యుద్ధం జూన్ 30 వరకు నడుస్తుందన్న పోలీ మార్కెట్ : 69 శాతం పందెం రాయుళ్లది ఇదే మాట..!

యుద్ధం జూన్ 30 వరకు నడుస్తుందన్న పోలీ మార్కెట్ : 69 శాతం పందెం రాయుళ్లది ఇదే మాట..!

ఇరాన్ కేంద్రంగా సాగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదని ప్రపంచ దేశాలతో పాటు, భవిష్యత్తును అంచనా వేసే ప్రెడిక్షన్ మార్కెట్లు కూడా గట్టిగా నమ్ముతున్నాయి. సాధారణంగా రాజకీయ పరిణామాలు లేదా యుద్ధాల ముగింపుపై బెట్టింగ్‌లు కాసే క్రిప్టో ఆధారిత ప్లాట్‌ఫారమ్ 'పాలిమార్కెట్'లో ప్రస్తుతం ఆసక్తికరమైన మార్పులు కనిపిస్తున్నాయి. కేవలం వారం రోజుల క్రితం వరకు యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ఆశించిన వారంతా.. ఇప్పుడు తమ అంచనాలను మార్చుకుంటున్నారు. పాలిమార్కెట్ డేటా ప్రకారం.. మార్చి 31 నాటికి యుద్ధం ముగుస్తుందనే అంచనాలు కేవలం 5 శాతానికి పడిపోయాయి. అంటే ఈ నెలాఖరుకు శాంతి నెలకొనే అవకాశం లేదని మెజారిటీ ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.

ఈ యుద్ధం ఎంతకాలం సాగొచ్చు అనే అంశంపై పాలిమార్కెట్ వేదికగా లక్షలాది డాలర్ల ట్రేడింగ్ జరుగుతోంది. తాజా ట్రేడింగ్ ప్రకారం ఏప్రిల్ 30 నాటికి యుద్ధం ముగిసే అవకాశం 35 శాతంగా ఉండగా, జూన్ 30 వరకు ఇది కొనసాగే అవకాశం ఏకంగా 69 శాతంగా ఉందని పందెం రాయుళ్లు అంచనా వేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆపరేషన్ నాలుగు నుంచి ఐదు వారాల్లో ముగియవచ్చని గతంలో సూచించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కేవలం క్రిప్టో మార్కెట్లే కాదు, అమెరికా ఇంటెలిజెన్స్ అంచనాలను విశ్లేషించే గుడ్ జడ్జిమెంట్ నెట్‌వర్క్ కూడా మే మధ్య వరకు కాల్పుల విరమణ జరిగే అవకాశం లేదని 43 శాతం మేర అంచనాలను పంచుకుంది. 

ఈ సుదీర్ఘ యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం ఆందోళన కలిగిస్తోంది. యుద్ధం పొడిగించబడటం వల్ల ముడిచమురు ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రాకపోవడం వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ కూడా పెరుగుతున్న ఇంధన ధరల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం ఆర్థికంగా ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు ద్రవ్యోల్బణం భయం, మరోవైపు నెమ్మదిస్తున్న ఉపాధి మార్కెట్ మధ్య ఫెడ్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్ల తగ్గింపుపై వెనక్కి తగ్గుతోంది.

పెట్టుబడిదారుల కోణంలో చూస్తే.. యుద్ధం సాగడం అంటే క్రూడ్ ఆయిల్ రేట్ల మంట, ఆర్థిక అనిశ్చితి అని అర్థం. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కూడా తాము ఎప్పుడూ కాల్పుల విరమణ కోరలేదని వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో క్రిప్టో మార్కెట్లు కేవలం ఈ యుద్ధానికి స్పందించడమే కాకుండా, రాబోయే దీర్ఘకాలిక అనిశ్చితిని ఇప్పుడే అంచనా వేస్తూ ముందస్తుగా స్పందిస్తున్నాయి. ఒకవేళ ఆకస్మికంగా కాల్పుల విరమణ ఒప్పందం జరిగితే తప్ప.. మార్కెట్లు ఇప్పట్లో కోలుకోవడం కష్టమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మెుత్తానికి పందెం రాయుళ్లు బెట్స్ నిజమే అయితే మరో మూడు నెలల పాటు ఇరాన్ యుద్ధం సామాన్యులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తుందని తేలిపోయింది.