
అంపైర్ కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వాలన్న వీరేందర్ సెహ్వాగ్
టెక్నాలజీని మరింతగా వాడుకోవాలంటున్న మాజీ ప్లేయర్లు
దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఆన్ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది. పంజాబ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ మూడో బాల్‌కు ఆ టీమ్ ప్లేయర్ క్రిస్ జోర్డాన్ క్రీజులో బ్యాటు పెట్టకుండా రన్ కంప్లీట్ చేశాడని నితిన్ మీనన్ దాన్ని ‘షార్ట్ రన్’ గా గుర్తించాఃడు. కానీ నాన్ స్ట్రయికింగ్ ఎండ్ నుంచి వచ్చిన జోర్డాన్ ఫస్ట్ రన్ కంప్లీట్ చేసేటప్పుడు బ్యాటు క్రీజులో పెట్టినట్టు టీవీ రీప్లేలో తేలింది. అయినా అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేదు. బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్‌తో పాటు పంజాబ్ టీమ్ టోటల్‌లో ఒకే రన్ యాడ్ అయింది. ఫైనల్ ఓవర్లో పంజాబ్ కు 13 పరుగులు అవసరం కాగా.. మొదటి మూడు బాల్స్ కు మయాంక్ 12 రన్స్ రాబట్టాడు. నాలుగోది డాట్ బాల్ అవగా.. లాస్ట్ రెండు బాల్స్ కు రెండు వికెట్లు పడ్డాయి. దాంతో ఆట సూపర్ ఓవర్ కు దారి తీయగా… అక్కడ పంజాబ్ ఓడిపోయింది. ఒకవేళ ఆ షార్ట్ రన్ ను పంజాబ్ టోటల్లో యాడ్ చేసి ఉంటే మరో మూడు బాల్స్ మిగిలుండగానే ఆ జట్టు గెలిచేది. అంపైర్ నిర్ణయంపై పంజాబ్ టీమ్ .. మ్యాచ్ రెఫరీకి ఫిర్యా దు చేసింది. కానీ, ఐపీఎల్ రూల్ బుక్ లోని 2.12 రూల్ ప్రకారం అంపైర్ నిర్ణయమే ఫైనల్ కాబట్టి పంజాబ్ అప్పీల్ వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. మరోవైపు ఈ వివాదంపై లెజెండరీ బ్యాట్స్‌మన్ వీరేందర్ సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందించాడు. రాంగ్ డిసిజన్ తీసుకున్న అంపైర్ మీనన్ ను విమర్శించాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ చాయిస్‌ను నేను ఒప్పుకోను. ఈ షార్ట్ రన్ నిర్ణయం తీసుకున్న అంపైర్ కే ఆ అవార్డు ఇవ్వాలి. అది షార్ట్ రన్ కాదు. కానీ, అదే రిజల్ట్ ను మార్చేసింది’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.