సన్ రైజర్స్‌ బోణీ కొట్టేనా! ఇవాళ ఆర్​సీబీతో పోరు

సన్ రైజర్స్‌ బోణీ కొట్టేనా! ఇవాళ ఆర్​సీబీతో పోరు


చెన్నై: ఐపీఎల్‌‌–14వ సీజన్‌‌ను ఓటమితో ఆరంభించిన సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ మరో పోరుకు రెడీ అయింది. లీగ్‌‌లో బోణీ కొట్టడమే లక్ష్యంగా చెపాక్‌‌ స్టేడియంలో బుధవారం జరిగే మ్యాచ్‌‌లో రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరుతో పోటీ పడనుంది. కోల్‌‌కతా నైట్‌‌ రైడర్స్‌‌తో తొలి మ్యాచ్‌‌లో చేసిన తప్పిదాలను  సరిదిద్దుకొని వెంటనే విజయాల బాట పట్టాలని కోరుకుంటోంది. మరోవైపు ఐదుసార్లు చాంపియన్‌‌ ముంబై ఇండియన్స్‌‌పై అద్భుత విజయంతో లీగ్‌‌ను స్టార్ట్‌‌ చేసిన విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని ఆర్‌‌సీబీ అదే ఊపులో మరో విక్టరీపై కన్నేసింది. దాంతో ఆ టీమ్‌‌ను ఓడించాలంటే రైజర్స్‌‌ తమ బెస్ట్‌‌ ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా  ఫస్ట్‌‌ మ్యాచ్‌‌లో ఫెయిలైన ఓపెనర్లు వృద్ధిమాన్‌‌ సాహా, డేవిడ్‌‌ వార్నర్ త్వరగా  గాడిలో పడాల్సిన అవసరం ఉంది. ఆర్‌‌సీబీపై మంచి రికార్డు ఉన్న వార్నర్.. ఈ మ్యాచ్‌‌లో సత్తా చాటి ఫామ్‌‌ అందుకోవాలని చూస్తున్నాడు. అవసరం అయితే జానీ బెయిర్​స్టోతో కలిసి ఓపెనింగ్‌‌ చేసే చాన్సుంది. కేకేఆర్​పై  జానీ హాఫ్​ సెంచరీతో మెప్పించాడు. మిడిలార్డర్​లో మనీష్‌‌ పాండే కూడా ఫిఫ్టీ చేసినా మ్యాచ్‌‌ ఫినిష్‌‌ చేయలేకపోయాడు. మహ్మద్‌‌ నబీ, విజయ్‌‌ శంకర్​అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఎప్పట్లానే  మిడిలార్డర్​ కాస్త వీక్‌‌గా ఉంది కాబట్టి టాపార్డర్​ సక్సెస్‌‌ అయితేనే రైజర్స్‌‌ ముందుకెళ్లగలదు. బౌలింగ్‌‌లోనూ మరికాస్త ఇంప్రూవ్‌‌ అవ్వాల్సిన అవసరం ఉంది. ఫస్ట్‌‌ మ్యాచ్‌‌లో ఎక్కువ రన్స్‌‌ ఇచ్చుకున్న పేస్‌‌ లీడర్​ భువనేశ్వర్ పుంజుకోవాలి. స్పిన్నర్లు నబీ, రషీద్‌‌ ఫామ్‌‌ కొనసాగిస్తే జట్టు బోణీ కొట్టగలదు. 

బరిలోకి పడిక్కల్

ముంబైపై విక్టరీతో ఆర్​సీబీ ఫుల్‌‌ జోష్​లో ఉంది. కరోనా నుంచి కోలుకున్న టాలెంటెడ్‌‌ ఓపెనర్​ దేవదత్‌‌ పడిక్కల్‌‌ అందుబాటులోకి రావడంతో ఆ టీమ్‌‌ బలం మరింత పెరిగింది. ఈ డొమెస్టిక్ సీజన్‌‌లో సూపర్‌‌ పెర్ఫామెన్స్‌‌ చేసిన పడిక్కల్‌‌ ఐపీఎల్‌‌లోనూ తన ఫామ్‌‌ కొనసాగించాలని చూస్తున్నాడు. కోహ్లీ, డివిలియర్స్‌‌, మ్యాక్స్‌‌వెల్‌‌ అదే జోరు కొనసాగిస్తే ఆర్‌‌సీబీకి తిరుగుండదు. బౌలింగ్‌‌లోనూ పేసర్లు  సిరాజ్‌‌, జెమీసన్‌‌ కూడా ఆకట్టుకున్నారు.  ముఖ్యంగా ముంబైపై ఐదు వికెట్లు తీసిన హర్షల్‌‌ పటేల్‌‌పై అందరి ఫోకస్‌‌ ఉంది. 

మరిన్ని వార్తలు