
న్యూఢిల్లీ: ఐపీఎల్18వ సీజన్ రీస్టార్ట్ అవుతుండటంతో అభిమానులు ఆనందంగా ఉన్నా.. స్వదేశాలకు వెళ్లిపోయిన ఫారిన్ ప్లేయర్లు తిరిగి వస్తారా? లేదా? అనే విషయం బీసీసీఐ, లీగ్ ఫ్రాంచైజీలను కలవరపెడుతోంది. ఈ నెల 17 నుంచి లీగ్ తిరిగి ప్రారంభం కానుండగా ప్లేయర్లను ఇండియాకు పంపించాలని బీసీసీఐ, ఫ్రాంచైజీలు ఆయా దేశాల క్రికెట్ బోర్డులపై ఒత్తిడి పెంచుతున్నాయి.
క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ), ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) వంటి బోర్డులతో వ్యక్తిగతంగా మాట్లాడి ప్లేయర్లు ఇండియా వచ్చే విషయంలో ఉన్న అనుమానాలను నివృత్తి చేసే పనిని ఐపీఎల్ సీఓఓ హేమంగ్ అమిన్‌కు బీసీసీఐ పెద్దలు అప్పగించారు. అదే సమయంలో ఆయా ఫ్రాంచైజీలు కూడా తమ జట్లకు ఆడుతున్న ఫారిన్ ప్లేయర్లతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో లీగ్ రీస్టార్ట్ అయ్యే నాటికి మెజారిటీ ఫారిన్ ప్లేయర్లు ఇండియాకు తిరిగి వస్తారని బోర్డు ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
బట్లర్ ఓటు ఐపీఎల్‌కా... ఇంగ్లండ్‌కా?
గుజరాత్ టైటాన్స స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ మాత్రం ఐపీఎల్, ఇంగ్లండ్ వన్డే బాధ్యతల మధ్య చిక్కుకున్నాడు. ఈ నెల 29 నుంచి వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో పాల్గొనాల్సిన బట్లర్ మెగా లీగ్ కోసం ఇండియా రావాలా? వద్దా? అనేదానిపై తర్జనభర్జనలో ఉన్నాడు. ఇంగ్లండ్ వన్డే టీమ్‌కు ఎంపికైన జాకబ్ బెథెల్ (ఆర్సీబీ), విల్ జాక్స్ (ముంబై) పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఐపీఎల్ విషయంలో తాము బీసీసీఐకి సహకరిస్తామని చెబుతున్న ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు లీగ్ గడువు పెరగడంతో ప్లేయర్ల ఎన్‌ఓసీలు మళ్లీ సమీక్షించాల్సి ఉంటుందని అంటోంది.
మరోవైపు ఆర్సీబీ స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ గాయంతో మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. కానీ, లియామ్ లివింగ్‌స్టోన్, లుంగి ఎంగిడి, నువాన్ తుషారా తిరిగి జట్టులో చేరే అవకాశం ఉంది. డీసీ ఫారిన్ ప్లేయర్లు డుప్లెసిస్, ట్రిస్టాన్ స్టబ్స్ అందుబాటులోకి రానుండగా జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ ఇండియా వచ్చేందుకు భయపడుతున్నట్టు తెలుస్తోంది. మిచెల్ స్టార్క్ గురించి బుధవారం స్పష్టత రానుంది.
కాగా, చెన్నై సూపర్ కింగ్స్ తమ విదేశీ ఆటగాళ్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, సామ్ కరన్, జెమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, పతిరణాతో సంప్రదింపులు కొనసాగిస్తున్నదని ఆ టీమ్ సీఈవో కాశీ విశ్వనాథన్ చెప్పారు. నూర్, పతిరణ ఓకే చెప్పినా.. న్యూజిలాండ్ ఆటగాళ్ల రాకపై అనిశ్చితి కొనసాగుతోంది. మొత్తంగా, లీగ్ రీస్టార్ట్ అవుతుండగా విదేశీ ఆటగాళ్లు దుబాయ్, మాల్దీవ్స్, సింగపూర్ వంటి ప్రాంతాల నుంచి తిరిగి ఇండియాకు వస్తున్నారు.
విండీస్ ప్లేయర్లు సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్‌తో పాటు కేకేఆర్ తమ పూర్తి బలంతో మిగిలిన సీజన్‌లో బరిలోకి దిగేందుకు రెడీ అవుతోంది. కాగా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ జూన్ 11 నుంచి లార్డ్స్‌లో జరగనుంది. దీంతో ఐపీఎల్ ప్లే- ఆప్స్‌కు ఇరు దేశాల ఆటగాళ్లు అందుబాటులో ఉంటారో లేదో చెప్పలేని పరిస్థితి ఉంది.
కమిన్స్, హెడ్ ఓకే.. స్టోయినిస్, ఇంగ్లిస్ నో
ఐపీఎల్‌లో ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్లలో చాలా మంది తిరిగి వచ్చేందుకు సుముఖంగా ఉండగా ఒకరిద్దరు మాత్రం వెనకడుగు వేస్తున్నారు. పంజాబ్ కింగ్స్‌కు ఆడుతున్న ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్ తిరిగి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఆ టీమ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఈ ఇద్దరినీ కన్విన్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. కింగ్స్ టీమ్‌లోని ఆసీస్ ప్లేయర్లు జేవిర్ బార్ట్‌లెట్, ఆరోన్ హార్డీ, అఫ్గాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్‌జాయ్, సౌతాఫ్రికన్ మార్కో యాన్సెన్ తిరిగి జట్టులో చేరనున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్, ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా మిగిలిన మ్యాచ్‌లు ఆడనున్నారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు కగిసో రబాడ, గెరాల్డ్ కోట్జీ అందుబాటులో ఉంటారని తెలుస్తోంది.