జలాల్ పూర్ సర్పంచ్ భర్త, మరిది అరెస్ట్?

జలాల్ పూర్ సర్పంచ్ భర్త, మరిది అరెస్ట్?
  • నిజామాబాద్ జిల్లా వర్నిలో ఫేక్ నోట్ల కలకలం
  • భయంతో నోట్లను కాల్చి వేసిన పలువురు గ్రామస్తులు 

వర్ని,వెలుగు : నిజామాబాద్ ​జిల్లా వర్ని మండలం జలాల్​పూర్​లో దొంగనోట్ల కేసులో సర్పంచ్​భర్త, మరిదిని పోలీసులు అదుపులోకి తీసుకుని వేరే ప్రాంతానికి తరలించారు. దీంతో తమను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో శనివారం కొందరు గ్రామస్తులు రూ. 500 ఫేక్ నోట్లను కాల్చి వేశారు.  జలాల్​పూర్​సర్పంచ్​గా గెలిచిన బాలు మమత బంధువు నరెడ్ల చిన్నసాయిలు శుక్రవారం వర్నిలోని కెనరా బ్యాంకులో క్రాప్​లోన్​కట్టేందుకు రూ. 2 ,08,500 సంబంధించి రూ. 500 ఫేక్ నోట్లను ఇవ్వగా అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా సర్పంచ్​భర్త బాలు, మరిది శంకర్​ని శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని వేరే ప్రాంతానికి తీసుకెళ్లినట్టు తెలిసింది. 

దీనిపై వర్ని ఇన్ చార్జ్ ఎస్ఐ రాజుని వివరణ కోరగా తనకు తెలియదని చెప్పారు.  రెండు, మూడు రోజులుగా జలాల్ పూర్ కు ఏదైనా వాహనం, ఎవరైనా కొత్తవాళ్లు వచ్చినా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దొంగనోట్లు జలాల్​పూర్​కే పరిమితమా.? లేక బాన్సువాడ నియోజకవర్గానికి కూడా పాకిందా..? అనే అనుమానాలు వస్తున్నాయి. నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ. 2 , 3, 4 వేల చొప్పున అభ్యర్థులు ఓటర్లకు పంపిణీ చేశారని, ఆ డబ్బు అంతా ఒరిజినలా.. లేక ఫేక్ నోట్లా అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.