అమెరికా ‘రెడ్ లైన్స్’ దాటితే గల్ఫ్ ఆవలా దాడులు చేస్తం: ఇరాన్ వార్నింగ్

అమెరికా ‘రెడ్ లైన్స్’ దాటితే గల్ఫ్ ఆవలా దాడులు చేస్తం: ఇరాన్ వార్నింగ్

టెహ్రాన్: హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలనే గడువు సమీపిస్తున్న వేళ, ఇరాన్ ఇంధన వనరులు, కీలక మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులను పెంచడంతో.. యుద్ధాన్ని పశ్చిమాసియా దాటి విస్తరిస్తామని ఇరాన్ ఉన్నత స్థాయి దళాలు హెచ్చరించాయి. "అమెరికా ఉగ్రవాద సైన్యం రెడ్ లైన్స్ దాటితే, మా స్పందన ఈ ప్రాంతం దాటి ఉంటుంది. మేము పౌర మౌలిక వసతుల లక్ష్యాలపై దాడులను ప్రారంభించలేదు, ప్రారంభించబోము. అయితే, మా పౌర సదుపాయాలపై జరిగే నీచమైన దాడులను తిప్పికొట్టడానికి మేం ఏమాత్రం వెనుకాడబోం" అని ఐఆర్జీసీ(ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ కోర్) తన తాజా ప్రకటనలో తెలిపింది. 

పశ్చిమాసియాలో అమెరికా, దాని మిత్రదేశాలకు "ఏళ్ల తరబడి చమురు, గ్యాస్ అందకుండా చేసేలా" అక్కడి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని కూడా ఐఆర్జీసీ హెచ్చరించింది. "మంచి పొరుగు సంబంధాల కోసం మేం ఇప్పటివరకు చాలా సంయమనం పాటించామని, ప్రతీకార దాడుల లక్ష్యాలను ఎంచుకోవడంలో కొన్ని పరిమితులు విధించుకున్నామని అమెరికా ప్రాంతీయ భాగస్వాములు తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు ఆ పరిమితులన్నీ తొలగిపోయాయి" అని పేర్కొంది. 

పశ్చిమాసియా అంతటా అమెరికా, ఇజ్రాయెల్ కేంద్రాలపై జరుపుతున్న దాడుల పరంపరను ఇరాన్ 'ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4'గా పేర్కొంటోంది. ఇందులో భాగంగా జరిగిన 'వేవ్ 99' వివరాలను కూడా ఈ ప్రకటనలో ఐఆర్జీసీ వెల్లడించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం, హార్మూజ్ జలసంధిలోని అమెరికా "స్థావరాలు, ప్రయోజనాలు" అలాగే ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సైనిక కేంద్రాలు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థలను బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లతో లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. సౌదీ అరేబియాలో అమెరికా కంపెనీలకు చెందిన రెండు పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై మధ్య శ్రేణి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో దాడులు చేసినట్లు తెలిపింది. సైనిక పరికరాలను చేరవేస్తున్న ఒక ఇజ్రాయెల్ కంటైనర్ నౌకపై కూడా ఖచ్చితమైన దాడి జరిగినట్లు వివరించింది.