కోల్ కతాపై ఆర్సీబీ విక్టరీ..

కోల్ కతాపై ఆర్సీబీ విక్టరీ..
  •     కేకేఆర్‌పై ఉత్కంఠ విజయం
  •     రాణించిన హసరంగ, ఆకాశ్‌, రూథర్​ఫర్డ్​

ముంబై: తొలి మ్యాచ్‌‌‌‌లో 200 ప్లస్‌‌ స్కోరు చేసినా ఓడిన  రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు వెంటనే పుంజుకుంది. శ్రీలంక ఆల్‌‌రౌండర్‌‌ వానిందు హసరంగ (4/20)కు తోడు యంగ్‌‌ పేసర్లు ఆకాశ్ దీప్ (3/45),  హర్షల్ పటేల్ (2/11) అద్భుత బౌలింగ్‌‌తో మెప్పించడంతో ఐపీఎల్‌‌15లో బోణీ కొట్టింది. బుధవారం జరిగిన లో స్కోరింగ్ థ్రిల్లింగ్ మ్యాచ్‌‌లో మూడు వికెట్ల తేడాతో కోల్‌‌కతా నైట్‌‌ రైడర్స్‌‌ను ఓడించి తొలి విజయం సొంతం చేసుకుంది. చిన్న టార్గెట్‌‌ను కాపాడుకునేందుకు కేకేఆర్‌‌ చివరిదాకా పోరాడినా ఫలితం లేకపోయింది.  బెంగళూరు బౌలర్ల దెబ్బకు తొలుత కోల్​కతా  18.5 ఓవర్లలో 128 రన్స్ కే ఆలౌటైంది. ఆండ్రీ  రసెల్ (18 బాల్స్ లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 25),  ఉమేశ్ యాదవ్​ (18) మాత్రమే పోరాడారు. అనంతరం  ఛేజింగ్‌‌లో ఆర్‌‌సీబీ  19.2 ఓవర్లలో 132/7 స్కోర్ చేసి గెలిచింది. టాపార్డర్‌‌ తడబడినా మిడిలార్డర్​లో  రూథర్ ఫర్డ్ (40 బాల్స్ లో 1 ఫోర్, 1 సిక్స్ తో 28), షాబాజ్ అహ్మద్ (20 బాల్స్ లో 3 సిక్సర్లతో 27)  టీమ్‌‌ను ఒడ్డుకు చేర్చారు.  హసరంగకు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది. 

కోల్​కతా ఢమాల్​..

టాస్ కోల్పోయిన కోల్‌‌కతాకు బ్యాటింగ్ లోనూ కలిసి రాలేదు. బెంగళూరు బౌలర్లు హర్షల్ పటేల్, హసరంగ, ఆకాశ్ దీప్.. కేకేఆర్ బ్యాటర్లను హడలెత్తించారు. తొలి ఐదు ఓవర్లలోనే ఓపెనర్లు అజింక్యా రహానె ( 9), వెంకటేశ్ అయ్యర్ (10)ను కోల్పోయిన కేకేఆర్.. జాగ్రత్తగా ఆడాల్సింది పోయి వరుసగా వికెట్లు సమర్పించుకుంది.  కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (13), నితీశ్ రాణా (10) కూడా ఫెయిలయ్యారు. రహానెను సిరాజ్‌‌ ఔట్‌‌ చేయగా.. వెంకటేశ్‌‌,  రాణాను ఆకాశ్‌‌ పెవిలియన్‌‌ చేర్చాడు. శ్రేయస్‌‌.. హసరంగకు వికెట్ ఇచ్చుకోవడంతో కేకేఆర్‌‌ 46/4తో కష్టాల్లో పడ్డది. ఈ దశలో  నరైన్ (12), బిల్లింగ్స్ (14) కాసేపు పోరాడారు. ఎనిమిదో ఓవర్లో ఫోర్, సిక్స్ బాదిన నరైన్ మంచి జోష్ లో కనిపించాడు. కానీ తర్వాతి ఓవర్లోనే హసరంగ వేసిన గూగ్లీకి క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. ఇదే ఓవర్లో మరో గూగ్లీతో షెల్డన్ జాక్సన్ (0) ను డకౌట్ చేసిన హసరంగ ఆర్ సీబీ క్యాంప్ లో జోష్ నింపాడు. దీంతో కేకేఆర్ కనీసం 100 రన్స్ కూడా చేసేలా కనిపించలేదు. బిల్లింగ్స్ తో కలిసిన రసెల్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపాడు. 12వ ఓవర్లో బంతిని అందుకున్న హర్షల్.. కేకేఆర్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. వేసిన మొదటి రెండు ఓవర్లనూ మెయిడిన్ చేసి కీలకమైన బిల్లింగ్స్, రసెల్ వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. చివరి వికెట్ కు ఉమేశ్, వరుణ్ (10).. 27 రన్స్ జోడించడంతో కోల్ కతా ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. 

బెంగళూరు తడబడుతూనే..

చిన్న టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో బెంగళూరు ఆరంభంలోనే తడబడింది. తొలి రెండు ఓవర్లలోనే ఓపెనర్లు అనూజ్ రావజ్ (0), డుప్లెసిస్ (5) పెవిలియన్‌‌ చేరారు. ఇక వచ్చీ రాగానే రెండు ఫోర్లతో టచ్ లో కనిపించిన విరాట్ కోహ్లీ (12)ని ఉమేశ్ యాదవ్​ తన రెండో ఓవర్లో పెవిలియన్ కు పంపడంతో 17/3తో ఆర్ సీబీ ఇబ్బందుల్లో పడింది. తర్వాత వచ్చిన డేవిడ్ విల్లే (18 ), రూథర్ ఫర్డ్ జాగ్రత్తగా ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. కానీ 11వ ఓవర్లో విల్లేను ఔట్ చేసిన నరైన్ మూడో వికెట్‌‌కు 45 రన్స్ పార్ట్ నర్ షిప్ ను బ్రేక్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన షాబాజ్ అహ్మద్ 13వ ఓవర్లో రెండు సిక్స్ లు బాదాడు.  15 ఓవర్లలో 93 రన్స్ చేసిన బెంగళూరు టార్గెట్ కు దగ్గరగా వచ్చినట్లు కనిపించింది. కానీ 16వ ఓవర్లో షాబాజ్ ను ఔట్ చేసిన వరుణ్ ఆర్‌‌సీబీ శిబిరంలో ఆందోళన నింపాడు.18వ ఓవర్లో రూథర్ ఫర్డ్, హసరంగ వికెట్లు తీసి 7 రన్స్ మాత్రమే ఇచ్చిన సౌథీ మ్యాచ్​ను రసవత్తరంగా మార్చాడు. దీంతో బెంగళూరు విక్టరీకి చివరి 12 బాల్స్ లో 17 రన్స్ అవసరమయ్యాయి.  వెంకటేశ్​ అయ్యర్​ వేసిన 19వ ఓవర్లో హర్షల్ పటేల్​ (10 నాటౌట్) రెండు ఫోర్లు బాదడంతో సమీకరణం 6 బాల్స్ లో 7 రన్స్ గా మారింది. ఇక చివరి ఓవర్ మొదటి రెండు బాల్స్ ను దినేశ్ కార్తీక్ (14 నాటౌట్) బౌండ్రీ చేర్చడంతో బెంగళూరు నెగ్గింది.  కేకేఆర్​ బౌలర్లలో సౌథీ మూడు, ఉమేశ్ రెండు వికెట్లు తీశారు. 

సంక్షిప్త స్కోర్లు

కోల్‌‌‌‌‌‌‌‌‌‌కతా: 18.5 ఓవర్లలో 128 ఆలౌట్‌‌‌‌ (రసెల్‌‌‌‌ 25, ఉమేశ్‌‌‌‌ 18, హసరంగ 4/20, ఆకాశ్‌‌‌‌ 3/45); 
బెంగళూరు: 19.2 ఓవర్లలో 132/7 (రూథర్‌‌‌‌ఫర్డ్‌‌‌‌ 28, షాబాజ్‌‌‌‌ 27, సౌథీ 3/20, ఉమేశ్‌‌‌‌ 2/16)