బాక్సింగ్ ఫెడరేషన్ ఎన్నికల నిర్వహణలో జాప్యం ఎందుకు..? ఐఓఏ సీరియస్

బాక్సింగ్ ఫెడరేషన్ ఎన్నికల నిర్వహణలో జాప్యం ఎందుకు..? ఐఓఏ సీరియస్

 న్యూఢిల్లీ: బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ) ఎన్నికల నిర్వహణ ఆలస్యం కావడంపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) సీరియస్‌‌‌‌‌‌‌‌గా ఉంది. ఈ జాప్యానికి  కారణాలు తెలుసుకునేందుకు నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉష ప్రకటించారు. ఐఓఏ ట్రెజరర్ సహదేవ్‌‌‌‌‌‌‌‌ యాదవ్ నేతృత్వంలోని ఈ కమిటీలో ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ భూపేందర్ సింగ్‌‌‌‌‌‌‌‌ బజ్వా, అడ్వొకేట్ పాయల్ కక్రా సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఎన్నికలు సజావుగా, సకాలంలో జరిగేందుకు రోడ్ మ్యాప్‌‌‌‌‌‌‌‌ ను కూడా రికమెండ్ చేయనుంది. కాగా, బీఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 2న ముగిసింది. 

అయినా కొత్త పాలకవర్గానికి ఎన్నికలు జరగకపోవడంతో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసిన పీటీ ఉష. .వరల్డ్ బాక్సింగ్‌‌‌‌‌‌‌‌కు బీఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ వాస్తవ పరిస్థితిని సమర్పించడానికి వారం రోజుల్లో నివేదికను ఇవ్వాలని కమిటీకి సూచించారు. మరోవైపు ఆగస్టు 31లోగా ఎన్నికలు నిర్వహిస్తామని బీఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ తాత్కాలిక కమిటీ హామీ ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే పారదర్శకంగా, జవాబుదారీగా జరుగుతోందని బీఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, తాత్కాలిక కమిటీ సభ్యుడు అరుణ్ మాలిక్ ఆదివారం ప్రకటించారు. అన్ని కీలక విషయాలను ఐఓఏ, స్పోర్ట్స్ మినిస్ట్రీకి తెలియజేశామన్నారు. 

కాగా, బాక్సింగ్ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌లో అంతర్గత విభేదాలు, వర్గ పోరు ఎన్నికల ప్రక్రియను ఆలస్యం చేస్తున్నాయి. ఈ ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌కు రిటర్నింగ్ అధికారిగా నియమితుడైన మాజీ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఆర్కే గౌబ.. తనపై దుష్ర్పచారం జరుగుతోందంటూ ఆ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత బీఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ ప్రెసిడెంట్ అజయ్ సింగ్‌‌‌‌‌‌‌‌తో పాటు కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కూడా బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్ష పదవికి పోటీ పడే అవకాశం ఉంది.