‘ఈశాన్య భారత సాంకేతిక సాంస్కృతిక మహోత్సవం’ లోగో డిజైన్‌‌కు ఆహ్వానం

‘ఈశాన్య భారత సాంకేతిక సాంస్కృతిక మహోత్సవం’ లోగో డిజైన్‌‌కు ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు: ‘తెలంగాణ – ఈశాన్య భారత సాంకేతిక- సాంస్కృతిక మహోత్సవం’సందర్భంగా లోగో డిజైన్‌‌ పోటీలకు రాజ్‌‌ భవన్‌‌ ఆహ్వానం పలికింది. విద్యార్థులు, కళాకారులు, డిజైనర్లు, సాధారణ ప్రజల నుంచి లోగోలు, ట్యాగ్ లైన్లు, పోస్టర్ల రూపకల్పనకు గాను ఈ పోటీని ఏర్పాటు చేసింది. 

ఈ మహోత్సవం తెలంగాణ, ఈశాన్య భారతంలోని 8 రాష్ట్రాల (అరుణాచలప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర) సంబంధాల మరింత బలోపేతానికి ఉపయోగపడనుందని గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నవంబర్ 25 నుంచి 27 వరకు, డిసెంబర్ 2 నుంచి 4 వరకు హైదరాబాద్‌‌లో ఈ కార్యక్రమం జరగనుందని వెల్లడించారు. 

లోగో, పోస్టర్ రూపకల్పన, ట్యాగ్‌‌లైన్‌‌ను (ఏ4 లేదా ఏ3 పరిమాణంలో, డిజిటల్ ఫార్మాట్‌‌లో) telangananortheastconnect@gmail.comకు ఈ నెల 15 వరకు పంపాలని సూచించారు. తెలంగాణ, ఈశాన్య భారత రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, సాంకేతిక ఆవిష్కరణలకు ఉపయోగపడతాయన్నారు. ఉత్తమ లోగోకు రూ.15 వేలు, ఉత్తమ ట్యాగ్ లైన్‌‌కు రూ.5 వేలు, ఉత్తమ పోస్టర్‌‌‌‌కు రూ.20 వేలు అందించనున్నట్లు వెల్లడించారు.