IPL ఆధారంగా జట్టు ఎంపిక ఉండదు: కోహ్లీ

IPL ఆధారంగా జట్టు ఎంపిక ఉండదు: కోహ్లీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2019 సీజన్ ఆధారంగా వరల్డ్‌కప్‌లో ఆటగాళ్ల ఎంపిక ఉండదన్నారు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. IPL లో ప్రదర్శనను  లెక్కలోకి తీసుకుని వరల్డ్‌కప్‌కు ఎంపిక చేస్తే జట్టులో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయన్నాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా రేపు(శనివారం) ఉప్పల్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మొదటి వన్డే జరగనుంది.

దీనికి సంబంధించి మీడియా సమావేశంలో మాట్లాడిన కోహ్లీ… వరల్డ్‌కప్‌కు వెళ్లే జట్టుపై ఇప్పటికే స్పష్టత వచ్చిందన్నాడు. ఒకవేళ తమ దృష్టిలో ఉన్న ఆటగాళ్లు IPL లో రాణించకపోతే వారు వరల్డ్‌కప్‌కు అనర్హులుగా అనుకోవడం కూడా పొరపాటే అవుతుందన్నాడు.

వరల్డ్‌కప్‌కు కచ్చితమైన జట్టుతో వెళ్తామనడంలో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశాడు. ఇక్కడ బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్ని సమంగానే పరిశీలిస్తాం… ఒక అదనపు బ్యాట్స్‌మన్‌ కోసం బౌలర్‌ను తగ్గించే ఆలోచన లేదని.. ఒకవేళ అలా చేస్తే అది కచ్చితంగా మంచి గేమ్‌ ప్లాన్‌ కాదన్నాడు. ప్రధానంగా బ్యాటింగ్‌ కాంబినేషన్స్‌ పైనే దృష్టి సారించామని తెలిపాడు కోహ్లీ.

ఇప్పటికే భారత బౌలింగ్‌ విభాగంలో స్సష్టత వచ్చిందని… ఎలాంటి మార్పులు కోరుకోవడం లేదన్నాడు కోహ్లీ. మరోవైపు వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేయబోయే జట్టులో ఐపీఎల్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను ఏ మాత్రం ప్రామాణికంగా తీసుకోబోమని ఇప్పటికే టీమిండియా ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు.