మోడీ మెలోడీ వీడియోతో ఇన్వెస్టర్లలో కన్ఫ్యూజన్.. చాక్లెట్ వైరల్ అయితే వేరే కంపెనీ షేర్లు కొనేశారు

మోడీ మెలోడీ వీడియోతో ఇన్వెస్టర్లలో కన్ఫ్యూజన్.. చాక్లెట్ వైరల్ అయితే వేరే కంపెనీ షేర్లు కొనేశారు

సోషల్ మీడియా యుగంలో ఒక చిన్న వైరల్ వీడియో స్టాక్ మార్కెట్‌ను ఏ రేంజ్‌లో ప్రభావితం చేస్తుందో చెప్పడానికి తాజా ఘటనే ఒక ఉదాహరణ. భారత ప్రధాని మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిల మధ్య నడిచే 'మెలోడి' ట్రెండ్ గురించి నెటిజన్లకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా మోడీ తన ఇటలీ పర్యటనలో ఇటలీ ప్రధాని మెలోనికి ఒక పార్లే మెలోడీ చాక్లెట్ ప్యాకెట్‌ను బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో.. దలాల్ స్ట్రీట్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది.

ఈ వైరల్ వీడియో దెబ్బకు మంగళవారం ట్రేడింగ్‌లో పార్లే ఇండస్ట్రీస్ షేర్లు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. ఇంట్రాడేలో ఈ స్టాక్ ఏకంగా 5 శాతం పెరిగి ఒక్కోటి రూ.5.25 కి చేరుకుంది. గత వారం రోజుల్లోనే ఈ షేరు దాదాపు 7 శాతం మేర లాభపడింది. మెలోడీ చాక్లెట్ తెచ్చిన క్రేజ్‌తో ఇన్వెస్టర్లు ఈ కంపెనీ షేర్లను కొనడానికి ఎగబడ్డారు. 

అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మోడీ చేతిలో పార్లే మెలోడీ చాక్లెట్ ప్యాకెట్ కనిపించిటంతో స్టాక్ భారీగా లాభపడినప్పటికీ.. 'పార్లే ఇండస్ట్రీస్' కంపెనీకి మనం తినే 'మెలోడీ' టాఫీలకు ఎలాంటి సంబంధం లేదు. అవును మెలోడీ చాక్లెట్లను తయారు చేసేది ప్రముఖ FMCG దిగ్గజం 'పార్లే ప్రొడక్ట్స్'. ఈ కంపెనీ పార్లే-జీ, మొనాకో, క్రాక్‌జాక్, మ్యాంగో బైట్ వంటి బ్రాండ్లకు ఓనర్. అయితే మార్కెట్లో లిస్ట్ అయిన 'పార్లే ఇండస్ట్రీస్' పూర్తిగా వేరే సంస్థ. కేవలం పేరులో 'పార్లే' అని ఉండటంతో రిటైల్ ఇన్వెస్టర్లు కన్ఫ్యూజ్ అయి ఆ షేర్లను కొనేశారని తేలింది.

ALSO READ : మీ రిక్వెస్ట్ ను నార్వే అంగీకరించిందా మోదీజీ..

ఈ వింత ర్యాలీకి కారణం ప్రధాని మోడీ, మెలోనిల మధ్య జరిగిన ఒక సరదా సంభాషణే. మోడీ తనకు మెలోడీ టాఫీలను గిఫ్ట్‌గా ఇచ్చిన వీడియోను మెలోని ఎక్స్‌ లో షేర్ చేస్తూ.. "థాంక్యూ ఫర్ ది గిఫ్ట్" అని రాశారు. ఆ వీడియోలో ఆమె మోడీ తనకు చాలా చాలా మంచి టాఫీలను బహుమతిగా ఇచ్చారని చెబుతూ నవ్వడం నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్, కామెంట్లు రావడంతో, అటు తిరిగి ఇటు తిరిగి అది స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపించింది. ఇలా తప్పుడు కంపెనీల షేర్లను ఇన్వెస్టర్లు బై మిస్టేక్ కొనేయటం ఇదే మెుదటి సారేమీ కాదు. కాబట్టి వైరల్ ట్రెండ్స్ చూసి బ్లైండ్‌గా ఇన్వెస్ట్ చేయకుండా.. కంపెనీల బ్యాక్‌గ్రౌండ్ ఏంటో ముందుగా చెక్ చేసుకుని ఇన్వెస్టర్లు రంగంలోకి దిగటం మంచిది.