
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్–2030 బిడ్‌ను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) అధికారికంగా ఆమోదించింది. బుధవారం ఇక్కడ జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎమ్)లో దీనిపై చర్చించారు. పతకాలు ఎక్కువగా సాధించే క్రీడలను ఇందులో చేర్చాలని ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. అహ్మదాబాద్ కేంద్రంగా ఈ క్రీడలను నిర్వహించేందుకు ఇండియా ఇప్పటికే ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ను పంపించింది.
ఈ నెల 31లోగా అధికారికంగా బిడ్‌ను దాఖలు చేస్తుంది. అహ్మదాబాద్‌తో పాటు ఢిల్లీ, భువనేశ్వర్‌ను కూడా పరిశీలిస్తామని ఐవోఏ ప్రెసిడెంట్ పీటీ ఉష వెల్లడించింది. ‘కామన్వెల్త్ గేమ్స్‌పై అందరూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది. మా ప్రిపరేషన్స్ ముందుకు సాగుతున్నాయి. అహ్మదాబాద్ ఆతిథ్య నగరమో కాదో ఇప్పుడే చెప్పలేం. భువనేశ్వర్, ఢిల్లీలో కూడా మంచి సౌకర్యాలు ఉన్నాయి.
త్వరలోనే దీనిపై తుది ప్రకటన చేస్తాం. పతకాలు సాధించే అన్ని క్రీడలను ఇందులో చేర్చేందుకు ప్రయత్నిస్తాం. గ్లాస్గో టోర్నీలో పక్కనబెట్టిన క్రీడలకు కూడా చోటు కల్పిస్తాం’ అని ఉష వ్యాఖ్యానించింది. కామన్వెల్త్ గేమ్స్ డైరెక్టర్ డారెన్ హాల్ నేతృత్వంలోని అధికారుల బృందం వేదికలను పరిశీలించేందుకు ఇండియాకు వచ్చారని తెలిపింది. త్వరలోనే మరో బృందం ఇక్కడికి వస్తుందని చెప్పింది.