వచ్చే వారం 11 ఐపీఓలు.. 12న ఐసీఐసీఐ ఏఎంసీ ఇష్యూ, 10న నెఫ్రో ప్లస్ పబ్లిక్ ఇష్యూ

వచ్చే వారం 11 ఐపీఓలు.. 12న ఐసీఐసీఐ ఏఎంసీ ఇష్యూ, 10న నెఫ్రో ప్లస్ పబ్లిక్ ఇష్యూ

ముంబై: స్టాక్​మార్కెట్లు వచ్చే వారం సందడిగా కనిపించనున్నాయి. మెయిన్​బోర్డ్, ఎస్​ఎంఈ విభాగాలలో 11 ఐపీఓలు రానున్నాయి. డిసెంబర్ 8 నుంచి 17 మధ్య ఈ ఇష్యూల ద్వారా సుమారు రూ.13,807 కోట్లు సమీకరించనున్నాయి. వీటిలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఐపీఓ 12–16 తేదీల్లో ఉంటుంది. ఇష్యూ ద్వారా రూ.10 వేల కోట్లు సేకరించనుంది.  డిసెంబర్ 8న రెండు మెయిన్​బోర్డ్ ఆఫరింగ్స్ ప్రారంభమవుతాయి. కరోనా రెమెడీస్ ఫార్మా కంపెనీ రూ.655 కోట్ల ఆఫర్ ఫర్ సేల్​ను రూ.1,008–1,062 ధర వద్ద అందిస్తోంది. దేశీయంగా బలమైన అమ్మకాలు, వృద్ధి, లాభదాయకత దీనికి ఉన్నాయి. 

అదే రోజున ఫర్నిచర్ హోమ్ సొల్యూషన్స్ బ్రాండ్ వేక్​ఫిట్ ఇన్నోవేషన్స్ రూ.1,289 కోట్ల ఐపీఓను రూ.185–195 ధర వద్ద మొదలుపెడుతుంది.  డాక్యుమెంట్ మేనేజ్​మెంట్​ సంస్థ ప్రొడాక్స్ సొల్యూషన్స్ కూడా రూ.27.6 కోట్ల చిన్న ఐపీఓను డిసెంబర్ 8న ప్రారంభిస్తుంది. డిసెంబర్ 10న నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్, పార్క్ మెడి వరల్డ్, యూనిసెమ్​ అగ్రిటెక్ తమ ఇష్యూలను ప్రారంభిస్తాయి. 

డయాలసిస్ సేవలు అందించే హైదరాబాద్​కంపెనీ నెఫ్రోకేర్ రూ.871 కోట్లు (ప్రైస్​బ్యాండ్​ రూ.438–460) సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.  హాస్పిటల్​చైన్ పార్క్ మెడి వరల్డ్ రూ.920 కోట్లు సమీకరించనుంది.  వ్యవసాయ పరిష్కారాల సంస్థ యూనిసెమ్​ అగ్రిటెక్ రూ.21.45 కోట్లను సేకరించనుంది. ఎస్​ఎంఈ ఐపీఓలు ఈ వారంలో రూ.208 కోట్లు రాబట్టనున్నాయి.