ఐపీఎల్​ షెడ్యూల్​ నేడే

ఐపీఎల్​ షెడ్యూల్​ నేడే

వెల్లడించిన బీసీసీఐ బాస్​ సౌరవ్​ గంగూలీ

న్యూఢిల్లీ: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్​–13 షెడ్యూల్ నేడు రిలీజ్​ కానుంది. ఈ మేరకు బీసీసీఐ ప్రెసిడెంట్​ సౌరవ్​  గంగూలీ గురువారం వెల్లడించాడు. ‘షెడ్యూల్ ఇప్పటికే లేట్​ అయ్యిందనుకుంటున్నాం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఫైనల్ షేప్​కు తీసుకొచ్చాం. శుక్రవారం దుబాయ్​లో బ్రిజేశ్​ పటేల్ షెడ్యూల్‌‌‌‌ను రిలీజ్​ చేస్తారు’ అని దాదా  తెలిపాడు.  సెప్టెంబర్​ 19 నుంచి ఐపీఎల్​ జరుగుతుందని రెండు నెలల కిందటే ప్రకటించినా.. ఫైనల్​ షెడ్యూల్​ను వెల్లడించకపోవడంతో అందరిలో ఆశ్చర్యం నెలకొంది. ట్రావెలింగ్​, బయో బబుల్​ సెక్యూరిటీ, ఇతరత్రా అంశాలపై తీరిక లేకుండా గడిపిన బీసీసీఐ అధికారులు షెడ్యూల్​కు కూడా తుది రూపు ఇచ్చినట్లు తెలుస్తున్నది. అయితే పూర్తి షెడ్యూల్​ను రిలీజ్​ చేస్తారా? లేక పార్ట్స్​గా వస్తుందా? అన్న దానిపై క్లారిటీ లేదు. ఇక బ్లాక్​బాస్టర్​ ఫస్ట్  మ్యాచ్ చెన్నై సూపర్​కింగ్స్​(సీఎస్​కే), ముంబై ఇండియన్స్​ మధ్యనే జరిగే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్​తోనే లీగ్‌‌‌‌కు  ఫుల్ హైప్​ తీసుకురావాలని ఐపీఎల్​ పాలకులు టార్గెట్‌‌‌‌గా​ పెట్టుకున్నారు.

నో సెల్ఫ్​ ఐసోలేషన్​

క్వారంటైన్​ నుంచి అన్ని ఫ్రాంచైజీలకు విముక్తి కల్పించిన బీసీసీఐ.. సెల్ఫ్‌‌‌‌ ఐసోలేషన్​ను కూడా పక్కనబెట్టింది. అంటే దుబాయ్​, అబుదాబి, షార్జా మధ్య మ్యాచ్​ల కోసం తిరిగే ప్లేయర్లు సెల్ఫ్​ ఐసోలేషన్​లో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐపీఎల్​తో అసోసియేట్ అయ్యే ప్రతి ఒక్కరు బయో బబుల్​లోనే ఉండటంతో పాటు స్ట్రిక్ట్​ ప్రొటోకాల్స్​ను పాటిస్తారు. కాబట్టి మళ్లీ ప్రత్యేకంగా ఐసోలేషన్ అవసరం లేదని నిర్ణయించారు.

సీఎస్​కే ప్రాక్టీస్​కు రెడీ !

మాండేటరి క్వారంటైన్​ పిరియడ్​ ముగియడంతో.. శుక్రవారం నుంచి సీఎస్​కే ట్రెయినింగ్​ మొదలుపెట్టే చాన్స్​ ఉంది. 13 మంది పాజిటివ్స్​ మినహా మిగతా వారికి చేసిన ఫస్ట్​ టెస్ట్​లో నెగెటివ్​ గా వచ్చింది. ఇక గురువారం నిర్వహించిన రెండో టెస్ట్​లోనూ నెగెటివ్​ వస్తే ట్రెయినింగ్​కు లైన్​ క్లియరైనట్టే.

ఎన్సీఏలో ఇద్దరికి కరోనా

బెంగళూరు: కరోనా వైరస్​ క్రికెట్​ను గట్టిగానే పట్టుకున్నట్లుగా ఉంది. ఇప్పటికే బీసీసీఐ మెడికల్​ టీమ్​ మెంబర్​ వైరస్​ బారిన పడగా, తాజాగా నేషనల్​ క్రికెట్​ అకాడమీ (ఎన్​సీఏ)లో ఇద్దరికి పాజిటివ్​గా తేలింది. ‘బీసీసీఐ మెంబర్స్​కు కూడా కరోనా సోకింది. కాకపోతే లక్షణాలు పెద్దగా లేవు. వాళ్లు యూఏఈ వెళ్లే క్రమంలో ఎవరితో కాంటాక్ట్​ కాలేదు. ఇక ఎన్​సీఏ మెంబర్స్​కు కూడా సింప్టమ్స్​ లేవు. వీళ్లను ఐసోలేషన్​లో ఉంచారు’ అని ఐపీఎల్​ వర్గాలు వెల్లడించాయి.