ఇప్పపూల సేకరణ షురూ.. లడ్డూ, వివిధ రకాల ఉత్పత్తులు తయారీతో పెరిగిన డిమాండ్‌

ఇప్పపూల సేకరణ షురూ.. లడ్డూ, వివిధ రకాల ఉత్పత్తులు తయారీతో పెరిగిన డిమాండ్‌
  • సేకరణతో ఉపాధి పొందుతున్న ఆదివాసీలు
  • జీసీసీ ద్వారా కొనుగోళ్లకు కసరత్తు 

జయశంకర్‌ భూపాలపల్లి, వెలుగు :  ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్ప పువ్వు సేకరణ మొదలైంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌ అటవీ ప్రాంతాల్లో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో దొరికే ఇప్ప పవ్వు, ఇప్ప పలుకుల కోసం ఆదివాసీలు, గిరిజనులు తెల్లవారుజామునే అడవి బాట పడుతున్నారు. పువ్వును సేకరించిన అనంతరం ప్రైవేట్‌ వ్యక్తులతో పాటు గిరిజన సహకార సంస్థల్లో అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు. 

రెండో పంటగా ఇప్పపువ్వు

వ్యవసాయ సీజన్‌ ముగింపు సమయంలో ఇప్ప పూత ప్రారంభం అవుతుండడంతో ఆదివాసీలు ఈ పువ్వు సేకరణను రెండో పంటగా భావిస్తుంటారు. ప్రస్తుతం ఇప్ప పూల సీజన్‌ ప్రారంభం కావడంతో అడవిలో ప్రతి చెట్టు పూతతో  నిండుగా కనిపిస్తోంది. చెట్టు నుంచి వేకువ జామునే పువ్వు రాలుతుండడంతో ఆదివాసీలు ఆ పువ్వును సేకరిస్తున్నారు. దానిని ఎండబెట్టిన తర్వాత తమ అవసరాలకు సరిపోను దాచుకొని.. మిగతా పువ్వును అమ్మేస్తున్నారు. 

మార్కెట్‌లో మంచి డిమాండ్

ఇప్ప పువ్వుతో తయారు చేసిన ఉత్పత్తులకు ప్రస్తుతం మార్కెట్ లో మంచి డిమాండ్‌ ఉంది. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లో ఇప్పపువ్వులతో లడ్డూ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. జాతరలు, ప్రత్యేక పండుగల సమయాల్లో స్టాళ్లను ఏర్పాటు చేసి లడ్డూలను అమ్ముతున్నారు. ఇటివల జరిగిన మేడారం మహాజాతరలో ఏర్పాటు చేసిన స్టాల్‌ ద్వారా లక్షల్లో వ్యాపారం జరిగినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.

అలాగే ఇప్ప పువ్వుతో తయారు చేసే నాటుసారాకు సైతం మంచి డిమాండ్‌ ఉంటోంది. మరో వైపు ఇప్పపూలతో కుడుములు, రొట్టెలు, ఇప్ప గోంగూర, మసాలా, సత్తుపిండి జంతికలు వంటివి తయారు చేసి మార్కెట్‌లో అమ్ముతున్నారు.

జీసీసీ ద్వారా కొనుగోళ్లకు కసరత్తు

ఆదివాసీలు తాము సేకరించిన పువ్వును తమ అవసరాలకు సరిపడా ఉంచకొని మిగతాది అమ్మేస్తుంటారు. దీంతో గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో ఇప్ప పువ్వు కొనుగోళ్లకు కసరత్తు చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలోని మహాముత్తారం, పలిమెల, మహదేవపూర్‌ మండలాల్లోని ముకునూరు, నీలంపల్లి, జీలపల్లి, నిమ్మగూడెం ప్రాంతాల్లో ఇప్ప పువ్వు సేకరణ విరివిగా సాగుతోంది.

ఈ ఏరియా నుంచి గతేడాది జీసీసీ ద్వారా 71 క్వింటాళ్ల ఇప్ప పువ్వు  సేకరించినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ ఏడాది మహదేవపూర్‌తో పాటు ములుగు జిల్లాలోని వెంకటాపూర్, ఏటూరునాగారం, ములుగు, వరంగల్‌ జిల్లాలోని నర్సంపేటలో జీసీసీ బ్రాంచ్‌లు ఏర్పాటు చేసి ఇప్ప పువ్వు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్ప పలుకులు కిలో రూ.30, కిలో ఇప్ప పువ్వుకు రూ.29 చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. పూల సేకరణ పూర్తై.. వాటిని ఆరబెట్టిన తర్వాత కొనుగోళ్లు మొదలు పెట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రైవేట్‌ వ్యాపారులు మాత్రం కిలోకు రూ.70 వరకు చెల్లించేందుకు రెడీ ఉన్నట్లు తెలుస్తోంది.