హిందూ మహాసముద్రంపైకి ఇరాన్‌‌ మిసైల్స్.. 4 వేల కిలో మీటర్ల దూరంలోని యూఎస్-యూకే బేస్పై గురి

హిందూ మహాసముద్రంపైకి ఇరాన్‌‌ మిసైల్స్.. 4 వేల కిలో మీటర్ల దూరంలోని యూఎస్-యూకే బేస్పై గురి
  • తన అమ్ముల పొదిలోని రహస్య ఆయుధాలను బయటకు తీస్తున్న ఇరాన్‌‌

  • పశ్చిమాసియా యుద్ధం తీవ్రరూపం.. ఆందోళనలో ప్రపంచ దేశాలు

  • డియెగో గార్సియాలోని సైనిక స్థావరంపైకి 2 బాలిస్టిక్ క్షిపణులు

  • ఒకటి మధ్యలోనే విఫలం.. మరోదాన్ని అడ్డుకున్న అమెరికా సైన్యం

టెహ్రాన్‌‌: పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు హిందూ మహాసముద్రానికి తాకాయి. ఇరాన్ తన అమ్ములపొదిలోని రహస్య ఆయుధాలను బయటకు తీసింది. హిందూ మహాసముద్రంలోని అత్యంత కీలకమైన అమెరికా–-బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం ‘డియెగో గార్సియా’ లక్ష్యంగా రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. 

 కానీ.. 4 వేల కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ టార్గెట్‌‌ను అవి తాకలేదు.  అమెరికా అధికారుల సమాచారం ప్రకారం.. ఇరాన్ రెండు క్షిపణులను ప్రయోగించగా, అందులో ఒకటి సాంకేతిక కారణాలతో గాలిలోనే విఫలమైంది. రెండో దానిని అమెరికా యుద్ధనౌక ఎస్‌‌ఎం 3 ఇంటర్‌‌‌‌సెప్టర్‌‌‌‌ ద్వారా అడ్డుకున్నట్టు తెలుస్తున్నది.  ఈమేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. 

అయితే, ఈ మిసైల్స్‌‌ను ఎప్పుడు ప్రయోగించారనే దానిపై క్లారిటీ లేదు. దీనిపై ఇరాన్‌‌ నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. కాగా, కొద్దిరోజుల క్రితమే శ్రీలంకకు దక్షిణంగా ఉన్న హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధనౌక  ‘ఐఆర్ఐఎస్ దేనా’ను అమెరికా సబ్ మెరైన్ టార్పెడోతో ముంచేసింది. దీనికి ప్రతీకారంగానే ఇరాన్ ఇప్పుడు అమెరికా వ్యూహాత్మక కేంద్రమైన డియెగో గార్సియాను ఎంచుకున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రపంచ దేశాల విస్మయం..

డియెగో గార్సియా.. హిందూ మహాసముద్రంలో 60 దీవుల సముదాయం చాగోస్‌‌లో అతిపెద్దది. ఇక్కడ యూఎస్‌‌–-యూకేకు సంయుక్తంగా సైనిక స్థావరం ఉన్నది.  హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ స్థావరం..అమెరికాకు అత్యంత కీలకమైన లాజిస్టిక్, స్ట్రైక్' ప్లాట్‌‌ఫారమ్. ఇక్కడి నుంచే అమెరికా తన భారీ బాంబర్, నిఘా విమానాలను నడుపుతుంది. కాగా,  ఈ దాడి ద్వారా ఇరాన్ కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాదని, యూరప్‌‌లోని ఏ మూలనైనా తాము తాకగలమని సంకేతాలు పంపింది.