ఐపీఎల్ వేలంలో ఆసీస్ ఆటగాళ్ల డిమాండ్ : యంగ్ ప్లేయర్స్ పై SRH ఫోకస్

ఐపీఎల్ వేలంలో ఆసీస్ ఆటగాళ్ల డిమాండ్ : యంగ్ ప్లేయర్స్ పై SRH ఫోకస్

కోల్ కతా : ఐపీఎల్ సీజన్-2020కి సంబంధించి ఆటగాళ్ల వేళ వేలం కోల్ కతా వేదికగా జరిగింది.  ఫస్ట్ రౌండ్ లో ఆసీస్ ప్లేయర్లు రికార్డు ధరలకు అమ్ముడు పోయారు. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమ్మిన్స్ ఏకంగా 15 కోట్ల 50 లక్షలకు అమ్ముడుపోయాడు. బెంగళూరు, కోల్ కతా, ఢిల్లీ  ఫ్రాంఛైజీలు కమ్మిన్స్ కోసం పోటీ పడగా…చివరికు కోల్ కతాకు దక్కాడు. దీంతో ఐపీఎస్ చరిత్రలో అత్యధిక  ధరకు అమ్ముడు పోయిన ఫారిన్ ప్లేయర్ గా కమ్మిన్స్ రికార్డు సృష్టించాడు. 2 కోట్ల కనీస ధరతో ఉన్న ఆసీస్ ఆల్ రౌండర్ మాక్స్ వెల్ ను 10 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.

చెన్నై వేదికగా భారత్ తో జరిగిన తొలి వన్డేలో సెంచరీతో కదంతొక్కిన విండీస్ ప్లేయర్ హెట్ మెయిర్ సైతం భారీ ధరను దక్కించుకున్నాడు. 50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన హెట్ మెయిర్ కోసం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చివరి వరకు పోటీ పడ్డాయి. ఐతే చివరకు 7 కోట్ల 75 లక్షలకు హెట్ మెయిర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ఎగరేసుకుపోయింది. ఇక బౌలింగ్ లో సత్తా చాటుతున్న కరీబియన్ ప్లేయర్ కాట్రెల్ కూడా జాక్ పాట్ కొట్టాడు. 50 లక్షల మినిమమ్ ప్రైజ్ తో వేలంలోకి వచ్చిన కాట్రేల్  ను కింగ్స్ ఎలెవల్ పంజాబ్ 8 కోట్ల 50 లక్షలకు దక్కించుకుంది.

ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ఆరోన్ ఫించ్ అరుదైన ఘనత సాధించాడు. ఈ వేలంలో 4 కోట్ల 40 లక్షల ధరకు ఆర్సీబీకి వెళ్లిన ఫించ్…దీంతో ఇప్పటివరకూ అన్ని ఫ్రాంఛైజీలకు ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇక..సౌతాఫ్రికా ప్లేయర్ క్రిస్ మోరిస్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 కోట్లు పెట్టింది. ఆసీస్ బౌలర్ నాథన్ కౌల్టర్ నైల్ సైతం భారీ ధరను దక్కించుకున్నాడు. కోటీ కనీస ధరతో వేలంలోకి అడుగుపెట్టిన కౌల్టర్ నైల్ ను ముంబయి ఇండియన్స్ 8 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ పేసర్ సామ్ కరన్…5 కోట్ల 25 లక్షలకు CSK కు అమ్ముడుపోగా.. జేసన్ రాయ్, క్రిస్ వోక్స్ లను కోటి 50 లక్షలకు ఢిల్లీ కేపిటల్స్ కొనుగోలు చేసింది. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 5 కోట్ల 50 లక్షలకు కోల్ కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది…

ఇండియన్ ప్లేయర్స్ లో…సీనియర్ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా ఊహించని ధర పలికాడు. ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు చావ్లా. కోటి రూపాలయల కనీస ధరతో ఉన్న చావ్లాను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 6 కోట్ల 75 లక్షలకు కొనుగోలు చేసింది. రాబిన్ ఊతప్ప, జయదేవ్ ఉనద్కత్ లను చెరో 3 కోట్ల ధరకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. దీపక్ హుడాను కనీస ధర 50 లక్షలకు  దక్కించుకుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.

యువ ఆటగాళ్లలో యశస్వి జైపాల్  2 కోట్ల 40 లక్షల ధర పలికి అదుర్స్ అనిపించాడు. యశస్వి కోసం ముంబై ఇండియన్స్, కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు 2 కోట్ల 40 లక్షలకు రాజస్థాన్ దక్కించుకుంది. ఇటీవల జరిగిన విజయ్ హాజారే ట్రోఫిలో డబుల్ సెంచరీతో అదరగొట్టాడు ఈ ముంబై ప్లేయర్.

సన్ రైజర్స్ హైదరాబాద్ యంగ్ ప్లేయర్స్ పై దృష్టి పెట్టింది. ఇండియన్ అండర్-19 కెప్టెన్ ప్రియమ్ గార్గెను కోటి 90 లక్షలకు కొనుగోలు చేసింది. విరాట్ సింగ్ ను సైతం అదే ధరకు దక్కించుకుంది.  ఇక వేలంలోకి వచ్చిన ఇండియన్ల్ ప్లేయర్స్ యూసఫ్ పఠాన్, స్టువర్ట్ బిన్ని, హనుమ విహారి, ఛతేశ్వర్ పూజారాలను కొనేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు.