దేశంలో ఎండలు ముదురుతున్నాయి. మధ్యాహ్నం అయితే ఉక్కబోత, చికాకుతో జనం ఇబ్బందిపతున్నారు. సగటు మనిషికి ఇది ఇబ్బంది పెట్టే ఎండాకాలం కావొచ్చు కానీ, క్రికెట్ అభిమానికి మాత్రం ఇది అసలైన పండగ కాలం! సాయంత్రం సూర్యుడు అస్తమించడమే ఆలస్యం.. మైదానాల్లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించేందుకు క్రికెట్ స్టార్లు రెడీ అయ్యారు. 18 ఏండ్లుగా ఫ్యాన్స్ అందరికీ క్రికెట్‌లోని అసలైన కిక్ ఇస్తున్న ఐపీఎల్.. ఇప్పుడు 19వ సీజన్‌తో మళ్ళీ మన ముందుకు వస్తోంది. నేడే మెగా లీగ్ ఆరంభం. 10 జట్లు.. 13 సిటీలు.. 65 రోజులు.. 74 మ్యాచ్‌లతో దేశంలో ఇక క్రికెట్ జాతరే.! గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఇంటా ఐపీఎల్ నామస్మరణే!
బెంగళూరు: కొత్త ఆశలు, పాత వైభవం కోసం ఆరాటం, దిగ్గజాల పోరాటం.. ప్రతిభ నిరూపించుకోవాలని కుర్రాళ్ల ఉబలాటం మధ్యన ఐపీఎల్ 19వ ఎడిషన్‌కు సమయం ఆసన్నమైంది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాంలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే తొలి పోరుతో ఈ సమ్మర్ క్రికెట్ కార్నివాల్ ప్రారంభం కానుంది. గతేడాది తొలి ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా.. మరోవైపు యంగ్‌స్టర్ ఇషాన్ కిషన్ కెప్టెన్సీలోని సన్‌రైజర్స్ సత్తా చాటాలని చూస్తోంది. తొలి పోరులో గెలిచి ట్రోఫీ వేటను షురూ చేయాలని ఇరు జట్లూ భావిస్తుండగా.. కొత్త సీజన్‌లో తమదైన మార్కు చూపెట్టాలని మిగిలిన 8 టీమ్స్
ఆశిస్తున్నాయి.
ఇద్దరికీ బౌలింగ్ టెన్షన్
తొలి మ్యాచ్‌లో తలపడే ఆర్సీబీ, సన్‌రైజర్స్ రెండు జట్లనూ బౌలింగ్ సమస్యలు వేధిస్తున్నాయి. ఆర్సీబీ టీమ్ మెయిన్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతను టోర్నీ మధ్యలో వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల కారణంగా లెఫ్టార్మ్ సీమర్ యశ్ దయాల్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్, క్రునాల్ పాండ్యా, సుయాష్ శర్మ, మంగేష్ యాదవ్‌పైనే భారమంతా పడనుంది. మరోవైపు హైదరాబాద్ జట్టుకు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తొలి దశ మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. దీంతో ఇషాన్ కిషన్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. జైదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్, హర్ష్ దూబే వంటి బౌలర్లు ఉన్నా.. చిన్నస్వామి వంటి ఫ్లాట్ పిచ్‌లపై ఏ మేరకు రాణిస్తారో చూడాలి. అయితే ఈ రెండు జట్లూ తమ బ్యాటింగ్ బలంతో ఈ లోటును పూడ్చుకోవాలని చూస్తున్నాయి. విరాట్ కోహ్లీ, టిమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్, జాకబ్ బెథెల్, రజత్ పాటిదార్‌తో ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంటే.. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, లివింగ్‌స్టోన్‌తో సన్‌రైజర్స్ ధీటుగా బదులిచ్చేందుకు సిద్ధమైంది. ఈ పోరులో ఇరు జట్ల బ్యాటర్లు, హిట్టర్ల మధ్య పోటీ ఆసక్తి రేకెత్తిస్తోంది.
మేటి జట్లు మళ్లీ మెప్పిస్తాయా?
18 సీజన్లలో 13 టైటిళ్లు గెలిచిన ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ (చెరో ఐదు), కోల్‌కతా నైట్ రైడర్స్ (మూడు) గత సీజన్‌లో నిరాశపరిచాయి. ఈసారి ఆ తప్పులను సరిదిద్దుకుని మళ్ళీ ట్రోఫీని ముద్దాడాలని మూడు జట్లూ పట్టుదలతో ఉన్నాయి. రాజస్తాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవడం సీఎస్కేలో ఈసారి అతిపెద్ద మార్పు. మాట్ హెన్రీ, అకీల్ హుసేన్, స్పెన్సర్ జాన్సన్ వంటి బౌలర్ల చేరికతో జట్టు సమతుల్యంగా ఉంది. 2024లో ట్రోఫీ నెగ్గిన తర్వాత గతేడాది చెత్తగా ఆడిన కేకేఆర్ ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను రికార్డు ధరతో తమ జట్టులో చేర్చుకుంది. తనపై భారీ అంచనాలున్నాయి. విండీస్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ రిటైర్మెంట్ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే బాధ్యత రింకూ సింగ్ పై పడింది. అజింక్యా రహానె సారథ్యంలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ స్పిన్ ద్వయం మ్యాజిక్ చేయాలని కోరుకుంటోంది. ఇక టీమిండియా సూపర్ స్టార్లతో కూడిన ముంబై ఆరో టైటిల్ వేటలో ఉంది. గత సీజన్‌లో ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళిన ఆ జట్టు, ఈసారి చాంపియన్‌గా నిలవడమే టార్గెట్‌గా పెట్టుకుంది. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ రెండో టైటిల్ నెగ్గాలని ఆశిస్తుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి ట్రోఫీ ప్రయత్నాలను ఈ సీజన్‌లోనూ
కొనసాగిస్తున్నాయి.
రోకోపై ఫోకస్.. ధోనీకి లాస్ట్ సీజన్!
మెగా లీగ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ధోనీపై ఫోకస్ ఉంది. గతేడాది ఆర్సీబీ తొలి టైటిల్ అందుకోవడంతో తన కల నెరవేర్చుకున్న కోహ్లీ ఈసారి మరింత స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. న్యూజిలాండ్ సిరీస్ తర్వాత రెస్ట్ తీసుకున్న విరాట్ ఈ సీజన్‌లో తన బ్యాట్ పవర్ చూపెట్టేందుకు రెడీ అయ్యాడు. ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ ఈసారి ఫిట్‌నెస్‌పై గట్టిగా దృష్టి పెట్టాడు. బరువు తగ్గి చాలా స్లిమ్‌గా కనిపిస్తున్నాడు. ముంబైకి ఆరో టైటిల్ అందించడంతో పాటు బ్యాటర్‌గా ఐపీఎల్‌లో తన రికార్డును మరింత మెరుగుపరుచుకోవాలని చూస్తున్నాడు. ఇక, సీఎస్కే లెజెండ్ 44 ఏండ్ల ఎంఎస్ ధోనీకి ఇదే లాస్ట్ సీజన్ అయ్యే చాన్సుంది. చెన్నైకి ఆరో టైటిల్ అందించి ఆటకు ఘనమైన వీడ్కోలు పలకాలని మహీ చూస్తున్నాడు.
కుర్రాళ్ల గురి.. సెలెక్టర్ల దృష్టి
ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా కొందరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు మెగా లీగ్‌లో సత్తా చాటి నేషనల్ టీమ్‌లోకి రావాలని ఆశిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఆకిబ్ నబీ, రాజస్తాన్ ప్లేయర్ కార్తీక్ శర్మ, సీఎస్కే జట్టులోని ప్రశాంత్ వీర్ వంటి యువ ఆటగాళ్లు సెలక్టర్ల దృష్టిలో పడేందుకు ఇదే సరైన వేదిక అని భావిస్తున్నారు.
ఆ నలుగురు.. అన్ని సీజన్లూ
ఐపీఎల్ మొదలైన 2008 నుంచి ప్రతీ సీజన్ ఆడిన ప్లేయర్లుగా ధోనీ, కోహ్లీ, రోహిత్, మనీష్ పాండే రికార్డు సృష్టించనున్నారు. వీళ్లలో కోహ్లీ అన్ని సీజన్లూ ఆర్సీబీ ప్లేయర్‌గానే
ఉండటం విశేషం.
వేడుకలు లేకుండా.. ఆరంభం కొంచెం భిన్నంగా..
డిఫెండింగ్ చాంపియన్ టీమ్ తమ సొంత గడ్డపై కొత్త సీజన్‌ను ఆరంభిస్తుందంటే ఆ జట్టు ఆటగాళ్లతో పాటు అభిమానుల్లో ఫుల్ జోష్ సహజం. కానీ, ఈసారి ఆర్సీబీ పరిస్థితి అందుకు కొంచెం భిన్నం. ఆ టీమ్ క్యాంప్‌లో ఒక రకమైన నిశ్శబ్దం కనిపిస్తోంది. గతేడాది జూన్ 4న ఆర్సీబీ ట్రోఫీ విన్నింగ్ సెలబ్రేషన్స్ సమయంలో స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోవడమే ఇందుకు కారణం. ఆ అభిమానుల జ్ఞాపకార్థం స్టేడియంలో 11 సీట్లను శాశ్వతంగా ఖాళీగా ఉంచాలని కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) నిర్ణయించింది. ఆర్సీబీ ప్లేయర్లు ప్రాక్టీస్ సెషన్‌లో తమ జెర్సీల వెనుక 11 నంబర్ ధరించి ఆ మృతులకు నివాళి అర్పించాలని నిర్ణయించారు. అదే సమయంలో చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించడం లేదని బీసీసీఐ ప్రకటించింది.
