
న్యూఢిల్లీ: ఐపీఎల్ పదమూడో సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోయి ఫ్యాన్స్‌ను నిరాశకు గురి చేస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో సురేశ్ రైనా లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. శుక్రవారం సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డర్ల తప్పిదాలతో సీఎస్కే అదనపు పరుగులు ఇచ్చుకుంది. బ్యాటింగ్‌లో ఊపు మీద ఉన్న రైజర్స్ బ్యాట్స్‌మన్ అభిషేక్ క్యాచులను రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో టీమ్ పెర్ఫామెన్స్‌పై కెప్టెన్ ధోని సీరియస్ అయ్యాడు. ‘మేం చాలా కాలం తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయామనుకుంటా. చాలా విషయాల్లో మేం మెరుగవ్వాల్సి ఉంది. క్యాచ్‌లు విడిచిపెట్టడం, నో బాల్స్ వేయడం ప్రొఫెషనలిజం అనిపించుకోదు. అవే తప్పులను మేం రిపీట్ చేస్తున్నాం. నాకౌట్ గేమ్స్‌లో క్యాచులను జారవిడవడం శాపంగా మారుతుంది. ఒకవేళ ఇది నాటౌట్ గేమ్ అయితే పరిస్థితి ఎలా ఉండేది? అన్నింటిలోనూ మెరుగై బలంగా తిరిగొస్తాం’ అని ధోని చెప్పాడు.