వచ్చేవారం 2 ఐపీఓలు

వచ్చేవారం 2 ఐపీఓలు

ముంబై: రెండు కంపెనీలు వచ్చేవారం ఇన్వెస్టర్ల ముందుకు  వస్తున్నాయి. ఐపీఓ ద్వారా దాదాపు రూ. 1,000 కోట్లను సేకరించాలని చూస్తున్నాయి. ఇంత భారీగా ఐపీఓలు రావడం ఈ ఏడాది మే తరువాత ఇదే మొదటిసారి. ఈ నెలలో చివరిసారిగా ధర్మజ్ క్రాప్ గార్డ్,  యూనిపార్ట్స్ ఇండియా ఐపీఓ మొదలయింది. ఈ నెలలో ఇప్పటికే ఎనిమిది కంపెనీలు పబ్లిక్​ ఇష్యూల ద్వారా దాదాపు రూ.9,500 కోట్లను సమీకరించాయి.  వీటిలో మేదాంతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్, ఆర్కియన్ కెమికల్స్​,  ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. ఎల్​ఐసీ,  లాజిస్టిక్స్ సంస్థ డెల్హివరీ సహా ఎనిమిది కంపెనీలు ఈ ఏడాది మేలో రూ. 30 వేల కోట్లను సేకరించాయి. వచ్చే వారం ధర్మజ్ క్రాప్ రూ. 216 కోట్ల విలువైన తాజా షేర్లను,  దాని ప్రమోటర్ల ద్వారా రూ. 35.15 కోట్ల విలువైన షేర్లను అమ్మి, రూ. 251 కోట్లను సమీకరించనుంది.  

ఈ ఆఫర్ నవంబర్ 28–-30 మధ్య సబ్‌‌‌‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటుంది. ఒక్కో షేరు ధర రూ. 216-–327.  ధర్మజ్ క్రాప్ గార్డ్ పురుగుమందులు,  కలుపు సంహారకాలు, ఎరువులు, యాంటీబయాటిక్స్ వంటివి  తయారు చేస్తుంది.  ఈ ఆగ్రోకెమికల్ కంపెనీ తాజా ఇష్యూతో వచ్చే ఆదాయాన్ని గుజరాత్‌‌‌‌లోని సైఖాలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఉపయోగిస్తుంది.  వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, అప్పులను తిరిగి చెల్లించడానికి కూడా కొంత డబ్బును ఉపయోగిస్తుంది. ఇంజనీరింగ్ సిస్టమ్స్ కంపెనీ యూనిపార్ట్స్ ఇండియా  ఐపీఓ నవంబర్ 30న ప్రారంభమై డిసెంబర్ 2న ముగుస్తుంది. 1.4 కోట్ల షేర్లను అమ్మడం ద్వారా రూ.836 కోట్లను కంపెనీ సేకరిస్తుంది.