కాల్పుల విరమణకు ఒప్పుకోం.. శాశ్వతమైన ముగింపు కావాలన్న ఇరాన్

కాల్పుల విరమణకు ఒప్పుకోం.. శాశ్వతమైన ముగింపు కావాలన్న ఇరాన్

టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్​తో జరుగుతున్న యుద్ధంలో తాము వెనక్కి తగ్గబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. కాల్పుల విరమణకు ఒప్పుకోబోమని తేల్చిచెప్పారు. యుద్ధానికి తాత్కాలిక విరామం కాదు శాశ్వత ముగింపును కోరుకుంటున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్లపై అరాఘ్చీ మండిపడ్డారు. ఇరాన్ పై పైచేయి సాధించామని, యుద్ధాన్ని ముగించేందుకు సమాలోచనలు జరుపుతున్నామని ట్రంప్​ అన్నారు. ఈ కామెంట్లపై అరాఘ్చీ మండిపడుతూ.. అమెరికా ఎన్నడూ నిజాలు మాట్లాడదని ‘ఎక్స్’ లో విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని వియత్నాం యుద్ధంతో పోల్చి అమెరికాను ఆయన ఎద్దేవా చేశారు.

‘‘వియత్నాంతో యుద్ధంలో ఏం జరిగిందో ఇప్పుడు మాతో మీరు (అమెరికా) చేస్తున్న వార్ లోనూ అదే జరుగుతోంది. వియత్నాంతో యుద్ధంలో కొన్ని వందల మంది అమెరికన్  సైనికులు చనిపోయారు. ఈ విషయాన్ని అమెరికన్లు ఎప్పుడూ మరిచిపోరు. అప్పుడు వియత్నాంతో యుద్ధం జరుగుతుండగా.. జనరల్  విలియం వెస్ట్ మోర్ ల్యాండ్  హుటాహుటిన అమెరికాకు వెళ్లి వియత్నాంతో యుద్ధంలో తాము గెలుస్తున్నట్లు దేశ ప్రజలకు చెప్పారు. ఆయన చెప్పినవన్నీ పిట్ట కథలని ఆ దేశ మీడియాకు కూడా తెలుసు’’ అని అరాఘ్చీ వ్యాఖ్యానించారు.

ఇప్పుడు కూడా అమెరికా అలానే అబద్ధాలు చెబుతోందని, క్షేత్ర స్థాయిలో పరిస్థితికి, వారు చెప్పేదానికి చాలా తేడా ఉందని ఆయన పేర్కొన్నారు. ‘‘ఇరాన్ పై పైచేయి సాధించామని ట్రంప్  చెబుతున్నారు. కానీ, అది నిజం కాదు. ఇటీవలే అమెరికా ఎఫ్​35 ఫైటర్ జెట్ ను కూడా మేము దెబ్బకొట్టాం” అని అరాగ్చీ చెప్పారు. కాగా, హార్మూజ్  జలసంధి గుండా జపాన్  నౌకలు వెళ్లేందుకు సహకరిస్తామని అరాఘ్చీ హామీ ఇచ్చారు. అయితే, జపాన్  కూడా తమకు సహకరించాలని ఆయన కోరారు. జలసంధిని తాము క్లోజ్  చేయలేదని, అది ఓపెన్ గానే ఉందని క్యోడో న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.