ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ మిసైల్స్.. డిమోనాలోని అణు కేంద్రమే టార్గెట్

ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ మిసైల్స్..  డిమోనాలోని అణు కేంద్రమే టార్గెట్

 

  • రెండు సిటీలలో భారీ ఎత్తున పేలుళ్లు
  • 10 భవనాలు ధ్వంసం.. 100 మందికిపైగా గాయాలు 
  • బాలిస్టిక్ మిసైల్స్ ను అడ్డుకోలేకపోయిన డిఫెన్స్ వ్యవస్థలు 
  • రేడియేషన్ లీకేజీ ముప్పు లేదని ఐఏఈఏ ప్రకటన
  • నతాంజ్ అణు కేంద్రంపై దాడికి ప్రతీకారంగానే ఇరాన్ అటాక్

టెహ్రాన్/జెరూసలెం: దక్షిణ ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌లోని రెండు ప్రాంతాలపై ఇరాన్ శనివారం అర్ధరాత్రి బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్‌‌‌‌‌‌‌‌లోని నతాంజ్ అణు కేంద్రంపై శనివారం జరిగిన దాడులకు ప్రతీకారంగా.. ఇజ్రాయెల్ అణు పరిశోధనా కేంద్రం ఉన్న డిమోనా, అరాద్ నగరాలపై ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడుల్లో పలు భవనాలు ధ్వంసం కాగా100 మందికి పైగా గాయపడ్డారు. డిమోనాలోని 'షిమోన్ పెరెస్ నెగెవ్ అణు పరిశోధనా కేంద్రం' లక్ష్యంగా ఈ దాడి జరిగింది. అయితే, వందల కిలోల బరువున్న వార్‌‌‌‌‌‌‌‌హెడ్‌‌‌‌‌‌‌‌లతో కూడిన బాలిస్టిక్ క్షిపణులు నివాస భవనాలపై పడటంతో బిల్డింగ్స్​ ధ్వంసమయ్యాయి. క్షిపణులు పడ్డ ప్రాంతంలో భారీ గొయ్యిలు ఏర్పడ్డాయని ఏఎఫ్‌‌‌‌‌‌‌‌పీ వార్తా సంస్థ తెలిపింది. అరాద్ నగరంలో 84 మంది గాయపడగా, వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. అరాద్ లో జరిగిన దాడిలో కనీసం 10 అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ భవనాలు దెబ్బతిన్నాయని, వాటిలో మూడు కూలిపోయే స్థితిలో ఉన్నాయని సహాయక సిబ్బంది తెలిపారు. ఈ ఘటనలో కనీసం 64 మంది ఆసుపత్రుల పాలయ్యారని పేర్కొన్నారు. డిమోనాలో జరిగిన దాడిలో 33 మంది గాయపడ్డారని చెప్పారు. "అక్కడ అంతా విధ్వంసం, గందరగోళంగా ఉంది" అని సహాయక సిబ్బంది పేర్కొన్నారు. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నట్లు క్షిపణులు పడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ.. ఇది చాలా కష్టమైన రోజు అని, ఘటనా స్థలానికి అదనపు అత్యవసర బృందాలను పంపుతున్నామని తెలిపారు. 


శత్రువులపై అన్ని రకాలుగా దాడులు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ వ్యవస్థలు ఫెయిల్ గగనతల రక్షణ వ్యవస్థలు పని చేసినప్పటికీ, ఇరాన్ క్షిపణులను అడ్డుకోలేకపోయాయని, దీనిపై విచారణ జరుపుతామని ఇజ్రాయెల్ రక్షణ దళాల (ఐడీఎఫ్) ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ పేర్కొన్నారు. "నా హృదయం అరాద్, డిమోనా ప్రజల గురించే ఆలోచిస్తోంది" అని ఆయన తెలిపారు. అరాద్‌‌‌‌లోని దెబ్బతిన్న భవనాలను ఇజ్రాయెల్ సైనికులు పరిశీలిస్తున్న చిత్రాలు కూడా వెలుగులోకి వచ్చాయి. కాగా, "అత్యంత పటిష్టమైన రక్షణ ఉన్న డిమోనా ప్రాంతంలో ఇజ్రాయెల్ క్షిపణులను అడ్డుకోలేకపోతే, ఇది యుద్ధంలో కొత్త దశకు సంకేతం" అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఖలీబాఫ్ పేర్కొన్నారు. డిమోనా నగరం అణు పరిశోధనా కేంద్రానికి పశ్చిమంగా 20 కిలోమీటర్ల దూరంలో, అరాద్ నగరం ఉత్తరంగా 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ అణు కేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని, అసాధారణ రేడియేషన్ నమోదు కాలేదని ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షణ సంస్థ(ఐఏఈఏ) స్పష్టం చేసింది. మరోవైపు, టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న ఇరాన్ ఉగ్రవాద లక్ష్యాలపై ఇజ్రాయెల్ దళాలు ప్రస్తుతం దాడులు చేస్తున్నాయని ఒక సంక్షిప్త ప్రకటన వెలువడింది. కాగా, ఇరాన్‌‌‌‌లోని నతాంజ్ అణు కేంద్రంపై శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. అక్కడ ఎలాంటి రేడియేషన్ లీకేజీ కాలేదని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ 'మీజాన్' స్పష్టం చేసింది. అయితే, నతాంజ్ అణు కేంద్రంపై జరిగిన దాడితో తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. 

హార్మూజ్​పై అంతర్జాతీయ ఒత్తిడి

హార్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు ఇరాన్ విఘాతం కలిగిస్తున్న నేపథ్యంలో, సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించే ప్రయత్నాల్లో భాగస్వాములవుతామని ఐక్య అరబ్ ఎమిరేట్స్ ప్రకటించింది. బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ సహా మరో 21 దేశాలు ఈ నిర్ణయానికి మద్దతు తెలిపాయి. శుక్రవారం నాటికి నౌకల్లో లోడ్ చేసిన ఇరాన్ చమురుపై ఆంక్షలను తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనివల్ల చమురు ఉత్పత్తి పెరగదు కాబట్టి ధరల తగ్గుదలకు ఇది పరిష్కారం కాబోదు. ఏళ్ల తరబడి ఆంక్షల నుంచి తప్పించుకుంటున్న ఇరాన్ చమురు మంత్రిత్వ శాఖ దీనిపై స్పందిస్తూ.. "తమ వద్ద నిల్వ ఉంచిన ముడి చమురు అసలు ఏమీ మిగిలి లేదు" అని సమాధానమిచ్చింది. కాగా, ఈ యుద్ధంలో ఇరాన్ లో మరణాల సంఖ్య 1,500 దాటిందని అక్కడి ఆరోగ్య శాఖను ఉటంకిస్తూ ప్రభుత్వ టీవీ చానెల్ వెల్లడించింది. ఇరాన్ క్షిపణుల వల్ల ఇజ్రాయెల్‌‌‌‌లో 15 మంది, వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో నలుగురు మరణించారు. కనీసం 13 మంది అమెరికా సైనికులతో పాటు గల్ఫ్ దేశాల్లో 15 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

లెబనాన్​లో భూతల పోరు

దక్షిణ లెబనాన్ ప్రాంతంలో తాము "నిర్దిష్ట లక్ష్యాలతో కూడిన భూతల దాడి" నిర్వహిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ పోరాటంలో ఆదివారం నలుగురు హిజ్బుల్లా ఫైటర్లు మరణించారు. దక్షిణ గ్రామం ఖియామ్‌‌‌‌లో ఇజ్రాయెల్ దళాలతో తమ ఫైటర్లు తలపడ్డారని హిజ్బుల్లా ధృవీకరించింది. హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో ఇప్పటివరకు 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, 10 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారని లెబనాన్ ప్రభుత్వం వెల్లడించింది. హిజ్బుల్లాకు చెందినవాటితోపాటు పౌర ఆస్తులను కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటోందని తెలిపింది.

మొజ్తబా కోసం సీఐఏ, మొసాద్ వేట 

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆచూకీ కోసం అమెరికాకు చెందిన సీఐఏ, ఇజ్రాయెల్‌కు చెందిన మొసాద్ గూఢచారి సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో తన తండ్రి, భార్య, కుమారుడు మరణించిన తర్వాత మొజ్తబా ఇప్పటివరకు బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. మార్చి 9న ఇరాన్ మూడవ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. పర్షియన్ నూతన సంవత్సరం 'నవ్రోజ్' సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని ప్రపంచవ్యాప్తంగా నిఘా సంస్థలు వేచి చూశాయి. అయితే ఆయన నుంచి కేవలం ఒక లిఖితపూర్వక ప్రకటన మాత్రమే వెలువడటంతో.. ఆయన ఆరోగ్యం, క్షేమ సమాచారాలపై మిస్టరీ మరింత పెరిగింది.

‘లిటిల్ ఇండియా’ డిమోనా

ఇజ్రాయెల్‌‌‌‌లోని డిమోనా నగరాన్ని 'లిటిల్ ఇండియా' అని పిలుస్తారు. 1950-60ల్లో మహారాష్ట్ర నుంచి వలస వెళ్ళిన 'బెనె ఇజ్రాయెల్' యూదులు ఇక్కడ భారీగా స్థిరపడటమే దీనికి కారణం. ఈ నగర జనాభాలో సుమారు 35% మంది భారతీయ మూలాలున్నవారే. ఇక్కడ భారతీయ వంటకాలు, మరాఠీ సంస్కృతి, క్రికెట్ వంటివి నేటికీ కనిపిస్తాయి. భారత్‌‌‌‌తో ఉన్న ఈ సాంస్కృతిక అనుబంధం కారణంగా డిమోనా ను 'లిటిల్ ఇండియా'గా పిలుస్తుంటారు.