
హైదరాబాద్, వెలుగు: ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతిని ఏపీకి పంపాలన్న కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్)లోని పిటిషన్‌పై తుది తీర్పు వెలువడే వరకు ఆయనను తెలంగాణలో కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ కేడర్ అధికారి అభిషేక్ మహంతి తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాలని కేంద్రం ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీకి వెళ్లేలా రిలీవ్ చేయాలని ఫిబ్రవరిలో తెలంగాణ సర్కార్‌కు కేంద్రం ఆదేశాలిచ్చింది. మహంతిని ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేయడంతో తిరిగి తెలంగాణకు కేటాయించాలని కోరుతూ ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. ఉత్తర్వులు రాకపోవడంతో హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయగా, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ తిరుమలాదేవి ధర్మాసనం సోమవారం విచారించింది.
కేంద్ర ప్రభుత్వం తరఫున ఏఎస్‌జీ బి. నరసింహశర్మ వాదనలు వినిపిస్తూ.. గతంలో క్యాట్, హైకోర్టు ఆదేశాల మేరకు2022లో మహంతిని తెలంగాణ కేడర్‌లోకి తీసుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 171 కేంద్ర ప్రభుత్వానికి తెలియదన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పీఎస్. రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ.. ఈ జీవోనే అభిషేక్‌ను తెలంగాణకు కేటాయించారనడానికి ఆధారమని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. క్యాట్ విచారణ ముగిసే వరకు తెలంగాణలోనే ఉండేలా అభిషేక్‌కు వెసులుబాటు ఇచ్చింది.