మాజీ మంత్రి జూపల్లి దారెటు?

మాజీ మంత్రి జూపల్లి దారెటు?
  • కాంగ్రెస్​ నుంచి ఆహ్వానం.. పార్టీ మారుతారనే ప్రచారం
  • మాజీ మంత్రి జూపల్లికి ఆహ్వానం అందినట్లు ప్రచారం..  
  • ఇండిపెండెంట్​గా పోటీచేస్తారంటున్న అనుచరులు
  • అలర్ట్​ అయిన టీఆర్ఎస్.. జూపల్లికి  మంత్రి పదవి ఆఫర్​? 
  • పీసీసీ చీఫ్​తో మంత్రి నిరంజన్​రెడ్డి అనుచరుడి భేటీ..
  • రంగులు మారుతున్న కొల్లాపూర్​ రాజకీయం

నాగర్​కర్నూల్, వెలుగు: నిన్నమొన్నటి వరకు కొల్లాపూర్ ​నియోజకవర్గానికి పెద్దదిక్కు ఎవరూ లేరు. కాంగ్రెస్​పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బీరం హర్షవర్దన్​రెడ్డి  కారెక్కగానే ఆయన అనుచరులు కూడా టీఆర్ఎస్​లో చేరడంతో మండల స్థాయి లీడర్లూ కనిపించకుండా పోయారు. దీంతో మున్సిపల్, లోకల్​బాడీ ఎలక్షన్స్​లో కూడా ఖాతా తెరవలేని పరిస్థితి ఏర్పడింది. రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టగానే  కొల్లాపూర్​ లీడర్లలో కదలిక మొదలైంది. మాజీ మంత్రి జూపల్లిని రేవంత్ కాంగ్రెస్​లోకి  ఇన్వైట్​చేశారనే ప్రచారం మొదలుకాగానే  టీడీపీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి టీఆర్ఎస్​లో చేరిన జగదీశ్వర్​ రావు ‘పాలమూరు నిరుద్యోగ జంగ్​ సైరన్’​లో రేవంత్​ సమక్షంలో కాంగ్రెస్​లో  చేరిపోయారు. జూపల్లి ఎపిసోడ్​ నడుస్తుండగానే మంత్రి నిరంజన్​రెడ్డి ప్రధాన అనుచరుడిగా పేరున్న రంగినేని అభిలాష్​రావు రేవంత్​తో భేటీ అయ్యారు. కాంగ్రెస్​లో చేరికపై ఆయన స్పష్టత ఇవ్వక పోయినా త్వరలో చేరుతారనే  ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్​లో వెలివేత కొనసాగితే జూపల్లి రూట్​మారుతుందనే ప్రచారం ఉంది. 

రేవంత్​ నోట జూపల్లి మాట..
కొల్లాపూర్​ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్​, టీఆర్ఎస్​హయాంలో మంత్రిగా వెలుగొందిన  జూపల్లి రాజకీయ  భవిష్యత్​పై  చర్చ మొదలైంది. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్​లో టికెట్ హామీ .. లేని టీఆర్ఎస్​లో  కృష్ణారావు కొనసాగుతారా?  లేక కాంగ్రెస్​లోకి వెళ్తారా? అన్నది చర్చగా మారింది. రాబోయే  ఎన్నికల్లో టీఆర్ఎస్​టికెట్​రాకుంటే ‘సార్​ఇండిపెండెంట్​గా పోటీలో ఉంటారు.’ అని ఆయన అనుచరులు అంటున్నారు. ఇటీవల కొల్లాపూర్​ నియోజకవర్గానికి చెందిన కొందరు లీడర్లు , కార్యకర్తలు పీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డిని కలిసిన టైంలో  ‘‘సార్​ మా కొల్లాపూర్​కు  సరైన లీడర్​ లేడని చెప్పగా రేవంత్​ ప్రస్తావించిన  పేర్లలో మాజీ మంత్రి జూపల్లి పేరు కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది''. దీంతో జూపల్లి కాంగ్రెస్​లో చేరుతారా? అన్నదానిపై జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇండిపెండెంట్‎గా పోటీ ​పక్కా..
ఊహాగానాలపై లోకల్​ మీడియా  జూపల్లి వివరణ కోరగా తనను ఎవరూ సంప్రదించలేదని,  టీఆర్ఎస్​లోనే కొనసాగుతానని చెప్పినట్లు సమాచారం. కానీ ఆయన ముఖ్య అనుచరులు ‘సార్​పక్కా ఇండిపెండెంట్​గా  పోటీ చేస్తారని చెబుతున్నారు. జూపల్లి కాంగ్రెస్​ఎంట్రీ వార్తలతో అలర్ట్​అయిన టీఆర్ఎస్​హైకమాండ్​లోకల్​బాడీస్​ఎమ్మెల్సీ స్థానం నుంచి గెలిపించుకుని మంత్రి పదవి ఆఫర్​ ఇచ్చినట్లు  ప్రచారం జరుగుతోంది. దీనిపై మాజీ మంత్రి, టీఆర్ఎస్​లీడర్లు ఎటువంటి కామెంట్​చేయడం లేదు. 3 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన  సీఆర్​జగదీశ్వర్​రావు కాంగ్రెస్​ టికెట్​ తనకే కన్​ఫాం అన్న ధీమాతో కాంగ్రెస్​లో చేరారు. వ్యవసాయ మంత్రి నిరంజన్​రెడ్డికి అతి సన్నిహితుడిగా పేరున్న రంగినేని అభిలాష్​రావు స్థానిక ఎమ్మెల్యే హర్షవర్దన్​రెడ్డితో సంబంధం లేకుండా సొంతంగా పార్టీ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. మంత్రికి తెలియకుండానే అభిలాష్​  తిరుగుతున్నారా? అని  టీఆర్​ఎస్​లో చర్చ సాగుతోంది. 

హర్షవర్దన్​ రెడ్డి చేరికతో.. 
కాంగ్రెస్​ నుంచి గెలుపొందిన హర్షవర్దన్​ రెడ్డి  టీఆర్ఎస్​లో చేరడంతో జూపల్లితో పాటు ఆయన  అనుచరులు డిఫెన్స్​లో పడ్డారు. పార్టీని వీడాలన్న అనుచరుల వత్తిడిని తిరస్కరించిన జూపల్లి తన ఓటమికి పార్టీని ఎలా బాధ్యులను చేస్తామన్న రీతిలో వేచిచూసే ధోరణి అవలంభించారు. కొల్లాపూర్​లో నిలువున చీలిన టీఆర్ఎస్​కు అసలు సిసలు నాయకుడెవరన్నది ప్రశ్నగా మిగిలిపోయింది. ఆ తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామపంచాయితీ ఎన్నికలు, సింగిల్​ విండో  ఎన్నికల్లో జూపల్లి తన  వర్గాన్ని రంగంలోకి దించి రాజకీయాలను రసవత్తరంగా మార్చేశారు. మున్సిపల్​ ఎన్నికల్లో జూపల్లి వర్గీయులు వేరే పార్టీ నుంచి గెలుపొందారు. జూపల్లి మద్దతు ఇస్తామన్న అవసరం లేదన్న పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​కేటీఆర్​ఎక్స్ అఫీషియో ఓట్ల  తో బీరం వర్గీయులకు చైర్మన్​, వైస్​ పదవులు దక్కేలా పావుల కదిపారు. కొల్లాపూర్​లో జరిగే అధికారిక ప్రోగ్రామ్స్​కు ఆయనను దూరం పెట్టారు. అధికారం చేజారడం, సొంత పార్టీ నేతలే  పట్టించుకోకపోవడంతో వెలివేతకు గురవుతున్నామన్న భావనలో ఉన్న జూపల్లి వర్గీయులు పల్లె నుంచి పట్టు పెంచుకోవడానికి పాదయాత్రలు మొదలు పెట్టారు. 

జూపల్లి.. నో కామెంట్!
జూపల్లి కృష్ణారావుకు కాంగ్రెస్ హైకమాండ్​ నుంచి పిలుపొచ్చిందన్న వార్తల నేపథ్యంలో  చేరే విషయంపై  బాహాటంగా స్పందించకపోయినా  ఇండిపెండెంట్​గా పోటీ చేస్తారని అనుచరులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై కూడా ఆయన ఎటువంటి కామెంట్​చేయకపోవడం గమనార్హం.  

నియోజకవర్గంలో పట్టున్న నేత..
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్​ నుంచి 5సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నుంచి  రెండోసారి ఎన్నికైన తర్వాత  ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన ఆయన  ఉద్యమ టైంలో  టీఆర్ఎస్​లో చేరడానికి  సిద్ధపడి మంత్రి పదవితో పాటు  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2012లో తన రాజీనామాతో ఏర్పడిన ఖాళీతో వచ్చిన  బై ఎలక్షన్లలో టీఆర్ఎస్​అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 లో తిరిగి ఎన్నికైన జూపల్లి  కేసీఆర్​మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు.2018 ఎన్నికల్లో టీఆర్ఎస్​అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్​ అభ్యర్థి బీరం హర్షవర్దన్​ రెడ్డి  చేతిలో ఓడిపోయారు.  బీరం గెలుపునకు, జూపల్లి ఓటమికి  టీఆర్​ఎస్​జిల్లా పార్టీలో ఒకవర్గం అంతర్గతంగా పనిచేసిందనే పుకార్లు వినిపించాయి.