కోల్‌‌కతా‌‌ వర్సెస్ ముంబై: సమవుజ్జీల సమరంలో గెలుపెవరిదో?

కోల్‌‌కతా‌‌ వర్సెస్ ముంబై: సమవుజ్జీల సమరంలో గెలుపెవరిదో?

యూఏఈ: ఐపీఎల్ పదమూడో సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. హోరాహోరీ మ్యాచ్‌‌లు, భారీ స్కోర్లతో టోర్నీ ఇంట్రెస్టింగ్‌‌ మోడ్‌‌లోకి వచ్చేసింది. తొలి మ్యాచ్‌‌లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ ఫస్ట్ విక్టరీ కోసం బుధవారం బరిలోకి దిగనుంది. టోర్నీ ఫేవరెట్స్‌‌‌లో ఒకటైన కోల్‌‌కతా నైట్ రైడర్స్‌‌ను ముంబై ఢీకొననుంది. చెన్నైతో మ్యాచ్‌‌లో శుభారంభం చేసినప్పటికీ మిడిలార్డర్ విఫలం కావడంతో ముంబై మూమెంటమ్‌‌ను కొనసాగించలేకపోయింది. యూఏఈ పరిస్థితులకు అలవాటు పడటంతోపాటు తొలి మ్యాచ్‌‌లో చేసిన తప్పులను రిపీట్ చేయొద్దని రోహిత్ సేన కోరుకుంటోంది. అయితే కోల్‌‌కతా టీమ్‌‌లో ఆండ్రీ రస్సెల్ రూపంలో ముంబైకి పెను ప్రమాదం పొంచి ఉంది. రస్సెల్ లాంటి ప్లేయర్ అపోజిషన్‌‌లో ఉన్నప్పుడు ముంబైకి టార్గెట్ ఫిక్స్ చేయడం కష్టమే. కాబట్టి టాస్ గెలిస్తే ముంబై ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

ముంబై టీమ్‌‌లో ట్రెంట్ బౌల్ట్ స్థానంలో మిచెల్ మెక్లెనగన్ రావొచ్చే చాన్స్ ఉంది. దీన్ని మినహాయిస్తే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న కోల్‌‌కతాకు ప్యాట్ కమిన్స్, రస్సెల్, సునీల్ నరైన్, ఇయాన్ మోర్గాన్ రూపంలో అద్భుతమైన ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. కేకేఆర్‌‌కు యంగ్ క్రికెటర్ శుభ్‌‌మన్ గిల్‌‌, ఆల్‌‌రౌండర్ సునీల్ నరైన్ ఓపెనింగ్ చేయొచ్చు. నితీశ్ రానా వన్‌డౌన్‌‌లో ఆ తర్వాత విధ్వంసక ఆండ్రీ రస్సెల్ క్రీజులోకి రావొచ్చు. మిడిలార్డర్‌ బాధ్యతలను కెప్టెన్ దినేశ్ కార్తీక్, మోర్గాన్ మోయనున్నారు. నరైన్, కుల్దీప్ యాదవ్, ప్యాట్ కమిన్స్, ప్రసిద్ధ కృష్ణతో కేకేఆర్ బౌలింగ్ విభాగం బలంగా ఉంది. కమలేష్ నాగర్ కోటి లేదా శివం మావిల్లో ఒకరు గ్రౌండ్‌‌‌లోకి దిగొచ్చు. పటిష్టమైన ముంబై, సమతూకంతో ఉన్న కోల్‌‌కతా మధ్య పోరులో ఎవరు గెలిచినా మ్యాచ్ మాత్రం ఆసక్తికరంగా సాగుతుందనడంలో సందేహం అవసరం లేదు.