
- నేరుగా ఫైనల్ చేరడంపై ఇరు జట్ల గురి
- రా. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లోలైవ్
ముల్లన్పూర్ (చండీగఢ్): ఈ ఐపీఎల్లో అందరినీ ఆశ్చర్యపరిచిన జట్లు పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. గత పదేండ్లలో ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్ చేరని పంజాబ్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఈసారి అసాధారణంగా ఆడుతూ ఏకంగా టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది.
కొత్త కెప్టెన్ రజత్ పటీదార్ నాయకత్వంలో అన్ని విభాగాల్లో అదరగొడుతూ ప్రత్యర్థి వేదికల్లో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో గెలిచిన ఆర్సీబీ సైతం సమాన విజయాలు, పాయింట్లు సాధించింది. రన్‌రేట్‌లో కొంచెం తేడాతో రెండో ప్లేస్‌తో ప్లేఆఫ్స్ చేరుకుంది.ఈ టాప్2 జట్లూ గురువారం జరిగే క్వాలిఫయర్–1లో అమీతుమీకి రెడీ అయ్యాయి.
ఇందులో ఓడినా ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉండటంతో ఇరు జట్లూ స్వేచ్ఛగా ఆడి తొలి ప్రయత్నంలోనే టైటిల్ ఫైట్‌కు దూసుకెళ్లాలని చూస్తున్నాయి. పంజాబ్ 2014 తర్వాత తొలిసారి ప్లే ఆఫ్స్ మ్యాచ్ బరిలో నిలవడం విశేషం. బలమైన ఆర్సీబీ రూపంలో అయ్యర్ కెప్టెన్సీకి ఈ పోరులో అసలైన పరీక్ష ఎదురవనుంది. ఇంకోవైపు ఆర్సీబీకి ప్లేఆఫ్స్‌కు కొత్తేం కాకపోయినా.. నాకౌట్ రౌండ్లో తడబడటం ఆ జట్టు బలహీనత. ప్రతీ సీజన్ మాదిరిగానే ఈసారైనా కప్పు కొట్టాలని ఆశిస్తున్న ఆర్సీబీకి అసలు సవాల్ ఇప్పుడే మొదలైంది. మరి, సమ ఉజ్జీల సమరంలో ఎవరిది పైచేయి అవుతుందో.. ఫైనల్ బెర్తు ఎవరిది అవుతుందో చూడాలి.
బౌలింగ్‌లోనే కాస్త ఆందోళన: కెప్టెన్ శ్రేయస్
అయ్యర్, హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మార్గనిర్దేశంలో పంజాబ్ అంచనాలను మించి రాణిస్తోంది. గత సీజన్లలో చివరి స్థానానికి పోటీపడే కింగ్స్ రాతను ఈ ఇద్దరు పూర్తిగా మార్చేశారు. ఆరంభం నుంచే పక్కా గేమ్ ప్లాన్, పర్ఫెక్ట్ విన్నింగ్ కాంబినేషన్లతో జట్టుకు విజయాల రుచి చూపించారు. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్, యంగ్ ప్లేయర్ ప్రియాన్ష్ ఆర్య శుభారంభాలు అందిస్తుండగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, జోష్ ఇంగ్లిస్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.
గత మ్యాచ్‌లో వన్‌డౌన్‌కు ప్రమోటైన ఇంగ్లిస్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తనను అదే స్థానంలో కొనసాగించే చాన్సుంది. ఫినిషర్ శశాంక్ సింగ్ రోజు రోజుకూ రాటుదేలుతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా స్టార్ మార్కస్ స్టోయినిస్ కూడా బ్యాట్‌తో రాణించడం పంజాబ్ బ్యాటింగ్‌ను మరింత బలోపేతం చేసింది.
బౌలింగ్‌లో మాత్రం కింగ్స్‌కు కొన్ని ఆందోళనలున్నాయి. ముఖ్యంగా సౌతాఫ్రికా పేసర్ మార్కో యాన్సెన్ ప్లే ఆఫ్స్‌కు దూరం అవ్వడం అతిపెద్ద లోటుగా మారింది. యాన్సెన్ పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో పంజాబ్‌కు కీలక బౌలర్‌గా ఉన్నాడు. తన గైర్హాజరీలో అర్ష్‌దీప్ సింగ్ పై మరింత భారం పడనుంది. ఇంకో పేసర్ కైల్ జేమీసన్ అరంగేట్రం మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. కానీ, కొత్త బాల్‌తో తను మరింత ప్రభావవంతంగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.
బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్.. యాన్సెన్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక వేలి గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరమైన లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ క్వాలిఫయర్–1లో తిరిగి బరిలోకి దిగే అవకాశం ఉంది. తను హర్‌ప్రీత్ బ్రార్‌తో కలిసి స్పిన్ బౌలింగ్‌ను నడిపించనున్నాడు. మిడిల్ ఓవర్లలో ఈ ఇద్దరూ రన్స్ నియంత్రిస్తే పంజాబ్ ఫైనల్‌కు వెళ్లే అవకాశాలు మరింత మెరుగవుతాయి. హోం గ్రౌండ్లో ఆడటం పంజాబ్‌కు అడ్వాంటేజ్ కానుంది.
జోష్‌లో ఆర్సీబీ
స్టార్ ప్లేయర్లతో కూడిన బెంగళూరుకు ఈ సీజన్లో కెప్టెన్ రజత్ పటీదార్, జితేశ్ శర్మ లాంటి యంగ్స్టర్లు నిలకడను తెచ్చిపెట్టారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదింటిలో నెగ్గిన ఆర్సీబీ సత్తా చాటింది. గత పోరులో లక్నో ఇచ్చిన 228 రన్స్ టార్గెట్‌ను ఛేజ్ చేసి క్వాలిఫయర్–1కు చేరుకున్న ఆర్సీబీ ఫుల్ జోష్‌లో ఉంది. తన కెరీర్లో లోటుగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని ఎలాగైనా అందుకోవాలని చూస్తున్న లెజెండరీ విరాట్ కోహ్లీ ఖతర్నాక్ ఫామ్‌లో ఉన్నాడు. 8 ఫిఫ్టీలు కొట్టిన కోహ్లీ (602 రన్స్) టాపార్డర్‌లో ఆర్సీబీకి వెన్నెముకగా నిలిచాడు.
మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ పవర్‌ప్లేలో విధ్వంసకర రీతిలో ఆడటం, లీగ్ దశలో ఇదే వేదికపై పంజాబ్ కింగ్స్ పై నెగ్గడం ఆర్సీబీ కాన్ఫిడెన్స్‌ను పెంచే అంశాలు. గత మ్యాచ్‌లో జితేశ్ అద్భుతంగా ఆడాడు. తను అదే జోరును కొనసాగిస్తే జట్టుకు తిరుగుండదు. పడిక్కల్ స్థానంలో టీమ్‌లోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ కూడా టచ్‌లోకి రావడంతో బ్యాటింగ్ యూనిట్ మరింత బలంగా మారింది. అయితే, బౌలింగ్‌లోనే ఆర్సీబీకి ఇబ్బందులు ఉన్నాయి.
స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌తో పాటు టిమ్ డేవిడ్ ఫిట్నెస్ సాధించి టీమ్ సెలెక్షన్‌కు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. చేతి వేలి గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ రజత్ పటీదార్ గత రెండు మ్యాచ్‌ల్లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు. కీలకమైన క్వాలిఫయర్ పోరులో తను పూర్తి స్థాయిలో ఉంటే మంచిది.
పిచ్/వాతావరణం
ముల్లన్పూర్ వికెట్ బ్యాట్, బాల్‌కు సమతూకంగా ఉంది. ఇక్కడ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో తొలి ఇన్నింగ్స్‌లో ఒక్కసారి మాత్రమే 200 రన్స్ వచ్చాయి. గత నెలలో కేకేఆర్‌పై 111 రన్స్ టార్గెట్‌ను పంజాబ్ కింగ్స్ కాపాడుకుంది. గురువారం రాత్రి వర్ష సూచన లేదు.