర్​ అన్యాయంపై  శాసనమండలిలో కూడా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు వివరించానన్నారు.