కువైట్ రిఫైనరీపై  ఇరాన్ మళ్లీ దాడి ..దుబాయ్, బహ్రెయిన్పైనా  దాడి 

కువైట్ రిఫైనరీపై  ఇరాన్ మళ్లీ దాడి ..దుబాయ్, బహ్రెయిన్పైనా  దాడి 
  • భారీగా ఎగసిపడిన మంటలు
  • ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లిన టెహ్రాన్ 
  • ఐఆర్జీసీ అధికార ప్రతినిధి నయీనీ మృతి 
  • ఇజ్రాయెల్​ను హెచ్చరించిన కొన్ని గంటలకే హతం 
  • శత్రువుల భద్రతను హరిస్తాం: మోజ్తబా ప్రకటన  
  • ఇరాన్ క్షిపణుల ఉత్పత్తి కేంద్రాలను పేల్చేశామన్న నెతన్యాహు
  • తమ క్షిపణుల ఉత్పత్తి ఆగలేదన్న ఇరాన్

టెహ్రాన్/జెరూసలెం/వాషింగ్టన్: పర్షియన్ నూతన సంవత్సరం 'నౌరూజ్' వేళ గల్ఫ్ ప్రాంతం యుద్ధ జ్వాలలతో అట్టుడుకుతోంది. శుక్రవారం తెల్లవారుజామున కువైట్‌‌లోని ప్రధాన చమురు శుద్ధి కర్మాగారంపై ఇరాన్ మరోసారి డ్రోన్లతో విరుచుకుపడగా, ఇజ్రాయెల్ జరిపిన బాంబుదాడులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ పేలుళ్లతో దద్దరిల్లింది.

కువైట్‌‌లోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం 'మీనా అల్-అహ్మది'పై శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ మరోసారి డ్రోన్ దాడులు చేసింది. గంటల వ్యవధిలో జరిగిన ఈ రెండో దాడి వల్ల రిఫైనరీలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ దాడి వల్ల జరిగిన ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రోజుకు 7.30 లక్షల బ్యారెళ్ల చమురును శుద్ధి చేసే ఈ కేంద్రం గురువారం నాటి దాడిలో ఇప్పటికే దెబ్బతినగా, తాజాగా మరో దాడితో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి.

అగ్నిమాపక సిబ్బంది వీటిని అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. తమ దేశంలోని 'సౌత్ పార్స్' గ్యాస్ ఫీల్డ్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడికి నిరసనగా ఇరాన్ ఈ దాడులను తీవ్రతరం చేసింది. దుబాయ్ నగరంపైకి వస్తున్న ఇరాన్ క్షిపణులను అక్కడి గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకోవడంతో భారీ శబ్దాలు వినిపించాయి.

రంజాన్ పండుగ ముగింపు సందర్భంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకల్లో ఉన్న ప్రజలు ఈ పేలుళ్లతో భయాందోళనలకు గురయ్యారు. బహ్రెయిన్ లో కూల్చివేసిన క్షిపణి శకలాలు ఒక గోదాముపై పడటంతో మంటలు అంటుకున్నాయి. తమ దేశంలోని చమురు నిక్షేపాలున్న తూర్పు ప్రాంతంపైకి వచ్చిన పలు డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ వెల్లడించింది.

ఇజ్రాయెల్ లో జెరూసలెం సహా ఉత్తర ప్రాంతాల్లో క్షిపణి హెచ్చరికల సైరన్లు మోగడంతో ప్రజలు షెల్టర్లలోకి పరుగులు తీశారు. కాగా, ఇప్పటివరకు ఇరాన్‌‌లో 1,300 మందికి పైగా, లెబనాన్‌‌లో 1,000 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్‌‌లో 15 మంది, వెస్ట్ బ్యాంక్‌‌లో నలుగురు ఇరాన్ క్షిపణి దాడులకు బలయ్యారు. అమెరికాకు చెందిన 13 మంది సైనికులు కూడా ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. తమ దేశ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న హిజ్బుల్లా, ఇరాన్ మద్దతు గల ఉగ్రవాద నెట్‌‌వర్క్‌‌ను ఛేదించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు యూఏఈ  ప్రకటించింది.

ఐఆర్జీసీ అధికార ప్రతినిధి నయీనీ హతం

ఇరాన్ సైనిక దళాలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) అధికార ప్రతినిధి జనరల్ అలీ మహమ్మద్ నయీనీ మరణించారు. ఇజ్రాయెల్ దాడులను తిప్పికొడతామని, ‘మిసైల్’ సర్ ప్రైజ్ ఇస్తామని హెచ్చరించిన కొద్ది గంటలకే ఆయన హతమయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ధృవీకరించింది. మరణానికి ముందు ఆయన మాట్లాడుతూ.. ఇరాన్ క్షిపణి వ్యవస్థలు ధ్వంసమయ్యాయన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వాదనలను కొట్టిపారేశారు. అమెరికా, ఇజ్రాయెల్ ఎన్ని దాడులు చేసినప్పటికీ, ఇరాన్ వద్ద క్షిపణులను తయారు చేసే సామర్థ్యం ఇంకా పదిలంగానే ఉందన్నారు.  

శత్రువుల భద్రతను హరిస్తాం: మొజ్తబా  

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతుల్లా మొజ్తబా ఖమేనీ శుక్రవారం జాతిని ఉద్దేశించి సందేశం పంపారు. శత్రువుల భద్రతను హరిస్తామని, వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. శత్రువు పూర్తిగా అలసిపోయే వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని పేర్కొన్నారు.  కాగా, అగ్రనేతలు వరుసగా మరణిస్తుండటంతో ఇరాన్ రక్షణ వ్యవస్థ ఒత్తిడికి లోనవుతోంది.

చమురు ధర180 డాలర్లకు చేరొచ్చు: సౌదీ  

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్‌‌ను అతలాకుతలం చేస్తున్నాయి. కీలకమైన హార్మూజ్ జలసంధిలో అడ్డంకులు ఏప్రిల్ నెలాఖరు వరకు కొనసాగితే, ముడి చమురు ధర బ్యారెల్‌‌కు180 డాలర్లకు చేరే అవకాశం ఉందని సౌదీ అరేబియా అధికారులు హెచ్చరించినట్లు 'వాల్ స్ట్రీట్ జర్నల్' పేర్కొంది.

దుబాయ్‌‌లో ఇరాన్ సంస్థల మూసివేత 

గల్ఫ్ యుద్ధ జ్వాలల నేపథ్యంలో, దుబాయ్‌‌లోని ఇరాన్ అనుబంధ సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. దుబాయ్‌‌లో 1972 నుంచి సేవలందిస్తున్న ప్రసిద్ధ 'ఇరానియన్ ఆసుపత్రి' శుక్రవారం మూతపడింది. దశాబ్దాలుగా సామాన్యులకు వైద్యం అందించిన ఈ ఆసుపత్రి ఇరాన్ నిఘా వర్గాలకు వేదికగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. 

గ్యాస్ ఫీల్డ్​పై దాడులు ఆపేస్తున్నాం: నెతన్యాహు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థన మేరకు, ఇరాన్‌‌కు చెందిన 'సౌత్ పార్స్' గ్యాస్ ఫీల్డ్ పై ఇకపై దాడులు చేయబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ అగ్ర నాయకులు వైమానిక దాడుల్లో మరణించారని, ఆ దేశ సైనిక సామర్థ్యం దెబ్బతిన్నదని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ వద్ద యురేనియంను శుద్ధి చేసే లేదా బాలిస్టిక్ క్షిపణులను తయారు చేసే సామర్థ్యం ప్రస్తుతం లేదని నెతన్యాహు చెప్పారు.