టెన్షన్ లో స్టూడెంట్స్.. ఓవైపు ఎగ్జామ్స్.. మరోవైపు ఐపీఎల్

టెన్షన్ లో స్టూడెంట్స్.. ఓవైపు ఎగ్జామ్స్.. మరోవైపు ఐపీఎల్

హైదరాబాద్​, వెలుగు:  అకాడమిక్ ఫైనల్, ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ సీజన్ కావడంతో స్టూడెంట్స్ పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. ఇప్పుడే ఐపీఎల్ షెడ్యూల్ వచ్చింది. దీంతో క్రికెట్ చూస్తూ టీవీలు ముందు కూర్చొని, మొబైల్ లో చూస్తూ పిల్లలు ఎగ్జామ్స్ ప్రిపరేషన్​పై సరిగా దృష్టి పెట్టరేమోననే టెన్షన్ పేరెంట్స్, టీచర్స్​లో పట్టుకుంది.

ఒకవైపు ఎగ్జామ్స్.. మరోవైపు ఐపీఎల్..

ఇంటర్​ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం టెన్త్​ క్లాస్​పరీక్షలు కొనసాగుతుండగా.. ఏప్రిల్ 2న ముగుస్తాయి. అదే నెల 8న 1 నుంచి 9 క్లాసులకు ఎగ్జామ్స్​ప్రారంభమవుతాయి. ఇవే కాకుండా ఎంసెట్, పీజీ సెట్, పాలి సెట్, డిగ్రీ సెమిస్టర్లు ఎగ్జామ్స్​కూడా జరుగుతాయి. అయితే.. ఈనెల 22 నుంచే ఐపీఎల్ సీజన్ షురూ కానుంది. మొత్తం 74 మ్యాచ్ లకు  ప్రస్తుతం 21కే షెడ్యూల్​ప్రకటించగా.. అవి ఏప్రిల్​7 వరకు జరుగుతాయి. మిగతా మ్యాచ్​ల షెడ్యూల్​త్వరలో రానుంది. ఐపీఎల్ మ్యాచ్ లు చూసేందుకు స్టూడెంట్స్  ఎక్కువ ఆసక్తి చూపుతారు. తద్వారా ఎగ్జామ్స్ ప్రిపరేషన్​కు ఆటంకం ఏర్పడి, రిజల్ట్​పై ప్రభావం చూపుతుందేమోనని భయాందోళన ముఖ్యంగా పేరెంట్స్ లో ఉంది.  

​ఇష్టమైనా.. దూరం పెట్టాలి

మన దేశంలో క్రికెట్​కు చాలా క్రేజ్​ఉంది. ఇక ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చిన్నా, పెద్దా తేడా లేకుండా యూత్, ఫ్యామీలి కూడా ఆసక్తిగా క్రికెట్ మ్యాచ్ లు చూస్తుంటారు. అయితే.. పిల్లలకు ఎన్ని ఇష్టాలున్నా, ఎగ్జామ్స్ టైమ్​లో కొన్ని దూరం పెట్టాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. ఎందుకంటే అకాడమిక్​మార్కులే స్టూడెంట్స్ లైఫ్ ను ప్రభావితం చేస్తాయని అంటున్నారు. ముఖ్యంగా టెన్త్​ క్లాస్​స్టూడెంట్స్​కు ఎగ్జామ్స్​టర్నింగ్​పాయింట్​అని, పరీక్షలు ముగిసేదాకా పిల్లలపై పేరెంట్స్​ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్నారు. క్రికెట్​ఆడేటప్పుడు గెలుపు కోసం ప్లేయర్స్​ఎలా కష్టపడి ఆడతారో.. ఎగ్జామ్స్​ టైమ్ లో కూడా పిల్లలు అలా కష్టపడాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. 

ఏది ఇంపార్టెంట్ అనేది చెప్పాలి

ఎగ్జామ్స్ టైమ్​లో  పిల్లల మైండ్​ డైవర్ట్​కాకుండా దృష్టి పెట్టాలి. టీవీ, మొబైల్ కు దూరంగా ఉంచాలి. ప్రిపరేషన్, నిద్రకు సరైన సమయం కేటాయించేలా చూడాలి. క్రికెట్, సినిమాలు ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్​లు, ఎగ్జామ్స్ లో  ఏది ఇంపార్టెంట్​అనేది పిల్లలకు పేరెంట్స్, టీచర్స్​చెప్పి అవగాహన కల్పించాలి. 
-వంగిపురపు రవికుమార్, వ్యక్తిత్వ వికాస నిపుణులు

గంటపాటు చూసేందుకు.. 

ఐపీఎల్ వస్తుందంటే మా అబ్బాయి టీవీ ముందు నుంచి కదలడు. ఎగ్జామ్స్​టైమ్​లోనే వచ్చింది. పేరెంట్స్​గా అతడిపై ఎక్కువ ప్రెషర్​పెడితే మెంటల్​గా ఇబ్బంది పడతాడు. తప్పదనుకుంటే కొన్నిసార్లు ఓ గంటపాటు మ్యాచ్​చూసేందుకు కండీషన్ పెడతాం.  
-రవీందర్ గౌడ్​, ఖైరతాబాద్