టీ20: బెంగళూరు 92 ఆలౌట్..కోల్‌కతా టార్గెట్ 93

టీ20: బెంగళూరు 92 ఆలౌట్..కోల్‌కతా టార్గెట్ 93
  • ఓపెనర్ గా దిగి తక్కువ స్కోర్ కే  కోహ్లి (5) ఔట్

అబుదాబి:  ఐపీఎల్ టీ20లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు 92 పరుగులకే ఆలౌట్ అయింది. మరో ఓవర్ మిగిలి ఉండగానే ఇన్నింగ్స్ ముగించి ఐపీఎల్ లో అతి తక్కువ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్ గా బరిలోకి దిగి కెప్టెన్ విరాట్ కోహ్లిని మ్యాచ్ రెండో ఓవర్ లోనే తక్కువ స్కోర్ కే పెవిలియన్ బాటపట్టించిన కోల్ కతా బౌలర్ల ధాటికి బెంగళూరు ఆటగాళ్ల బ్యాట్లు ఎత్తేశారు. పిచ్ పై పడి బులెట్లలా దూసుకొస్తున్న బంతులను ఎదుర్కోవడానికి నానా అవస్థలు పడ్డ బెంగళూరు ఆటగాళ్లు కేవలం 92 పరుగులకు చాప చుట్టేశారు. ఇన్నింగ్స్ లో మరో ఓవర్ మిగిలి ఉండగానే ఆలౌటై ప్రత్యర్థి కోల్ కతా జట్టుకు స్వల్ప టార్గెట్ నిర్దేశించారు. 
టాస్ గెలిచి వెంటనే బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లి తానే స్వయంగా ఓపెనర్ గా బరిలోకి దిగి కేవలం 4 బంతులు ఎదుర్కొని 5 పరుగులకే ఔటయిపోయి ప్రత్యర్థి జట్టుకు చేజేతులా ఆధిక్యం సమర్పించుకున్నారు. కోహ్లి తర్వాత బరిలోకి దిగిన ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగిపోయింది. పడిక్కల్ (22), శ్రీకర్ భరత్ (16) పోరాడేలా కనిపించినా.. వికెట్లను కాపాడుకునే క్రమంలో పెవిలియన్ బాట పట్టారు. నిలదొక్కుకున్నట్లే కనిపించిన పడిక్కల్  ఆ తర్వాత భరత్ వెంట వెంటనే పెవిలియన్ బాట పట్టడంతో బెంగళూరు పీకలోతు కష్టాల్లో చిక్కుకుంది. అయితే డివిలియర్స్, మ్యాక్స్ వెల్ తదితర బ్యాట్స్ మెన్ ఉండడంతో ధీమాగా కనిపించినా.. డివిలియర్స్ డకౌట్ కావడం.. ఆరంగేట్ర ఆటగాడు హసన రంగ కూడా గోల్డెన్ డక్ కావడంతో బెంగళూరు పూర్తిగా చతులెత్తేసింది. చివర్లో హర్ష పటేల్, సిరాజ్ 8 పరుగులు చేయగా.. మరో ఓవర్ మిగిలి ఉండగానే బెంగళూరు ఇన్నింగ్స్ కు తెరపడింది. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, ఆండ్రూ రస్సెల్ చెరో మూడు వికెట్లు తీయగా.. ఫెర్గ్యూసన్ రెండు, ప్రసిధ్ కృష్ణ ఒక వికెట్ చొప్పున తీశారు.