ఈరోజు శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 769 పాయింట్లకు పైగా పడిపోగా.. నిఫ్టీ50 25,050 మార్కు కంటే కిందకు పడిపోయింది. ఉదయం సెన్సెక్స్ 82,335 వద్ద ప్రారంభమై ఈ రోజు గరిష్ట స్థాయి 82,516కి చేరుకుంది, కానీ ర్యాలీ ఎక్కువసేపు కొనసాగలేదు. ఇక పెట్టుబడిదారులు మార్కెట్ విలువలో దాదాపు రూ.6.4 లక్షల కోట్లు కోల్పోయారు, బిఎస్‌ఇ-లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.452 లక్షల కోట్లకు పడిపోయింది.
స్టాక్ మార్కెట్ నష్టాలకు విదేశీ పెట్టుబడిదారులు అమ్మకాలు జరపడం మార్కెట్ పతనానికి అతిపెద్ద కారణం. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) గురువారం దాదాపు రూ.2,550 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.
రికార్డు కనిష్ట స్థాయికి చేరిన రూపాయి
అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి కొత్త రికార్డు కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఈక్విటీలపై ఒత్తిడి పెరిగింది. డాలర్‌తో పోలిస్తే దాదాపు 91.77కి బలహీనపడి, రోజులో దాదాపు 0.2 శాతం పడిపోయింది. డాలర్‌కు డిమాండ్ పెరగడం, రూపాయి పతనం ప్రతిసారి పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. పెరుగుతున్న ముడి చమురు ధరలు మార్కెట్లలో రికవరీని అడ్డుకున్నాయి. ఇరాన్‌తో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల తర్వాత చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు దాదాపు $64కి పెరిగింది, US ముడి చమురు బ్యారెల్‌కు దాదాపు $60కి చేరుకుంది.
►ALSO READ | డిజిటల్ మోసాలకు చెక్: బ్యాంక్ యాప్‌లలో కొత్త ఫీచర్.. కేంద్రం కొత్త ప్లాన్!
భారీగా పతనమైన అదానీ గ్రూప్ షేర్లు
ఈ రోజు అదానీ గ్రూప్ స్టాక్‌లలో అమ్మకాలు జోరందుకున్నాయి, దీనితో మార్కెట్ పతనమైంది. గౌతమ్ అదానీ, సాగర్ అదానీలకు నేరుగా సమన్లు అందజేయడానికి US SEC కోర్టు అనుమతి కోరినట్లు వచ్చిన వార్తల తర్వాత అదానీ గ్రీన్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ఎనర్జీ, అదానీ పోర్ట్స్ షేర్లు 11 శాతం వరకు పడిపోయాయి. ఈ రోజు అదానీ గ్రూప్ మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.1.1 లక్షల కోట్లు తగ్గింది.
