రాజస్తాన్‌‌పై 5 వికెట్ల తేడాతో ముంబై విజయం

రాజస్తాన్‌‌పై 5 వికెట్ల తేడాతో ముంబై  విజయం

నావి ముంబై: హమ్మయ్య.. ఐదుసార్లు చాంపియన్, టాప్ టీమ్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌‌లో ఎట్టకేలకు బోణీ కొట్టింది. శనివారం కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టినరోజున రాజస్తాన్ రాయల్స్‌‌పై 4 వికెట్ల తేడాతో గెలిచిన ముంబై ఆడిన తొమ్మిదో మ్యాచ్‌‌లో నెగ్గి హిట్‌‌మ్యాన్‌‌కు బర్త్‌‌డే గిఫ్ట్ ఇచ్చింది. తొలుత బ్యాటింగ్‌‌లో రాజస్తాన్ 20 ఓవర్లలో 158/6 స్కోర్ చేసింది. జాస్ బట్లర్ (52 బాల్స్ లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 67) ఫిఫ్టీతో అలరించాడు. ముంబై బౌలర్లలో మెరిడిత్ (2/24), హృతిక్ (2/47) చెరో రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్‌‌లో సూర్యకుమార్ (39 బాల్స్ లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 51) హాఫ్‌‌ సెంచరీతో రాణించడంతో 19.2 ఓవర్లలో 161/5 స్కోర్ చేసిన ముంబై గెలిచింది. రాజస్తాన్ బౌలర్లలో అశ్విన్ (1/21), బౌల్ట్ (1/26), కుల్దీప్ సేన్ ( 1/29), ప్రసీధ్ (1/29), చహల్ (1/33) తలా ఓ వికెట్ తీశారు. సూర్యకుమార్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

బట్లర్ ఒక్కడే..

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన రాజస్తాన్ ఓ మోస్తారు స్కోరైనా చేసిందంటే అందుకు బట్లర్ ఫిఫ్టీనే కారణం. మూడో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన పడిక్కల్ (15) కొద్దిసేపటికే వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన శాంసన్ (16).. షోకీన్ వేసిన 7వ ఓవర్లో లాంగాఫ్, లాంగాన్‌‌లో రెండు సిక్సర్లు బాదినా నెక్స్ట్‌‌ ఓవర్లోనే  పెవిలియన్ చేరాడు. ఈ దశలో బట్లర్, డారైల్ మిచెల్ (17) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అప్పటికి సగం ఓవర్లలో రాజస్తాన్ 73/2తో నిలిచింది. ఆ తర్వాత ముంబై బౌలర్ల దాటికి నాలుగు ఓవర్ల పాటు ఒక్క బౌండరీ రాలేదు. 15వ ఓవర్లో మిచెల్ ఔట్ కాగా.. షోకీన్ వేసిన తర్వాతి ఓవర్లో నాలుగు సిక్సర్లతో బట్లర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని తర్వాతి బంతికే వెనుదిరిగాడు. రియాన్ పరాగ్ (3) విఫలమైనా.. అశ్విన్ (21) వచ్చి రాగానే ఫోర్, సిక్స్‌‌తో పాటు బుమ్రా ఓవర్లోనూ రెండు ఫోర్లతో రాయల్స్ స్కోర్ 150 దాటించి ఔటయ్యాడు. చివరి ఓవర్లో హెట్ మయర్ (6 నాటౌట్) క్రీజులో ఉన్నా మూడు రన్సే రావడంతో రాజస్తాన్ మోస్తారు స్కోర్ కు పరిమితమైంది.

ఆదుకున్న సూర్య, తిలక్

ఛేజింగ్‌‌లో రోహిత్ (2) విఫలమైనా మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (26) ముందు నుంచే దూకుడుగా ఆడాడు. మొదటి ఓవర్లోనే 6,4 బాది ఊపు మీద కనిపించాడు. మూడో ఓవర్లో రోహిత్, 6వ ఓవర్లో ఇషాన్ ఔట్ కావడంతో సూర్యకుమార్, తిలక్ వర్మ (35) ఇన్నింగ్స్‌‌ను బాగు చేసే బాధ్యత తీసుకున్నారు. మిచెల్ ఓవర్లో సూర్య 4, 4, 4తో పాటు తిలక్ 6 కొట్టగా తర్వాత బౌండ్రీలు తగ్గడంతో 10 ఓవర్లలో ముంబై 75/2తో నిలిచింది. ఇక 14వ ఓవర్లో సిక్స్ తో సూర్య హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా పటిష్ట స్థితిలో కనిపించిన ఇండియన్స్ విక్టరీకి దగ్గరగా వచ్చింది. కానీ వరుస ఓవర్లలో సూర్య, తిలక్ వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠకు దారితీసింది. 24 బాల్స్ లో 35 రన్స్ కావాల్సిన దశలో పొలార్డ్, టిమ్ డేవిడ్ విజయ సమీకరణాన్ని 12 బాల్స్ లో 12గా మార్చారు. 19వ ఓవర్లో 8 రన్స్ రాగా.. చివరి ఓవర్లో పొలార్డ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సామ్స్ సిక్స్ తో ముంబైకి విక్టరీ అందించాడు.