
- వివాదాలకు పుల్‌స్టాప్ పెట్టి ఒక్కతాటిపైకి ఈసీ మెంబర్స్..
- యాంటీ డోపింగ్ ప్యానెల్ ఏర్పాటు
న్యూఢిల్లీ: దాదాపు ఏడాదిన్నరగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ)లో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు, వివాదాలకు ఎట్టకేలకు పుల్‌స్టాప్ పడింది. గురువారం జరిగిన ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఈసీ) మీటింగ్‌లో సభ్యులంతా ఏకతాటిపైకి వచ్చి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఈఓగా రఘురామ్ అయ్యర్ నియామకానికి ఆమోదం తెలిపారు.
దేశంలో పెరుగుతున్న డోపింగ్ కేసులను నివారించడానికి ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉష గతేడాది జనవరిలో రఘురామ్ అయ్యర్‌ను నెలకు రూ. 20 లక్షల జీతంతో సీఈఓగా నియమించడం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో వివాదాలకు ఆజ్యం పోసింది. చాలా మంది సభ్యులు ఉషపై అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. కానీ సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ మన్సుఖ్ మాండవియా జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది.
ఇప్పుడు అయ్యర్ నియామకానికి ఆమోద ముద్ర పడింది. ‘అన్ని సమస్యలు తొలగిపోయాయి. అందుకే ఆయన (అయ్యర్) ఇప్పుడు నాతో కూర్చున్నారు. తన నియామకానికి ఆమోద ముద్ర పడింది’ అని పీటీ ఉష మీడియాకు తెలిపారు. ఐఓఏ జాయింట్ సెక్రటరీ కళ్యాణ్ చౌబే కూడా అయ్యర్ నియామకాన్ని ధృవీకరించారు.
గతంలో ఉషను వ్యతిరేకించిన ఐఓఏ ట్రెజరర్ సహదేవ్ యాదవ్ కూడా గొడవ ముగిసిందని చెప్పారు. ‘ఇదంతా చిన్నపాటి గొడవలాంటిది. మేం తిరిగి కలిసి సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్‌తో పాటు 2036 ఒలింపిక్ బిడ్, 2030 కామన్వెల్త్ గేమ్స్ బిడ్ పై దృష్టి పెట్టాం’ అని చెప్పారు. ఎంసీ మేరీకోమ్ మరో ఇద్దరు మినహా మిగతా ఈసీ మెంబర్స్ అంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఐఓసీ ఆందోళన.. డోపింగ్ నివారణకు ఏడుగురు సభ్యుల కమిటీ
2036 ఒలింపిక్ బిడ్ కోసం ఒత్తిడి తీసుకురావడానికి గత నెలలో లాసానెలో జరిగిన సమావేశానికి ఐఓఏ ప్రతినిధి బృందం హాజరవగా.. ఇండియాలో అధిక డోపింగ్ కేసుల గురించి ఐఓసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఏడుగురు సభ్యులతో కూడిన డోపింగ్ వ్యతిరేక ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తూ ఐఓఏ నిర్ణయం తీసుకుంది.
ఈ ప్యానెల్‌కు ఇండియా డేవిస్ కప్ కెప్టెన్ రోహిత్ రాజ్‌పాల్ నాయకత్వం వహిస్తాడు. ఇందులో అపర్ణా పోపట్, స్టోర్ట్స్ మెడిసిన్ ఎక్స్‌పర్ట్ పి.ఎస్.ఎం. చంద్రన్ వంటి ప్రముఖులు ఉంటారు. గత నెలలో విడుదలైన వరల్డ్ డోపింగ్ ఏజెన్సీ (వాడా) 2023లెక్కల ప్రకారం 5,000 అంతకంటే ఎక్కువ శాంపిల్స్ పరీక్షించిన దేశాల్లో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలిన పాజిటివిటీ రేటు ఇండియాలోనే అత్యధికంగా 3.8 శాతంగా ఉన్నట్టు తేలింది. ఈ నేపథ్యంలో డోపింగ్ నిరోధక కమిటీ .. అథ్లెట్లు, కోచ్‌లు, ససోర్ట్ స్టాఫ్, పేరెంట్స్ అందరికీ డోపింగ్ గురించి అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
కొత్త స్పోర్ట్స్ బిల్లుకు స్వాగతం
కొంతకాలంగా వ్యతిరేకిస్తున్న కొత్త స్పోర్ట్స్ బిల్లును కూడా ఐఓఏ స్వాగతించింది. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపట్టింది. ‘ఐఓసీకి రెండు, మూడు విషయాలపై కొన్ని ఆందోళనలు ఉండేవి. అయితే, మన సోర్ట్స్ మినిస్ట్రీ ఐవోసీ, ఇతర ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లతో చర్చించి వారి సందేహాలను నివృత్తి చేసింది.
ఆ తర్వాతే ఈ బిల్లును క్లియర్ చేసింది’ అని పీటీ ఉష చెప్పారు. ఈ కొత్త బిల్లును సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్ట్రీ.. క్రీడా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అని భావించకూడదని, ఐఓఏ, ఇతర స్పోర్ట్స్ ఫెడరేషన్లతో సహకారం, సమన్వయం కోసం తీసుకొచ్చిన బిల్లుగా చూడాలని ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయిన కళ్యాణ్ చౌబే అన్నారు.