ఐపీఎల్‌‌ రీస్టార్ట్‌‌.. జూన్ 3న మెగా ఫైనల్‌‌.. హైదరాబాద్‌‌కు నో చాన్స్‌‌

ఐపీఎల్‌‌ రీస్టార్ట్‌‌.. జూన్ 3న  మెగా ఫైనల్‌‌.. హైదరాబాద్‌‌కు నో చాన్స్‌‌
  • కొత్త షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ
  • 6 వేదికల్లో మిగిలిన 17 మ్యాచ్‌‌లు

న్యూఢిల్లీ: ఇండియా–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా నిలిపిపోయిన ఐపీఎల్‌‌18వ సీజన్‌‌ను ఈ నెల 17వ తేదీ నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.  జూన్‌‌ 3న ఫైనల్‌‌ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు పంజాబ్‌‌ కింగ్స్‌‌–ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య అర్ధంతరంగా ఆగిన పోరు సహా 17 మ్యాచ్‌‌ల కొత్త షెడ్యూల్‌‌ను సోమవారం ప్రకటించింది.  బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్​లో మిగిలిన మ్యాచ్‌‌లు జరుగుతాయని, ప్లే ఆఫ్స్ వేదికలను తర్వాత ఖరారు చేస్తామని వెల్లడించింది. శనివారం బెంగళూరులో ఆర్సీబీ–కేకేఆర్ మధ్య మ్యాచ్‌‌తో టోర్నీ రీస్టార్ట్ అవ్వనుంది. 

మిగిలిన మ్యాచ్‌‌ల్లో  రాబోయే రెండు ఆదివారాల్లో రెండు డబుల్-హెడర్ మ్యాచ్‌‌లు ఉంటాయని బోర్డు తెలిపింది. ఈనెల 29న  క్వాలిఫయర్1, 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫయర్ 2 ఉంటాయని పేర్కొంది. ఉద్రిక్తతల కారణంగా ఈ నెల 9న ఆగిపోయిన లీగ్‌‌లోని మిగతా మ్యాచ్‌‌లను సౌతిండియాకు చెందిన హైదరాబాద్‌‌, బెంగళూరు, చెన్నై వేదికలుగా నిర్వహిస్తారని తొలుత వార్తలు వచ్చినా.. హైదరాబాద్, చెన్నైని బీసీసీఐ పక్కనబెట్టింది బెంగళూరుతో పాటు జైపూర్, ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్‌‌, ముంబైని వేదికలుగా ఎంచుకుంది. దాంతో హైదరాబాద్‌‌ ఓ లీగ్‌‌తో పాటు ఒరిజినల్‌‌ షెడ్యూల్‌‌లో  కేటాయించిన  క్వాలిఫయర్‌‌‌‌1, ఎలిమినేటర్‌‌‌‌ మ్యాచ్‌లను కోల్పోనుంది.