- వెంటనే ఖాళీ చేయకపోతే చమురు బావులు మూతపడే అవకాశం
- చమురును నిల్వ చేసేందుకు ‘నషా’ ట్యాంకర్‌ను రంగంలోకి దించిన ఇరాన్
ఇరాన్‌లో చమురు నిల్వలు నిండిపోతున్నాయి. హార్మూజ్ ను అమెరికా దిగ్బంధించడంతో ఎగుమతులు నిలిచిపోయి ఉత్పత్తి అయిన చమురును ఎక్కడ నిల్వ చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నది.
టెహ్రాన్: ఇరాన్‌లో చమురు నిల్వలు నిండిపోతున్నాయి. అమెరికా దిగ్బంధంతో ఎగుమతులు నిలిచిపోవడంతో ఉత్పత్తి అయిన చమురును ఎక్కడ నిల్వ చేయాలో తెలియక తలలు పట్టుకుంటోంది. ఒకవేళ ఉత్పత్తి ఆపివేస్తే చమురు బావులు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీంతో నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇరాన్ తన 30 ఏండ్ల పాత చమురు ట్యాంకర్ ‘నషా’(డెడ్ ట్యాంకర్)ను రంగంలోకి దించింది. ఇరాన్ చమురు ఎగుమతుల్లో 90 శాతం వాటా ఖర్గ్ ఐలాండ్ నుంచే వస్తోంది. ప్రస్తుతం అక్కడ నిల్వలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
ఖర్గ్‌లో మొత్తం సామర్థ్యం 30 మిలియన్ బారెళ్లు కాగా, ప్రస్తుతం 13 మిలియన్ బారెళ్లకు మాత్రమే నిల్వ సామర్థ్యం ఉందని మారిటైమ్ నిపుణులు చెబుతున్నారు. ఖర్గ్ ఐలాండ్‌లో రోజుకు సగటున 10 నుంచి 11 లక్షల (1 మిలియన్) బారెళ్ల చమురు నిల్వలు వచ్చి చేరుతున్నాయి.
మరో 12, 13 రోజుల్లో అక్కడ పూర్తి స్థాయిలో ఇంధనం నిండిపోయే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం నషా ట్యాంకర్‌ను ‘ఫ్లోటింగ్ స్టోరేజీ (సముద్రంపై నిల్వ కేంద్రం)ని అందుబాటులోకి తెచ్చినా.. ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని తెలుస్తోంది. అమెరికా దిగ్బంధం ఇలాగే కొనసాగితే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బావులను మూసివేస్తే జరిగే నష్టం ఏమిటి ?
చమురు నిల్వలు భూగర్భంలో గ్యాస్, నీటి ఒత్తిడి మధ్య ఉంటాయి. ఉత్పత్తిని అకస్మాత్తుగా నిలిపివేస్తే ఒత్తిడి పెరిగి, దిగువన ఉండే నీరు చమురు ఉన్న భూగర్భ పొరల్లోకి చొచ్చుకు వస్తుంది. దీని వల్ల చమురు శాశ్వతంగా రాళ్ల మధ్య చిక్కుకుపోయి, భవిష్యత్తులో వెలికితీయడానికి సాధ్యపడదు.
అయితే, హార్మూజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించడంతో చమురు నిండిన నౌకలు బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. నషా ట్యాంకర్లలో చమురును నింపాలని నిర్ణయించినప్పటికీ.. ఇవి పూర్తి స్థాయిలో ఉపశమనం కల్పించలేవు. ఒకవేళ చమురు బావులను మూసివేస్తే ఇరాన్ భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

