
(వెలుగు స్పోర్ట్స్ డెస్క్) : కరోనా మహమ్మారి దెబ్బకు యావత్ క్రీడా ప్రపంచం స్తంభించింది. వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్ ఒలింపిక్స్ సైతం వచ్చే ఏడాదికి పోస్ట్‌పోన్ అయింది. మరెన్నో ఈవెంట్లు రద్దయ్యాయి. ఇంకా అనేక దేశాల్లో ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ అమల్లోనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు జరుగుతుందో లేదో అనుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదమూడో సీజన్ అరబ్ గడ్డపై అదరహో అనిపించింది. ఎమ్టీ స్టేడియాల్లో జరిగినా.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించింది. 8 జట్లు.. ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్, అఫీషియల్స్ కలుపుకొని వందల మంది రెండు నెలల పాటు తమను తాము ‘బయో బబుల్’లో బందీ చేసుకొని అభిమానులకు అంతులేని వినోదాన్ని పంచారు. చెన్నై జట్టులో కరోనా కలకలం మినహాయిస్తే టోర్నీ ఆరంభం నుంచి చివరిదాకా అన్ని జట్లూ అద్భుత పోరాట పటిమను చూపెట్టాయి. ఎన్నో రసవత్తర పోరాటాలతో ఫ్యాన్స్ థ్రిల్ అయ్యారు. తొలి వారమే హోరాహోరీ పోరాటాలతో క్రికెట్ వరల్డ్ దృష్టిని ఆకర్షిస్తే.. సూపర్ ఓవర్లు, డబుల్ సూపర్ ఓవర్ల సమరాలు, చివరి వారం వరకూ దోబూచులాడిన ప్లే ఆఫ్ బెర్తులు మరింత మజాను పంచాయి.
మెగా లీగ్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్ తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ ఐదో టైటిల్‌తో అందనంత ఎత్తుకు దూసుకెళ్లింది. పదమూడో సీజన్ సక్సెస్‌లో ఆ టీమ్‌ది కీలక పాత్ర. అలాగే, పలువురు స్టార్ క్రికెటర్లు కూడా లీగ్‌పై తమదైన ముద్ర వేశారు. తమపై ఉన్న అంచనాలను అందుకుంటూ వాళ్లు మెరుపులు మెరిపిస్తే.. ఇంకొందరు అనామకులు తమ పెర్ఫామెన్స్‌తో ఒక్కసారిగా స్టార్లు అయ్యారు. రెండు నెలల మెగా టోర్నీలో తమ ఆటతో కోట్లాది మంది అభిమానులకు కిక్కిచ్చిన ప్లేయర్లెవరో చూద్దాం..!
లోకేశ్ రాహుల్
ఫస్ట్ టైమ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ కెప్టెన్సీ అందుకున్న లోకేశ్ రాహుల్ జట్టును ముందుండి నడిపించాడు. 55.83 యావరేజ్‌తో ఏకంగా 670 రన్స్ చేసిన అతను టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వరుసగా మూడో ఏడాది కూడా బ్యాట్స్‌మన్‌గా లీగ్‌లో ఆధిపత్యం చెలాయించాడు. గత రెండు సీజన్లలో 593, 659 రన్స్ చేసిన లోకేశ్ ఈ సారి మరింత బెస్ట్ పెర్ఫామెన్స్ చేశాడు. కెప్టెన్‌గా ఫర్వాలేదనిపించాడు. దాంతో, తొలి ఏడు గేమ్స్‌లో ఆరింటిలో ఓడిన పంజాబ్ గొప్పగా కమ్‌బ్యాక్ చేసింది. వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి రేసులోకి వచ్చినప్పటికీ చివర్లో నిలకడలేమితో ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. అయితే, కెప్టెన్ లోకేశ్ రాహుల్–కోచ్ అనిల్ కుంబ్లే కాంబోనూ కొనసాగించాలని కింగ్స్ ఎలెవన్ ఫ్రాంచైజీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్‌లో కెప్టెన్‌గానూ లోకేశ్ సక్సెస్ సాధించొచ్చు.
కగిసో రబాడ
వరుసగా రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ చేరిందంటే అది సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ కగిసో రబాడ సత్తాతోనే అనడంలో సందేహం లేదు. లాస్ట్ ఇయర్ 25 వికెట్లతో సెకండ్ బెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచిన రబాడ ఈసారి 30 వికెట్లతో పర్పుల్ క్యాప్ సాధించి టీమ్‌ను ఫస్ట్ టైమ్ ఫైనల్ చేర్చాడు. రబాడతో పాటు అతని సౌతాఫ్రికా టీమ్‌మేట్ అన్రిచ్ నోకియా 22 వికెట్లతో సత్తా చాటాడు. వీరిద్దరూ టోర్నీలో బెస్ట్ న్యూ బాల్ పెయిర్‌గా నిలిచారు.
శిఖర్ ధవన్
ఈ సీజన్ సరైన ఓపెనింగ్ కాంబినేషన్ లేక ఢిల్లీ తడబడింది. ఆ టీమ్ టైటిల్ మిస్ చేసుకోవడంలో ఓ కారణం కూడా ఇదే. అయినప్పటికీ ఆ టీమ్ ఓపెనర్ శిఖర్ ధవన్ చెలరేగిపోయాడు. సరైన ఓపెనింగ్ పార్ట్‌నర్ లేకపోయినా తను మాత్రం బ్యాటుతో దంచికొట్టాడు. 618 రన్స్ చేసిన గబ్బర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ అద్భుత పెర్ఫామెన్స్ చేశాడు. ఐపీఎల్‌లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో రికార్డు క్రియేట్ చేశాడు.
రుతురాజ్ గైక్వాడ్
ఐపీఎల్‌లో సక్సెస్‌ఫుల్ జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ సీజన్ ఓ చేదు జ్ఞాపకం. టోర్నీ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ప్లే ఆఫ్స్ చేరకపోయినప్పటికీ రుతురాజ్ గైక్వాడ్ రూపంలో ఓ టాలెంటెడ్ ప్లేయర్‌ను వెలుగులోకి తెచ్చిందా టీమ్. కరోనా వైరస్ బారిన పడి ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన ఈ టాపార్డర్ బ్యాట్స్‌మన్ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. ప్రాణాంతక మహమ్మారిని జయించిన ఆత్మవిశ్వాసంతో మొదట్లో ఎదురైన ఫెయిల్యూర్స్ నుంచి కూడా బయటపడ్డాడు. ఫస్ట్ మూడు మ్యాచ్‌ల్లో 0, 5, 0తో ఫెయిలైన అతను తర్వాత వరుసగా మూడు హాఫ్ సెంచరీలతో కెప్టెన్ ధోనీ నమ్మకాన్ని నిలబెట్టాడు. వచ్చే సీజన్‌లో పలువురు వెటరన్ ప్లేయర్లను వదులుకొని ఫ్రెష్‌గా రావాలని చూస్తున్న చెన్నై కోర్‌గ్రూప్‌లో రుతురాజ్ కీలకం కాబోతున్నాడు.
జస్‌ప్రీత్ బుమ్రా
చాన్నాళ్లు ఆటకు దూరంగా ఉంటే బౌలర్లు సహజంగానే రిథమ్ కోల్పోతారు. కానీ, ఆరు నెలలు ఎలాంటి క్రికెట్ ఆడకున్నా కూడా ముంబై ఇండియన్స్ స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఏమాత్రం తేడా రాలేదు. పైగా ఈ సారి మరింత పవర్‌ఫుల్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికించాడు. 14.96 యావరేజ్‌తో 27 వికెట్లు తీసిన జస్‌ప్రీత్ సెకండ్ బెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. పవర్‌ప్లేతో పాటు స్లాగ్ ఓవర్లలో బుల్లెట్లలాంటి బాల్స్‌తో అపోనెంట్ బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. అతనికి ట్రెంట్ బౌల్ట్ (25 వికెట్లు) తోడవడంతో ముంబై ఇండియన్స్ బౌలింగ్ అటాక్‌కు తిరుగే లేకుండా పోయింది.
ఇషాన్ కిషన్
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ హవా ఎలా నడిచిందో యంగ్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ పేరు కూడా అంతే మార్మోగింది. టాలెంటెడ్ ప్లేయర్‌గా పేరున్నప్పటికీ.. ఇది వరకే తన సత్తా చాటుకున్నప్పటికీ.. ఈ సీజన్ మాత్రం కిషన్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అనొచ్చు. అంత గొప్ప పెర్ఫామెన్స్ చేశాడతను. ఫస్ట్ రెండు మ్యాచ్‌ల్లో పక్కనబెట్టిన ముంబై మూడో పోరులో అతనికి ఓ చాన్సిచ్చింది. అంతే.. 99 రన్స్‌తో చెలరేగిన అతను వెనుదిరిగి చూసింది లేదు. నిలకడైన ఆటతో, పవర్‌ఫుల్ షాట్లతో రెచ్చిపోయాడు. బ్యాటింగ్ పొజిషన్స్ మార్చినా బాదుడులో తేడా రానివ్వకుండా 14 ఇన్నింగ్స్‌ల్లోనే 516 రన్స్ చేశాడు. అందులో నాలుగు ఫిఫ్టీలు ఉన్నాయి. సీజన్‌లో బెస్ట్ యావరేజ్ (57.33) అతనిదే. ముంబై టైటిల్ నెగ్గడంలో ఇషాన్ పాత్ర వెలకట్టలేనిది. ఇదే జోరు కొనసాగిస్తే అతను తొందర్లోనే టీమిండియాలోకి వస్తాడు.
డేవిడ్ వార్నర్
వరుసగా ఆరో సీజన్‌లోనూ 500 ప్లస్ రన్స్ చేసిన ఫస్ట్ క్రికెటర్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రికార్డు సృష్టించాడు. నిలకడైన ఆటతో అతను ‘ఐపీఎల్ లెజెండ్స్’ క్లబ్‌లో చేరాడు. బ్యాట్‌తోనే కాకుండా లీడర్‌గా కూడా అతను ప్రభావం చూపాడు. పడుతూ లేస్తూ సాగుతున్న సన్‌రైజర్స్‌ను సెకండాఫ్‌లో అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాడు. తన నాయకత్వ పటిమతో ప్లే ఆఫ్స్‌కు తీసుకెళ్లాడు.
వరుణ్ చక్రవర్తి
ఆర్కిటెక్ట్ నుంచి మిస్టరీ స్పిన్నర్‌గా మారిన కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయర్ వరుణ్ చక్రవర్తి కెరీర్‌లో ఈ సీజన్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను కాదని కేకేఆర్ ఇచ్చిన అవకాశాలను రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడీ తమిళనాడు ప్లేయర్. టీమ్ నమ్మకాన్ని నిలబెడుతూ 20.94 యావరేజ్‌తో 17 వికెట్లు తీసి కోల్‌కతా విజయాల్లో పాలుపంచుకున్నాడు. అందులో ఓ ఐదు వికెట్ల పెర్ఫామెన్స్ కూడా ఉంది. ఈ సీజన్‌లో అతని స్పిన్ మాయాజాలం చూసిన సెలెక్టర్లు ఆసీస్ టూర్‌లో ఇండియా టీ20 టీమ్‌కు ఎంపిక చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. కానీ, గాయం కారణంగా ఈ చాన్స్‌ను అతను దూరం చేసుకున్నాడు.
టి. నటరాజన్
కెప్టెన్ డేవిడ్ వార్నర్, స్పిన్నర్ రషీద్ ఖాన్‌తో కలిసి సన్‌రైజర్స్ హైదరాబాద్ సక్సెస్‌లో టి. నటరాజన్ కీలక పాత్ర పోషించాడు. టోర్నీలో అందరికంటే ఎక్కువ యార్కర్లు వేసిన ఈ లెఫ్టామ్ పేసర్ టీమిండియాకు ఆడే సత్తా ఉందని నిరూపించుకున్నాడు. గాయపడ్డ భువనేశ్వర్ కుమార్ ప్లేస్‌లో వచ్చిన తమిళనాడు కుర్రాడు.. భువీ లోటు కనిపించకుండా చేశాడు. ఎలిమినేటర్‌లో ఆర్‌సీబీ స్టార్ ఏబీ డివిలియర్స్‌ను బౌల్డ్ చేసిన యార్కర్ టోర్నీలోనే ది బెస్ట్ అనొచ్చు. ఓవరాల్‌గా 16 వికెట్లు తీసిన అతను ఆస్ట్రేలియా టూర్‌లో ఇండియా టీ20 టీమ్‌కు సెలెక్టయ్యాడు.
దేవదత్ పడిక్కల్
15 ఇన్నింగ్స్‌ల్లో 31.53 యావరేజ్‌తో 473 రన్స్. ఐదు హాఫ్ సెంచరీలు. ఫస్ట్ సీజన్‌లోనే ఆర్‌సీబీ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ పెర్ఫామెన్స్. ఇది అతనికి డ్రీమ్ డెబ్యూ అనొచ్చు. కెప్టెన్ కోహ్లీ, ఫ్రాంచైజీ తనపై ఉంచిన నమ్మకానికి ఈ లెఫ్టాండర్ వంద శాతం న్యాయం చేశాడు. టాపార్డర్‌లో కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌పై ప్రెజర్ తగ్గించాడు. ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరడంలో అతనిది కీ రోల్. అద్భుతమైన స్ట్రోక్ ప్లేతో పాటు ఓపిగ్గా క్రీజులో నిలుస్తూ జట్టుకు అండగా నిలిచాడు. అందుకే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డు అతడిని వరించింది.