రఫ్ఫాడించిన రాహుల్..ఆర్సీబీపై గ్రాండ్ విక్టరీ

రఫ్ఫాడించిన రాహుల్..ఆర్సీబీపై గ్రాండ్ విక్టరీ

ఆల్‌‌రౌండ్‌‌ షోతో అదరగొట్టిన పంజాబ్‌‌.. బెంగళూరుపై పంజా విసిరింది..! కెప్టెన్‌‌ కేఎల్‌‌ రాహుల్‌‌ (57 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 97 నాటౌట్‌‌) రఫ్ఫాడిస్తే.. క్రిస్‌‌ గేల్‌‌ (24 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 46) దంచికొట్టిన వేళ.. స్పిన్నర్‌‌ హర్‌‌ప్రీత్‌‌ బ్రార్‌‌ (3/19) బాల్‌‌తో మ్యాజిక్‌‌ చేశాడు..! ఫలితంగా వరుస విజయాలతో జోరుమీదున్న ఆర్‌‌సీబీని అద్భుతంగా కట్టడి చేసిన పంజాబ్‌‌ మూడో విక్టరీతో మురిసిపోయింది..! భారీ టార్గెట్‌‌ ఛేదించే క్రమంలో విరాట్‌‌ కోహ్లీ (34 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 35) కాసేపు పోరాడినా మిగతా స్టార్లు ఫెయిలవడంతో బెంగళూరుకు రెండో ఓటమి తప్పలేదు!

అహ్మదాబాద్‌‌: ఐపీఎల్‌‌–14లో పడుతూ లేస్తున్న పంజాబ్‌‌ కింగ్స్‌‌.. మళ్లీ గాడిలో పడింది. సూపర్‌‌ బ్యాటింగ్‌‌తో భారీ స్కోరు సాధించి.. బలమైన బెంగళూరుకు ఈజీగా చెక్‌‌ పెట్టింది. ఫలితంగా శుక్రవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో పంజాబ్‌‌ 34 రన్స్‌‌ తేడాతో రాయల్‌‌ చాలెంజర్స్‌‌పై గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌‌ చేసిన పంజాబ్‌‌ 20 ఓవర్లలో 179/5 స్కోరు చేసింది. తర్వాత బెంగళూరు 20 ఓవర్లలో 145/8 స్కోరుకే పరిమితమైంది. స్టార్టింగ్‌‌లో కోహ్లీ, రజత్‌‌ పాటిదార్‌‌ (30 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 31), చివర్లో హర్షల్‌‌ పటేల్‌‌ (13 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31) కాసేపు ప్రతిఘటించాడు. హర్‌‌ప్రీత్‌‌ బ్రార్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ లభించింది. 

రాహుల్‌‌, గేల్‌‌ జోరు...

టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన పంజాబ్‌‌కు ఆరంభంలోఎదురుదెబ్బ తగిలినా.. రాహుల్‌‌, గేల్‌‌ కీలక భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఫోర్త్‌‌ ఓవర్‌‌లో ఓపెనర్‌‌ ప్రభ్​సిమ్రన్‌‌ సింగ్‌‌ (7)   వెనుదిరిగినా.. సిరాజ్‌‌ బౌలింగ్‌‌లో సూపర్‌‌ సిక్సర్‌‌, ఫోర్‌‌తో టచ్‌‌లోకి వచ్చిన రాహుల్‌‌ క్లాసిక్‌‌ ఇన్నింగ్స్‌‌తో రెచ్చిపోయాడు. సహచరులు విఫలమైనా.. ఇన్నింగ్స్‌‌ చివరి వరకు క్రీజులో ఉండి కీలక పార్ట్‌‌నర్‌‌షిప్స్‌‌తో మంచి స్కోరు అందించాడు. 19/1 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన గేల్‌‌.. జెమీసన్‌‌ వేసిన ఆరో ఓవర్‌‌లో వరుసగా నాలుగు, లాస్ట్‌‌ బాల్‌‌కు మరో ఫోర్‌‌తో 20 రన్స్‌‌ రాబట్టాడు. చహల్‌‌ (7వ ఓవర్‌‌) బౌలింగ్‌‌లో రెండు భారీ సిక్సర్లు బాదేశాడు. అప్పటికే ఫోర్లతో దూకుడు మీదున్న రాహుల్‌‌ కూడా చహల్‌‌ (9వ ఓవర్‌‌)ను ఫోర్‌‌, సిక్స్‌‌తో ఉతికేశాడు. దీంతో పవర్‌‌ప్లేలో 49/1 స్కోరు చేసిన పంజాబ్‌‌.. తొలి 10 ఓవర్లలో 90/1 స్కోరుకు పెరిగింది. ఏమాత్రం దూకుడు తగ్గించని కరీబియన్‌‌.. 11వ ఓవర్‌‌ (సామ్స్‌‌)లో లాఫ్టెడ్‌‌ షాట్‌‌తో సిక్సర్‌‌ కొట్టి.. నాలుగో బాల్‌‌కు ఔటయ్యాడు. ఫలితంగా సెకండ్‌‌ వికెట్‌‌కు 80 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. అయితే 99/2తో మంచి స్థితిలో ఉన్న పంజాబ్‌‌.. చేజేతులా బెంగళూరును పుంజుకునేలా చేసింది. పూరన్‌‌ (0), దీపక్‌‌ హుడా (5), భారీ హిట్టర్‌‌ షారుక్‌‌ ఖాన్‌‌ (0) వైఫల్యం.. టీమ్‌‌ స్కోరును దెబ్బతీసింది. మధ్యలో రాహుల్‌‌ 35 బాల్స్‌‌లో ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేసుకున్నా.. ఈ ముగ్గురు వరుస విరామాల్లో ఔట్‌‌కావడం, నాలుగు ఓవర్లలో 19 రన్సే రావడంతో పంజాబ్‌‌ 118/5తో కష్టాల్లో పడింది. ఈ టైమ్‌‌లో భారీ హిట్టింగ్‌‌ చేయాల్సిన రాహుల్‌‌, హర్‌‌ప్రీత్‌‌ బ్రార్‌‌ (25 నాటౌట్‌‌)ను ఆర్‌‌సీబీ బౌలర్లు కట్టడి చేశారు. 16, 17 ఓవర్లలో కేవలం 13 రన్స్‌‌ మాత్రమే వచ్చాయి. అయితే 18వ ఓవర్‌‌లో హర్‌‌ప్రీత్‌‌ ధైర్యం చేసి 4, 6, రాహుల్‌‌ ఫోర్‌‌ కొట్టడంతో 18 రన్స్‌‌ వచ్చాయి. తర్వాతి ఓవర్‌‌లో ఒక్క ఫోర్‌‌తోనే సరిపెట్టుకున్నా, లాస్ట్‌‌ ఓవర్‌‌లో రాహుల్‌‌ 4, 6, 4, హర్‌‌ప్రీత్‌‌ సిక్సర్‌‌తో 22 రన్స్‌‌ రావడంతో పంజాబ్‌‌ మంచి టార్గెట్‌‌ నిర్దేశించింది. 

హర్‌‌ప్రీత్‌‌ తీన్మార్‌‌..

టార్గెట్‌‌ ఛేజింగ్‌‌ను బెంగళూరు నెమ్మదిగా మొదలుపెట్టింది. ఫస్ట్‌‌ రెండు ఓవర్లలో రెండు ఫోర్లు కొట్టి కోహ్లీ టచ్‌‌లోకి రాగా, థర్డ్‌‌ ఓవర్‌‌లో మెరిడిత్‌‌ బాల్‌‌ను పడిక్కల్‌‌ (7) స్టాండ్స్‌‌లోకి పంపాడు. కానీ మూడో బాల్‌‌కు వికెట్‌‌ ఇచ్చుకోవడంతో ఆర్‌‌సీబీ 19 వద్దే ఫస్ట్‌‌ వికెట్‌‌ చేజార్చుకుంది. రజత్‌‌ పాటిదార్‌‌  సింగిల్స్‌‌కే మొగ్గు చూపడంతో పవర్‌‌ప్లేలో బెంగళూరు 36/1 స్కోరు మాత్రమే చేసింది. అయితే ఏడో ఓవర్‌‌ ఫస్ట్‌‌ బాల్‌‌ను సిక్సర్‌‌గా మలిచిన విరాట్‌‌ జోరు పెంచే ప్రయత్నం చేసినా.. పంజాబ్‌‌ బౌలర్లు బాగా కట్టడి చేశారు. భారీ షాట్లకు పోనివ్వకుండా కట్టుదిట్టమైన బాల్స్‌‌ వేయడంతో కోహ్లీ, రజత్​ సింగిల్స్‌‌కే పరిమితమయ్యారు. ఫలితంగా తర్వాతి నాలుగు ఓవర్లలో 26 రన్సే రావడంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో ఆర్‌‌సీబీ 62/1 స్కోరు చేసింది. ఈ దశలో స్పిన్నర్‌‌ హర్‌‌ప్రీత్‌‌ సంచలనం చేశాడు. 11వ ఓవర్‌‌లో వరుస బాల్స్‌‌లో కోహ్లీ, మ్యాక్స్‌‌వెల్‌‌ (0)ను, ఆ తర్వాతి ఓవర్‌‌లో ఏబీ డివిలియర్స్‌‌ (3)ను ఔట్‌‌ చేసి మ్యాచ్‌‌ను పూర్తిగా పంజాబ్‌‌ వైపు టర్న్‌‌ చేశాడు. టాస్‌‌ బాల్‌‌ను ముందుకొచ్చి ఆడిన కోహ్లీ క్లీన్‌‌ బౌల్డ్‌‌ కాగా, తర్వాతి బాల్‌‌ను డిఫెన్స్‌‌ చేయబోయి మ్యాక్సీ లైన్‌‌ మిస్సయ్యాడు. షార్ట్‌‌ లెంగ్త్‌‌ బాల్‌‌ను పుష్‌‌ చేసిన ఏబీ.. ఎక్స్‌‌ట్రా కవర్స్‌‌లో రాహుల్‌‌ చేతికి చిక్కాడు. 7 రన్స్‌‌ తేడాతో మూడు కీలక వికెట్లు పడటంతో ఆర్‌‌సీబీ డీలా పడింది. కోహ్లీతో సెకండ్‌‌ వికెట్‌‌కు 43 రన్స్‌‌ జోడించిన రజత్​.. 14వ ఓవర్‌‌లో 4, 6తో రెచ్చిపోయాడు. కానీ తర్వాతి ఓవర్‌‌లోనే జోర్డాన్‌‌కు వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. ఈ దశలో రవి బిష్ణోయ్‌‌ (2/17) మ్యాజిక్‌‌ చేశాడు. 16వ ఓవర్‌‌లో వరుస బాల్స్‌‌లో షాబాజ్‌‌ (8), సామ్స్‌‌ (3)ను ఔట్‌‌ చేసి షాకిచ్చాడు. ఇక గెలవాలంటే 24 బాల్స్‌‌లో 84 రన్స్‌‌ చేయాల్సిన దశలో హర్షల్‌‌ పటేల్‌‌ 6, 4, 4, 4, 6 బాదాడు. లాస్ట్‌‌ ఓవర్‌‌లో జెమీసన్‌‌ (16 నాటౌట్‌‌).. సిక్స్‌‌ కొడితే, పటేల్‌‌ ఫోర్‌‌ కొట్టాడు. ఈ ఇద్దరి పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది.